ప్రత్యర్థిని బట్టి రాజకీయ సమీకరణలు మారుతూ ఉంటాయి. ఇరువర్గాలు పోటీదారులను బట్టి విమర్శలకు పదునుపెడుతుంటాయి. టీఆర్‌ఎస్‌కు జిల్లాలో కాంగ్రెస్ పార్టీనే బలమైన ప్రత్యర్థి. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది. అయితే.. ప్రత్యర్థి ఎవరనేది తెలియకుండా ప్రచారం చేయడం టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఇబ్బందిగా ఉంది.
సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్.. నెలన్నర రోజుల క్రితమే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలై రెండు వారాలు దాటింది.. మరి కొద్ది రోజుల్లో నామినేషన్ల దాఖలకు నోటిఫికేషన్ కూడా రానుంది. కానీ.. ప్రతిపక్ష పార్టీల్లో మాత్రం టికెట్ల కేటాయింపు అంశం ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఆ పార్టీలోని ఆశావహులు నిరాశలో కొట్టుమిట్టాడుతుండగా.. ‘గులాబీ’ అభ్యర్థుల్లో నిరుత్సాహం కనిపిస్తోంది. అదేంటి.. వాళ్లకు టికెట్ రాకుంటే వీళ్లకేంది.. అనే కదా మీ అనుమానం? కుస్తీ పట్టాలి అంటే పోటీదారుడు ఉండాలి కదా..! ప్రత్యర్థి ఎవరో తెలియకపోవడంతో ఎవరితో పోటీ పడాలి? ఎవరిని విమర్శించాలి? ఓట్లు ఎలా అడగాలో పాలుపోక టీఆర్‌ఎస్ అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. ప్రత్యర్థి తేలేదాకా కుల సంఘాల నేతలు, ఇతర చోటామోటా నాయకులను ఇంటికే పిలిపిం చుకుని మాట్లాడుతూ కాలం గడుపుతున్నారు.
తగ్గిన క్షేత్రస్థాయి పర్యటనలు..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లిన నాడే ఉమ్మడి జిల్లాలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వారు ఇప్పటికే క్షేత్రస్థాయిలో చెక్కర్లు కొట్టి వచ్చారు. సభలు, సమావేశాలు నిర్వహిస్తూ కేడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసే పనిలో పడ్డారు. అయితే ఎన్నికలు అనుకున్న సమయం కంటే నెల రోజులు వెనక్కి వెళ్లడం.. ప్రత్యర్థులెవరనే స్పష్టత లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనలు తగ్గించారు. సాఫ్ట్ వర్కులో నిమగ్నమయ్యారు. కూటమిలోని పార్టీలతో సీట్ల సర్దుబాటు అంశం తేలే వరకు ‘హస్తం’ పార్టీలో అభ్యర్థుల ప్రకటన ఉండదని సమాచారం. ఒకవేళ నెలాఖరున తొలి జాబితా వచ్చినా.. ఎందరి పేర్లుంటాయనే దానిపై స్పష్టత లేదు. పాలకుర్తి, భూపాలపల్లి, జనగామ, నర్సంపేట అభ్యర్థుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఇక్కడ నేతలు టికెట్లపై ధీమాతో అడపాదడపా ప్రచారం చేస్తున్నారు. మిగతా చోట్ల ప్రచారం ప్రారంభం కాని పరిస్థితి ఉంది. బీజేపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
నర్సంపేటలో..
ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి ఈ సారి కసిమీద ఎన్నికల ప్రచారంలోకి దిగారు. తన రాజకీయ ప్రత్యర్థి, కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆశావహ అభ్యర్థి దొంతి మాధవరెడ్డి మీద విమర్శనాస్త్రాలకు పదునుపెట్టుకున్నారు. టికెట్ వచ్చిన కొత్తలో గ్రామాల్లో తిరిగారు. కాగా, మహాకూటమి పొత్తులో భాగంగా నర్సంపేట టికెట్‌ను టీడీపీకి కేటాయించమని కోరినట్లు, మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చనే ప్రచారం తెరమీదకు రావడంతో పెద్ది కొంత అయోమయంలో పడ్డారు.ప్రచారం జోరు తగ్గించి కుల సంఘాల నేతలతో మాట్లాడే పని పెట్టుకున్నారు. దొంతి మాధవరెడ్డి జోరు మీదనే ప్రచారం చేస్తున్నాడు కానీ.. పొత్తు టుపోయి ఎవరి కొంప ముంచుతుందో తెలియక కొంత ఆత్మరక్షణలో పడ్డారు. మొత్తానికి నియోజకవర్గంలో పూర్తి స్థాయి ప్రచారం చేయలేకపోతున్నారు.
పాలకుర్తి.. జనగామలో..
పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు జోరుగా ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. కావలసినంత సమయం దొరకడంతో దయాకర్‌రావు భార్య ఉషా కొన్ని మండలాలు, దయాకర్‌రావు కొన్ని మండలాల్లో తిరుగుతున్నారు. ఆయన ప్రత్యర్థి ఎవరనే విషయం తేలకపోవడంతో కొంత నైరా శ్యం నెలకొని ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆశావహుడిగా జంగా రాఘవరెడ్డి దీటుగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ.. దుగ్యాల శ్రీనివా సరావు భార్య సుమన, మొగుళ్ల అశోక్ కుమార్, బిళ్ల సుధీర్‌రెడ్డి ఎవరికి వాళ్లు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చెమటలు తీస్తున్నారు.
ఇక్కడ అభ్యర్థి విషయంపై ఒక స్పష్టత ఉంది. కాంగ్రెస్ పార్టీ నేత కూడా ప్రచారం మొదలు పెట్టారు. చేరికలు, కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇక.. మలుగు, డోర్నకల్, వరంగల్ పశ్చిమ, తూర్పు, వర్ధన్నపేటలో బహుముఖ పోటీ ఉంది. టీపీసీసీ ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పున వ్యక్తుల పేర్లను అధిష్టానం ముందు పెట్టింది. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఎవరికి వారుగా టికెట్ మాదంటే మాదే అనే ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులు ఎవరని స్పష్టంగా తేలిన తర్వాతే క్షేత్రస్థాయి ప్రచారంలోకి వెళ్లాలని టీఆర్‌ఎస్ నేతలు భావిస్తున్నారు.
జోరు పెంచుతూ.. తగ్గుతూ..
టీఆర్‌ఎస్ పార్టీ 11 నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించింది. ప్రచారంలో జోరును పెంచింది. అభ్యర్థులు పార్టీ పరంగా ప్రత్యర్థి పార్టీలను ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతూనే ఉన్నాయి. సభలు, పత్రికా సమావేశాల్లో కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను విమర్శిస్తూనే ఉన్నారు. అయితే నియోజకవర్గాలో ప్రత్యర్థిని బట్టి మేజర్‌గా రాజకీయ సమీకరణాలు మారుతూ ఉంటాయి. ఇరువర్గాలు ప్రత్యర్థులను బట్టి విమర్శనాస్త్రాలకు పదునుపెడుతుంటారు. టీఆర్‌ఎస్‌కు జిల్లాలో కాంగ్రెస్ పార్టీనే బలమైన ప్రత్యర్థి. కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీ కూడా గట్టి పోటీ ఇస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రత్యర్థి ఎవరనేది తెలియకుండా ప్రచారం చేయడం టీఆర్‌పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా ఉంది. పోనీ ఎవరినో ఒకరిని టార్గెట్ చేసుకుని ప్రచారాస్త్రాలు సంధిద్దామంటే కాంగ్రెస్, బీజేపీలో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరేసి నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు. టికెట్ తనకే పక్కాగా వస్తుందని మొదటి నుంచి చెబుతున్న నేతలు కూడా.. రోజురోజుకు మారుతున్న సమీకరణాలతో అయోమయానికి గురవుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రత్యర్థులు తేలే వరకు హడావుడి లేకుండా ప్రచారం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment