దప్పిక తీరే దారేది? | water problems | Sakshi
Sakshi News home page

దప్పిక తీరే దారేది?

Published Sun, Apr 6 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 5:37 AM

దప్పిక తీరే దారేది?

దప్పిక తీరే దారేది?

బాసర, న్యూస్‌లైన్ : బాసరలోనే కాకుండా ముథోల్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు వేసవి వచ్చిందంటే చాలు నీటి కోసం నానా తిప్పలు పడాల్సిన పరిస్థితులు దాపురిస్తాయి. కారణం ఈ కాలంలో భూగర్భ జలాలు అడుగంటిపోతుంటాయి.

దీంతో మహిళలు ఉదయం నుంచే చేతిపంపులు, వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.అయితే అందరూ అక్కడికి చేరడంతో నీటి కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. గ్రామ శివారులోని వ్యవసాయ భూముల్లో త్రీఫేజ్ కరెంట్ సరఫరా ఉండడంతో ఎండ్లబండ్లపై, ట్యాంకర్లపై నీటిని తెచ్చుకుంటున్నారు.
 
 గొంతు తడపని నీటి పథకాలు

మండలంలోని బాసర ఆలయం, బిద్రెల్లి గ్రామాలకు గోదావరి ఫిల్టర్‌బెడ్(ఫేస్ 1) సమగ్ర తాగునీటి పథకం నిర్మాణ పనులు రూ.4 కోట్లతో చేపట్టారు. పనులు ప్రారంభమై ఏడాది పూర్తవుతున్నా ఇప్పటికీ అది బాసర గ్రామ ప్రజలకు కుళాయి ద్వారా సరిపడా నీరందించడం లేదు. పైప్‌లైన్ నుంచి కుళాయి ద్వారా నీరందించాలని అధికారులు కాంట్రాక్టర్‌కు పనులు అప్పజెప్పారు. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తాగునీటి పథకం నుంచి పైన్‌లైన్ల ద్వారా వచ్చే నీటి వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో అక్కడక్కడా పైప్‌లైన్ లీకేజీ కావడమే కాకుండా కనీసం వాటికి నల్లాలు(ట్యాప్‌లు) బిగించలేదు.
 
దీంతో పైప్‌లైన్ లీకేజీలతో వచ్చే నీరు వృథాగా మురుగు కాలువల్లో కలుస్తోంది. అది తిరిగి గోదావరి నదిలోకి వెళ్తోంది. అదేవిధంగా సమగ్ర తాగునీటి పథకం(ఫేస్ 2) నుంచి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ(ఓఅండ్‌ఎం) నిర్మాణ పనులు రూ.2   కోట్లతో ప్రారంభించారు. దీని ద్వారా మండలంలోని మైలాపూర్, రవీంద్రపూర్, టాక్లీ, దొడపూర్, లాబ్ది, కిర్గుల్(బి) గ్రామాలకు సరిపడా నీర ందించాలి. కానీ ఆ లక్ష్యం నెరవేరకపోవడంతో గ్రామస్తులు తీవ్ర తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
 
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల తిప్పలు

ట్రిపుల్ ఐటీ కళాశాలలో రూ.15.50 కోట్లతో  సమగ్ర రక్షిత తాగునీటి పనులను ప్రారంభించారు. ప్రారంభించినప్పటి నుంచి ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులకు నీటి కొరత తప్పడం లేదు. ట్రిపుల్ ఐటీ కళాశాలకు రెండు కిలోమీటర్ల దూరంలోనే గోదావరి నది ఉన్నా అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు.
 
బాసర పథకం నుంచి అందించే అరకొర నీరు సరిపోకపోవడంతో నాలుగు కిలోమీటర్ల దూరంలోని నిజామాబాద్ జిల్లా యంచ గ్రామ తాగునీటి పథకం నుంచి ప్రతి రోజు ట్యాంకర్లతో నీటిని తెప్పిస్తున్నారు. ట్యాంకర్లు రాగానే విద్యార్థులు పరుగులు పెట్టి బకెట్ల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆ నీరూ సరిపోవడం లేదు. సమస్య పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement