టీఏసీతో జల వనరుల విభాగం సమాలోచన
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వివాదంపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలన్న దానిపై అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం గురువారం సాంకేతిక సలహా సంఘం (టీఏసీ)తో సమాలోచనలు జరిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఫలితం ఉంటుం దా? ఉండదా? అన్న అంశంపై సుదీర్ఘంగా చర్చిం చింది. అయితే సుప్రీంకు వెళ్లే విషయమై భిన్నాభిప్రాయాలు రావ డం, ఇది పూర్తిగా న్యాయపరమైన అంశం కావడంతో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో సీనియర్ న్యాయవాదులతో చర్చించి తుది నిర్ణయానికి రావడమే ఉత్తమమని సలహా సంఘం సూచించినట్లు సమాచారం.
ట్రిబ్యునల్ తీర్పు ప్రభావం, ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్ తదితర అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ సమావేశానికి టీఏసీ సభ్యులు గోపాల్‌రెడ్డి, రవూఫ్, కె.వేణుగోపాల్‌రావు, న్యాయవాదులు రవీందర్‌రావు, విద్యాసాగర్ తదితరులు హాజరయ్యారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్‌కు అదనంగా మరో పిటిషన్ వేయాలని, ట్రిబ్యునల్ తీర్పుపై స్టే కోరాలని కొందరు సూచించగా, తీర్పు వెలువడ్డాక కోర్టును ఆశ్రయించినా ఫలితం ఉండదని మరికొందరు అభిప్రాయపడినట్లుగా తెలిసింది. కాగా, ఈ నెల 29న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్‌తో నిర్వహించే సమావేశంలోనే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాలని సూచిస్తూ సమావేశాన్ని ముగించినట్లుగా తెలిసింది.