
ఇద్దరు చంద్రులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం: భట్టి
ఓటుకు నోటు వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునేలా చేశాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు
ఖమ్మం: ఓటుకు నోటు వ్యవహారంతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇతర రాష్ట్రాల ముందు తలదించుకునేలా చేశాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌లపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్నారు. ఖమ్మంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు రూ. 50 లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి ఉదంతం దేశ ప్రజలను విస్మయానికి గురి చేసిందని, ఈ వ్యవహారంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసుకున్నారన్నారు. ఇప్పుడు మాత్రం ఇద్దరు సీఎంలు సెటిల్‌మెంట్ ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఈ వ్యవహారాన్ని ముందు పెట్టి ఇరు రాష్ట్రాల సీఎంలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో 750 మంది ప్రజా ప్రతినిధుల్లో కేవలం నలుగురు మాత్రమే టీఆర్‌ఎస్ పార్టీ గుర్తుతో గెలిచిన వారు ఉన్నారని, అయినా.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలుచుకుంటామని టీఆర్‌ఎస్ నాయకులు చెప్పడంలో అంత్యమేమిటని ప్రశ్నించారు. అంటే ఇతర పార్టీలకు చెందిన వారిని కొనుగోలు చేయడమో.. ప్రలోభాలకు గురి చేయడానికో ఆ పార్టీ సిద్ధంగా ఉందన్న విషయం తేలుతుందని భట్టి పేర్కొన్నారు. సమావేశంలో పాలేరు, ఖమ్మం ఎమ్మెల్యేలు రాంరెడ్డి వెంకటరెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, డీసీసీ అధ్యక్షులు ఐతం సత్యం తదితరులు పాల్గొన్నారు.