పక్కాగా చినుకు లెక్క! | Weather Stations in Hyderabad | Sakshi
Sakshi News home page

పక్కాగా చినుకు లెక్క!

Published Sat, May 18 2019 11:00 AM | Last Updated on Sat, May 18 2019 11:00 AM

Weather Stations in Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ఇకపై వర్షపాతం నమోదు పక్కాగా ఉండేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ వర్షపాతం తెలుసుకునేలా 120 చోట్ల వెదర్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు  వర్షం కురిస్తే.. వర్షం వెలిశాక ఏ ప్రాంతంలో ఎంత వర్షంకురిసిందో తెలుస్తోంది. వర్షం తీవ్రత స్థాయిని బట్టి సదరు ప్రాంతాల్లో అవసరమైన పనులు చేసేందుకు, చెరువులుగా మారిన రోడ్లపై నీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీకి చెందిన మాన్సూన్‌ యాక్షన్‌ టీమ్స్, ఇతరత్రా విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. త్వరలో రాబోయే వర్షాకాలంలో వర్షం కురవడానికి ముందే వర్షం తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోని   వల్నరబుల్‌ ప్రదేశాల్లోకి  జీహెచ్‌ఎంసీకి చెందిన మాన్సూన్‌ యాక్షన్‌ టీమ్స్, ఇతరత్రా విభాగాల సిబ్బంది చేరుకొని తక్షణ చర్యలు చేపట్టనున్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 వార్డుల్లోనూ మాన్సూన్‌ యాక్షన్‌ టీమ్స్‌ ఉన్నాయి. రాబోయే రోజుల్లో 150 వార్డుల్లో ఏయే వార్డుల్లో వర్షం కురియనుందో, ఎక్కడ వర్షం రాదో అరగంట ముందుగా తెలిసే సదుపాయం ఉంటుంది. తద్వారా అవసరమనుకున్నప్పుడు వర్షం కురిసే ప్రాంతాల్లోని వల్నరబుల్‌ ప్రాంతాలకు వర్షం లేని ప్రాంతాలకు చెందిన మాన్సూన్‌ యాక్షన్‌ టీమ్స్‌ కూడా చేరుకుంటాయి.

తద్వారా ఎక్కువ  సిబ్బందితో తక్కువ సమయంలో పరిస్థితిని యథాతథ స్థితికి తేవడం సాధ్యం కానుంది. ప్రస్తుతం  వర్షం Ðð లిశాక ఆయా ప్రాంతాల్లో సహాయకచర్యలు  చేపడుతున్నారు. దాంతో భారీ వర్షాలొచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో రెండు మూడు రోజుల వరకు కూడా పరిస్థితి సాధారణ స్థితికి రావడం లేదు. రాబోయే వర్షాకాల సమస్యల్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకుగాను వాతావరణశాఖ, జీహెచ్‌ఎంసీల ఆధ్వర్యంలో ‘వల్నరబుల్‌ మ్యాప్‌’ను రూపొందించనున్నారు.  దాంతోపాటు కార్యాచరణ మోడల్‌ను కూడా తయారు చేయనున్నారు. వాతావరణశాఖకు చెందిన డాప్లర్‌ రాడార్‌తో 150 కి.మీ.మేర క్లౌడ్‌ప్యాటర్న్‌ను బట్టి వర్ష సూచనలు తెలుస్తాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 34 వెదర్‌ స్టేషన్లు(రెయిన్‌గేజ్‌లు)ఉన్నాయి. మరో 120 త్వరలో అందుబాటులోకి రానున్నాయి. ప్రతి 2.5 కి.మీల పరిధిలో వీటిని ఏర్పాటుచేస్తారు. గ్రేటర్‌లోని 150  వార్డుల్లోనూ వెదర్‌స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.  

డాప్లర్‌ వెదర్‌ రాడార్‌ ఇమేజెస్‌ను బట్టి  ఏ వార్డులో వర్ష సూచనలున్నాయో తెలుసుకునేందుకు వీలవుతుంది. క్లౌడ్‌ ఇమేజెస్‌ను బట్టి వర్ష తీవ్రత ఎక్కువగా ఉంటే వార్డులనూ తెలుసుకోవచ్చు.  అందుకనుగుణంగా ఏయే విభాగం ఏయే పనులు చేయాలి..తదితరమైన వాటికి సంబంధించి కార్యాచరణ రూపొందించనున్నారు. అంతకంటే ముందుగా డాప్లర్‌ రాడార్‌ ఇమేజెస్, వెదర్‌స్టేషన్లు, వాటి వల్ల తెలుసుకునే సమాచారం, అందుకనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై ఎవరేం చేయాలనేదానికి సంబంధించి అర్బన్‌ ఫ్లడింగ్‌ అనే అంశంపై ఈనెలాఖరులోగా  బెంగళూర్‌ ఇండియన్‌ ఇన్సిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌తోపాటు దేశంలోని వివిధ నగరాలకు చెందిన ఐఐటీ, నిట్‌  సంస్థల్లోని నిపుణులు,నగరంలోని బిట్స్, జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు అధికారులతో టీఎస్‌డీపీఎస్‌  సమన్వయంతో  ఒక సదస్సు నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం. దానకిశోర్‌ తెలిపారు. సదస్సులో వెలువడే  అంశాల ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలతో కూడిన ‘కలామిటీ గైడ్‌’(విపత్తు మార్గదర్శి)రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.  ఎన్ని సెంటీమీటర్ల వర్షం కురిస్తే ఏ ప్రాంతం నీట మునుగుతుందో, తరచూ వరదపారే ప్రాంతాలేవో. ఏవి మునుగుతాయో  వార్డుల్లో విధులు నిర్వహించే అధికారులకు తెలుసు కనుక వారి సహకారంతో వార్డుల వారీగా వల్నరబుల్‌మ్యాప్‌ను రూపొందించనున్నట్లు టీఎస్‌డీపీఎస్‌ సీఈఓ మీరా షేక్‌  తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement