పటాన్‌చెరు/సంగారెడ్డి మున్సిపాలిటీ: ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పేదొకటి.. చేసేదొకటి..మాట తప్పడంలో ఆయనను మించిన వారు మరెవరూ లేరు.. రాష్ట్రం రాక ముందు దళితుడిని సీఎం చేస్తానన్న ఆయన మాటలు ఇప్పటికీ యూట్యూబ్‌లో ఉన్నాయి.. తెలంగాణను ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కేసీఆర్ యాడున్నడు’.. అంటూ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు.
పటాన్‌చెరు, సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన రుణమాఫీ, పెన్షన్ల పెంపు తదితర అంశాలపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో సునీతాలక్ష్మారెడ్డి విజయం సాధించేలా ప్రతిఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కార్యకర్తలను కోరారు.
ఉప ఎన్నిక బరిలో నిలిపి సునీతను బలిపశువును చేశారంటూ టీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అన్ని విధాలా సరైన వ్యక్తి కావడంతోనే అధిష్టానం ఆమెను గుర్తించి తమ అభ్యర్థిగా ఖరారు చేసిందన్నారు. ఓటమి భయం పట్టుకున్న నేతలు ఏం చేయాలో అర్థంకాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ కోసం తమ పార్టీ 1957నుంచి పోరాటం చేసిందని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తరువాత తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూపాయి ఆర్థిక సహాయం అందించలేదన్నారు. రుణ మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాలు ఇప్పటికీ అమలు కాలేద ని మండిపడ్డారు.
భద్రాచలంలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలుపుతున్నా సీఎం ఎందుకు పట్టించుకోలేదని, అఖిల పక్షం వేసి ప్రధాని, రాష్ట్రపతి వద్దకు ఎందుకు వెళ్లలేదని సీఎంను ప్రశ్నించారు. ‘సోనియా పిలుపు సునీత గెలుపు తెలంగాణ మలుపు కావాలని’ నినదించారు. తెలంగాణ సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసినట్లు కేసీఆర్ ప్రజలను నమ్మించాడని, దీక్ష సమయంలో వైద్యులు పరీక్షించిన మెడికల్ నివేదికను బయట పెడితే ఏ పాటి దీక్ష చేశారో స్పష్టమవుతుందన్నారు. అంతకు ముందు సీఎల్పీ నేత జానారెడ్డి మాట్లాడుతూ... టీఆర్‌ఎస్ నియంతృత్వ పోకడలలే సునీతారెడ్డికి విజయం దక్కేలా చేస్తాయన్నారు.
ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. సునీతాలక్ష్మారెడ్డిని మచ్చలేని నాయకురాలన్నారు. మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. ఇప్పుడు ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురిలో మిగతా ఇద్దరు తెలంగాణ గురించి ఏనాడు నోరెత్తలేదన్నారు. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదన్నారు. రూ.ఐదు కోట్లతో టికెట్ కొని ఎమ్మెల్యేగా గెలుపొందారన్నారు.
ఆరు నెలల్లో తెలంగాణ ప్రభుత్వం కుప్పకూలుతుందని కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. మెదక్ ఎంపీ అభ్యర్థిని సునీతాలకా్ష్మరెడ్డి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. తనను గెలిపిస్తే జిల్లాలో అభివృద్ధి పథంలో నడుపుతామన్నారు. సమావేశంలో మాజీ మంత్రి గీతారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, షబ్బీర్‌అలీ, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, మాజీ పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
దళిత ముఖ్యమంత్రి హామీ ఏమైంది?
Published Wed, Sep 3 2014 11:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:22 PM
Advertisement
Advertisement