ఏం జరుగుతుంది..భయ్యా? | What's Going There? | Sakshi
Sakshi News home page

ఏం జరుగుతుంది..భయ్యా?

Published Thu, Nov 22 2018 1:32 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

What's Going There? - Sakshi

ఎమ్మెల్యే అభ్యర్థి : హలో..!
కార్యకర్త : హలో సార్‌.. నమస్తే
: నమస్తే భయ్యా
కా : చెప్పండి సార్‌..
: మీ వాడల మన పార్టీ పరిస్థితి ఎలా ఉంది.? 
    జనం ఏమనుకుంటున్నారు..? ఓట్లు మనకే కదా..?
కా: ఇప్పటికైతే ఫర్వాలేదు సార్‌.. ఈ రోజే ప్రత్యర్థి పార్టీ వాళ్లు ప్రచారం చేసిండ్రు. ఇప్పటికే మనం కలిసిన వాళ్లను కలిసిండ్రు. ఎందుకైన మంచిది మనం కూడా ఇంకోసారి వాళ్లను కలుద్దాం.
: అవునా సరే. ముందు వాళ్లకు ఫోన్లు చేద్దాం.  మరీ అవసరమనిపిస్తే అప్పటికి కలుద్దాం.     అన్ని ప్రాంతాలు తిరగాలి కదా..? టైం లేదు.
కా : సరే సార్‌
: మన పార్టీ క్యాడర్‌ బాగా పనిచేస్తుందా..?
కా : అవును సార్‌.. కేటాయించిన ప్రాంతాలను చూసుకుంటుండ్రు. ఇంటింటికీ తిరుగుతుండ్రు.
: వాళ్లతో పని చేయించుకో.. జరనువ్వే చూసుకోవాలి. మనోళ్లందరికీ చెప్పు. గెలుపునకు మనం దగ్గర్లోనే ఉన్నామని. మనం గెలిస్తే అందరికీ మంచి రోజులొస్తాయని.
కా : సరే సార్‌.. అందరూ ఉత్సాహంతోనే పనిచేస్తుండ్రు. 
    మీరు నిశ్చింతగా ఉండండి.
: అయితే ఒకే... రేపు మళ్లీ     మాట్లాడుకుందాం.

సాక్షి, జగిత్యాల: ఇదీ ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రచారం తీరు. శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా 16 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ఓ పక్క విస్తృత ప్రచారాలతో ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థులు మరోపక్క ఇతర ప్రాంతాలపై పట్టు సడలకుండా జాగ్రత్త పడుతున్నారు. స్థానికంగా ఉన్న ప్రతికూల పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకూ ఉవ్విళ్లూరుతున్నారు. తమదైన శైలిలో ఒకరిపైమరొకరు సవాళ్లు విసురుతున్నారు. ప్రచారహోరుతో దద్దరిల్లుతున్న ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు ఎవరిని ఆదరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురిని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ త్రిముఖ పోటీ నెలకొంది. తెలంగాణ సాధించిన ఘనత, నాలుగేళ్ల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా టీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకెళ్తుంటే నాలుగేళ్లలో నెరవేరని ఉద్యమ ఆకాంక్షలు.. ఆశించిన మేరకు జరగని అభివృద్ధి ప్రధాన ఎజెండాగా మహాకూటమి ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. అభివృద్ధితోపాటు అభ్యర్థుల వ్యక్తిగత ప్రతిభ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనున్నాయి.


ఊపందుకున్న వలసలు
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ జిల్లాలో ఓ పార్టీ నుంచి ఇంకోపార్టీకి వలసల పరంపర ఊపందుకుంటోంది. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీకి చెందిన అసంతృప్తులు.. ప్రచారానికి దూరంగా ఉంటున్న వారిని గుర్తించే పనిలో పడ్డారు. వారికి గాలం వేసి తమ పార్టీలో చేర్పించుకుంటున్నారు. ఇప్పటికే ఇరుపార్టీల 
నుంచీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పార్టీలు మారారు. తాజాగా జిల్లాకేంద్రానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు ఏలేటీ శైలేందర్‌రెడ్డితో పాటు వైద్యుడు చంద్రశేఖర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో సుమారు రెండొందల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. ఇటు గతంలో టీఆర్‌ఎస్‌లో జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జిగా పనిచేసిన గంగారెడ్డి, తాటిపర్తి శరత్‌రెడ్డి, బండ భాస్కర్‌రెడ్డితో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ఒకపార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. రానున్న రోజుల్లో ఆపరేషన్‌ ఆకర్ష్‌ మరింతగా ఉంటుందని ఇరుపార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.


అంతటా.. ఉత్కంఠ..
ముందస్తు ఎన్నికలు జిల్లాలో ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రధాన పార్టీల అభ్యర్థులకూ ముచ్చెమటలు పుట్టిస్తున్నాయి. ఓ వైపు సీనియర్లు.. మరో వై పు జూనియర్లు అసెంబ్లీలోకి అడుగుపెట్టేందు కు హోరాహోరీగా తలపడుతున్నారు. అన్ని సెగ్మెంట్లలో పోరు రసవత్తరంగా మారింది. ఇప్పటికే జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపు బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న ఎంపీ కవిత ఆ మేర కు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యం గా మహాకూటమి జగిత్యాల ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి జీవన్‌రెడ్డిని ఓడించి గులాబీ జెండా ఎగురవేసేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సంజయ్‌కుమార్‌ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు మహాకూటమికీ జగిత్యాల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. జీవన్‌రెడ్డికి మద్దతుగా టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ సైతం ప్రచారంలో ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇన్నాళ్లూ ఒకరికొకరు ప్రత్యర్థులుగా ఉన్న రమణ, జీవన్‌రెడ్డి ఏకమవడంతో టీఆర్‌ఎస్‌ గట్టిపోటే ఎదుర్కొనుం ది. ఇటు కోరుట్ల నియోజకవర్గంలోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు రెండునెలలుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి రాష్ట్ర మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావును తమ అభ్యర్థిగా ప్రకటించింది. నిన్నటి వరకు టీఆర్‌ఎస్‌ ప్రచారానికే పరిమితమైన ఆ నియోజకవర్గంలో జువ్వాడి  సైతం తన ప్రచార వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీంతో అక్కడా ఇరువురి మధ్య గట్టి పో టే నెలకొంది. వీరితోపాటు బీజేపీ అభ్యర్థి జేఎన్‌ వెంకట్‌ సైతం ప్రచారంలో నిమగ్నమయ్యారు. ధర్మపురి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు కూటమి అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు మధ్య రసవత్తర పోటీ నెలకొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement