కాకి లెక్కలే.. | When the new rulers of the government .. | Sakshi
Sakshi News home page

కాకి లెక్కలే..

Published Tue, Jun 17 2014 11:36 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

కాకి లెక్కలే.. - Sakshi

కాకి లెక్కలే..

సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: ప్రభుత్వం మారినా.. కొత్త పాలకులు వచ్చినా.. జిల్లా అధికారుల తీరు మాత్రం మారలేదు. కాకి లెక్కలు.. గుడ్డి గుర్తులతో నివేదికలు సిద్ధం చేసి తొలి డీఆర్‌సీ ఎదుట పెట్టారు. వ్యవసాయం, నీటి పారుదల, విద్యాశాఖ అధికారులు నివేదికల్లోని అంశాలకు.. క్షేత్రస్థాయి వాస్తవాలకు అసలు పొంతనే కుదరటం లేదు. ఈ సమావేశానికి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సాగిన సమీక్షా సమావేశంలో అధికారులు తప్పుడు నివేదికలతోనే కాలం వెల్లబుచ్చారు.
 
 డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు గీతారెడ్డి, కిష్టారెడ్డి, సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, చింతా ప్రభాకర్, మదన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యా రు. అత్యంత స్నేహ పూర్వక వాతావరణంలో సాగిన సమీక్షా సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
 
 జిల్లా అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు చేసే విమర్శలను నిర్ణయాత్మకమైన సూచనలుగా తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. అధికారుల నివేదికలను ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకించా రు. ముఖ్యంగా సోలిపేట రామలింగారెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డిలు పలు శాఖల నివేదికల్లో అభ్యంతరం వ్యక్తం చేశారు.
 
 వ్యవసాయ శాఖ మాటల గారడీ...
 అధికారులు డీఆర్‌సీకి ఇచ్చిన నివేదికలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో 56,3136 హెక్టార్ల సాగుకు అంచనా వేసినట్లు.. అందుకోసం కావాల్సిన విత్తనాలు, ఎరువులు సిద్ధం చేశామని నమ్మించారు.
 
 వాస్తవం ఇది:  ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుబట్టి వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసి తెప్పించిన సోయబీన్ విత్తనాల నిల్వలు మాత్రమే అధికారులు కొంత వరకు సిద్ధం చేసి పట్టారు. జిల్లాకు 13,750 క్వింటాళ్ల విత్తనాలు అవసరం కాగా ప్రస్తుతం 10,640 క్వింటాళ్లు మాత్రమే జిల్లాలో నిల్వ ఉన్నాయి. అవి కూడా పూర్తి స్తాయిలో రైతులకు పంపిణీ చేయలేదు.

 జిల్లాలో మరో ప్రధానపంట మొక్కజొన్న. దాదాపు 15,0469 హెక్టార్లలో రైతులు మొక్కజొన్న విత్తుతారు. జిల్లాకు 20,000 క్వింటాళ్ల విత్తనాలు అలాట్‌మెంటు ఉంటే ఇప్పటి వరకు కేవలం 5,750 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 
 జిల్లాలో 71,8376 క్వింటాళ్ల పత్తి విత్తనాలు కేటాయించగా విత్తన సరఫరా కేంద్రాల్లో కేవలం 31,0281 క్విటాళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 
 ఇక అపరాలు అంటే పెసలు, మినుములు, కందులు దాదాపు 6,400 క్విటాళ్లు అవసరంగా ఉండగా, కేవలం 33.6 క్వింటాళ్ల కంది విత్తనాలను మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
 ఒక వేళ రాత్రికి రాత్రే వర్షం కురిస్తే తెల్లారే సరికి రైతులు విత్తనాలు వేస్తారు. పైన పేర్కొన్న విత్తనాలన్నీ ఖరీఫ్ సీజన్‌లో వేసుకునే విత్తనాలే. అయితే విత్తనాల కోసం  కేంద్రాల వద్ద నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొంది.
 
 రైతులు విత్తటానికి ముందు పంట పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు అలుకుతారు. మన జిల్లాలో జీలుగకు మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మనకు 5,000 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కేవలం 1,346 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేయడంతో అవి రైతులకు సరిపోలేదు.
 
 ఎరువులు..
 ఖరీఫ్ సీజన్‌లో 1.22 లక్షల టన్నుల యూరియా అవసరం ఉండగా, ప్రస్తుతం 35,500 టన్నులు మాత్రమే ఉంది.  డీఏపీ 22.19 వేల టన్నులు అవసరంకాగా, ప్రస్తుతం 7,700 టన్నులు మాత్రమే ఉన్నాయి. ఏవోపీ 23 వేల టన్నులు అవసరం ఉండగా.. ప్రస్తుతం 975 టన్నులు మాత్రమే ఉంది.
 
 వర్షం పడితే రైతులంతా ఒక్కసారిగా ఎరువులు, విత్తనాల కోసం ఎగబడతారు. అప్పుడు వారికి కావలసిన ఎరువులు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తారు. ఇలాంటి కఠోర వాస్తవాలను అధికారులు దాచి మంత్రికి అర చేతిలో వైకుంఠం చూపించారు. పంపిణీలో ఎలాంటి జాప్యం జరగకుండా ఐజేపీ సెంటర్లకు, సొసైటీలకు లెసైన్స్‌లు ఇస్తున్నట్లు చెప్పారు. వారి మాటలు నమ్మిన మంత్రి రైతులకు వీలైనంత త్వరగా విత్తనాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.
 
 సాంకేతిక విద్యలో నిజమెంత?
 అధికారుల నివేదిక:- ఐసీటీ 5000 స్కీం కింద 198 పాఠశాలల్లో,  ఐసీటీ1300 స్కీం కింద 53 పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా కంప్యూటర్ విద్యను అందిస్తున్నామని, పాఠశాలలోనే పనిచేసే ఉపాధ్యాయునితో  కంప్యూటర్ విద్య బోధిస్తున్నామని నివేదించారు.

 వాస్తవం ఇది:-  రికార్డు పరంగానే విద్యార్థులకు సాంకేతిక విద్య అందుతోంది.  క్షేత్రస్థాయికి వెళ్తే మాత్రం అసలు కంప్యూటర్ అంటే ఏమిటో కూడా విద్యార్థులకు తెలియని పరిస్థితి. సాక్షి  క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారం ప్రకారం ఎక్కడా కంప్యూటర్ విద్యాబోధన జరగడం లేదు. ఐసీటీ 1300 స్కీం కింద పంపిణీ చేసిన 53 పాఠశాలల్లో అసలు కంప్యూటర్లే ఓపెన్ చేయలేదు.
 
 శివ్వంపేటలోని కస్తూర్బా పాఠశాలకు రెండేళ్ల కిందట ఐదు కంప్యూటర్లు సరఫరా చేశారు. వీటిని కనీసం సీల్ కూడా తీయకుండా అటకమీద పెట్టారు. అప్పటి నుంచి వృథాగానే ఉన్నాయి. అలాగే అల్లాదుర్గం, కొండాపూర్, కంగ్టి మండలాల్లో కంప్యూటర్ పరికరాలు పూర్తిగా పనికి రాకుండా పోయాయి. కొన్ని చోట్ల మూలకు పడేశారు.
 
 ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్‌లో కంప్యూటర్లను ఒక్కరోజు కూడా వాడకుండానే రిపేర్‌కు వచ్చాయి. మాకు సాంకేతిక విద్యా బోదన చేయడం లేనిదని అక్కడి విద్యార్థులు చెబుతున్నారు. ఇలా ప్రతి పాఠశాలలోనూ కంప్యూటర్లు మూలన పడి ఉన్నాయి. కానీ విద్యా శాఖ అధికారులు మాత్రం దర్జాగా నడుస్తున్నాయని, వాటి నిర్వాహణ కోసం ప్రత్యేక టీచర్‌ను నియమిస్తున్నట్టు పేర్కొన్నారు.
 
 అధికారుల నివేదిక: 2,900 పాఠశాలల్లో 4,824 మరుగుదొడ్లు ఉండగా వాటిలో 3,351 మరుగుదొడ్లు పని చేస్తున్నాయని నివేదించారు.
 
 వాస్తవం ఇది: పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యల్లో ప్రధానమైనది మరుగుదొడ్లే. బాలికల పరిస్థితి అయితే సరేసరి. 2,900 పాఠశాల్లో ఉన్న 4,824 మరుగుదొడ్లలో ఒక్కటంటే ఒక్క మరుగుదొడ్డయినా పరిశుభ్రంగా ఉంది అని చెప్పగలరా?
 డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి నియోజకవర్గం.. చిన్నశంకరంపేటలోని ఉన్నత పాఠశాలలో కేవలం ఒకే ఒక మరుగుదొడ్డి ఉంది. అది కూడా అధ్వానంగా ఉంది. అదే నియోజకవర్గం పాపన్నపేట ఉన్నత పాఠశాలలో నాలుగు మరుగుదొడ్లు ఉంటే వాటిలో రెండున్నర ఏళ్లుగా మూడు మరుగుదొడ్లు పని చేయడంలేదు.
 
 జోగిపేట ఉన్నత పాఠశాలలో దాదాపు 15 మరుగుదొడ్లు ఉన్నాయి. అవి కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి.
 
 జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో బాలికల పాఠశాలలో కేవలం రెండు మరుగుదొడ్లు ఉండగా.. వాటిలో ఒకటి కూడా పని చేయడం లేదు.  ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సమస్య ఉంది.  ‘కూట్లో రాయి తీయలేని అధికారులు ఎట్లో రాళ్లు తీస్తామంటే’ ఎలా నమ్మేది.
 నీటి పారుదల శాఖ
 రాయికోడ్ మండలంలో రోడ్డు వెంట పైపు పరిచి ఐదేళ్ల నుంచి చూస్తున్నాను... ఈ పైపు లైన్లు ఎక్కడివి? ఆ ప్రాజెక్టు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు అని ఎమ్మెల్సీ స్వామి గౌడ్ ప్రశ్నించారు?
 అధికారి సమధానం ఇలా: పాంపాడ్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయింది. అంచనా వ్యయం రూ 40 కోట్లు. రైతులు పొలాల్లో పైపు లైన్ నిర్మాణానికి అంగీకరించకపోవడం వలన పైపులు మాత్రమే వేయలేదు. రెండు నెలల్లో పూర్తి చేస్తాం అని  సంబంధిత శాఖ అధికారి చెప్పారు.
 
 వాస్తవం ఇది:-
 రాయికోడ్, మునిపల్లి మండలాల్లోని 47 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు ఏర్పాటు చేసిన పథకం అది. పాంపాడ్ గ్రామ శివారులో మంజీర నదిలో అంతర్గత బావిని తవ్వి  100 హెచ్‌పీ సామర్థ్యం గల మోటారు బిగించి 47 గ్రామాలకు నీరు అందించాలని నిర్ణయించారు. 2012 వార్షిక బడ్జెట్‌లో రూ.37.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పథకం సర్వే పనులే ఏడాది పాటు సాగాయి. 150 కిలో మీటర్ల పైపులైను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు  కేవలం 40 కిలోమీటర్ల మేర పైపులైను ఏర్పాటు మాత్రమే  పూర్తయింది.
 
 అది కూడా అసంపూర్తిగానే ఉన్నాయి.  అంతర్గత బావి, ఫిల్టర్ బెడ్ నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు ఈ పథకం ద్వారా రాయికోడ్ మండలంలోని 29 గ్రామాలు, మునిపల్లి మండలంలోని 18 గ్రామాలకు చెందిన 60 వేల జనాభాకు మంజీరా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా మండలంలోని మహబత్‌పూర్ గ్రామంలో 1.75 లక్షల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకును నిర్మించాలి.  అదేవిదంగా మహమ్మదాపూర్, ఝరాసంఘం మండలంలోని కప్పాడ్, మునిపల్లి మండలంలోని మేళసంఘం గ్రామాల్లో మరో మూడు 90 వేల లీటర్ల నీటి సామర్థ్యం ఉన్న ట్యాంకులను నిర్మించాల్సి ఉంది.
 
 వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఆ శాఖ అధికారిణి మాత్రం త్వరలోనే నీళ్లు ఇస్తామని ఘంటాపథంగా చెప్పటం గమనార్హం.
 
 మంజీర తాగు నీళ్ల గురించి
 అధికారుల నివేదిక:- మొదటి ఫేజ్ కింద 2135 గ్రామాలకు గాను 863 గ్రామాలకు మంజీర నీళ్లను అందిస్తున్నామని, 2018 నాటికి అన్ని గ్రామాలకు మంజీరా నీళ్లను అందిస్తాం అని చెప్పారు.
 
 వాస్తవం:-  దాదాపు  అధికారులు నివేదించిన గ్రామాల్లో 500 గ్రామల్లో మంజీర నీటి సరఫరా లేదు. ఎప్పుడో అధికారులు దయదలిచి నీళ్లు ఇస్తే వచ్చినట్టు లేకుంటే లేదు. వచ్చిన నీళ్లు కూడా 100 శాతం మంజీర నీళ్లు కాదు. స్థానిక బోరు బావుల నుంచి సేకరించిన నీళ్లు కలిపి ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement