కచలాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం
సాక్షి, మునుగోడు : ఒకప్పుడు ఇతర గ్రామపంచాయతీ పరిధిలో కచలాపురం గ్రామం 1994లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఆనాడు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి ఆ గ్రామంలోని ప్రజలు అందరూ కలిసి సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా గ్రామస్తులు అందరి ఆమోదంతో సర్పంచ్‌గా ఎన్నికైన ఆ వ్యక్తి వారికి అవసరమైన సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాడు.
దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ కుటుంబానికే ఆ గ్రామ ప్రజలు అండగా నిలుస్తున్నారు. అలా గత నాలుగు పర్యాయాలుగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తలు సర్పంచ్‌గా ఎన్నికవుతున్న ఆ గ్రామం పేరు కచలాపురం. ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ అయిన ఒక మారు తప్పా మిగిలిన ప్రతి ఎన్నికల్లో జనరల్ వస్తే భర్త, మహిళ వస్తే భార్య బరిలో నిలిచి సర్పంచ్ పదవిని పొందుతున్నారు.
1994లో జీపీగా ఏర్పాటు...
మండలంలోని కచలాపురం గ్రామం 1994 వరకు సింగారం గ్రామ పంచాయతీలో కలసి ఉండేది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో 500లకు పైగా జనాభా కలిగిన కచలాపురం గ్రామాన్ని కూడా అధికారులు నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నూతన పంచాయతీగా ఏర్పాటైన మరుసటి ఏడాది 1995లో మొదటి ఎన్నికలు నిర్వహించగా సర్పంచ్ జనరల్ స్థానం రిజర్వ్ కాగా గ్రామస్తులు అందరూ కలిసి సీపీఐకి చెందిన గుర్జ రామచంద్రాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఆ తరువాత తిరిగి 2001లో బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అతడి భార్య గుర్జ అరుణని బరిలో నిలుపగా ఆమె గెలుపొందింది. ఆ పదవి కాలం ముగిసి 2006లో ఎన్నికలు రాగా అప్పుడు ఆ గ్రామం ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో రామచంద్రం బలపరిచిన సీపీఐ నాయకుడు పెద్దమామిడి వెంటకయ్యని బరిలో నిలిచి గెలుపొందాడు. ఆ తరువాత గత 2013లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రామచంద్రం పోటీలో నిలిచి గెలుపొందాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో అతడి భార్య అరుణ పోటీచేసి గెలుపొందింది. ఇలా వరుసగా ఆయన కుటుంబాన్ని గ్రామస్తులు సర్పంచ్‌గా ఎన్నుకొంటూ అండగా నిలుస్తున్నారు.
గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇవి...
రామచంద్రం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి నిత్యం గ్రామంలోని ప్రజలకు అవసరమైన సేవలతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్ల కాలంలో ఆ గ్రామంలోని ప్రజలకు అవసరమైన మంచి నీటి సరఫరాకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్‌తో పాటు వీధి, వీధికి మినీ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం సహాయంతో దాదపు 160 కుటుంబాలకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయించారు. ప్రతి వీధిలో మురికి కాల్వల నిర్మాణం, నూతనంగా పాఠశాల భవనం, అంగన్‌వాడీ కేంద్రానికి భవన నిర్మాణంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్‌ల నిర్మాణం చేయించారు. అంతే కాకుండా దళిత కాలనీలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేయించాడు.
పలు ఉత్తమ అవార్డులు..
ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉత్తమ అవార్డులు అందిస్తుంది. అలా కచలాపురం గ్రామానికి కూడా నాలుగు పర్యాయాలు నాలుగు అవార్డులు దక్కాయి. మొదటిసారి 1999లో జిల్లా ఉత్తమ గ్రామ అవార్డు, 2004లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, 2007లో రాష్ట్రపతి అవార్డు, 2018లో ఉత్తమ స్వచ్ఛభారత్ అవార్డులు లభించాయి. సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆ కుటుంబం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందునే ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇతర గ్రామాల ప్రజలు రామచంద్రం వల్లే తమ గ్రామాల్లోని సర్పంచ్‌లు పనిచేస్తే బాగుండని అంటున్నారు.
అందరికీ అందుబాటులో ఉంటూ..
మా గ్రామ సర్పంచ్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటారు. అందుకే ప్రజలు అందరూ ఆయననే సర్పంచ్‌గా కావాలని కోరుకుంటారు. గ్రామంలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా తన సమస్యగా భావించి దాని పరిష్కారానికి చొరవ చూపుతాడు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటాడు.
– ఎన్. వెంకట్‌రెడ్డి, గ్రామ యువకుడు
సేవ చేయడంలో ఆనందం
గ్రామ ప్రజలకు సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధిగా పనిచేయాలని ఉంటుంది. నేను చేసిన సేవకు ఫలితంగా మా గ్రామ ప్రజలు నాకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంటారు. వారి ఇష్టాలకు అనుగుణంగా గ్రామంలోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తాను. నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది.
– గుర్జ రామచంద్రం, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త
Comments
Please login to add a commentAdd a comment