Panchayathraj Elections
-
ఇరవై ఏళ్లుగా వారే సర్పంచ్‌లు
సాక్షి, మునుగోడు : ఒకప్పుడు ఇతర గ్రామపంచాయతీ పరిధిలో కచలాపురం గ్రామం 1994లో నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైంది. ఆనాడు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి ఆ గ్రామంలోని ప్రజలు అందరూ కలిసి సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలా గ్రామస్తులు అందరి ఆమోదంతో సర్పంచ్‌గా ఎన్నికైన ఆ వ్యక్తి వారికి అవసరమైన సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నాడు. దీంతో పంచాయతీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఆ కుటుంబానికే ఆ గ్రామ ప్రజలు అండగా నిలుస్తున్నారు. అలా గత నాలుగు పర్యాయాలుగా ఒకే కుటుంబానికి చెందిన భార్య, భర్తలు సర్పంచ్‌గా ఎన్నికవుతున్న ఆ గ్రామం పేరు కచలాపురం. ఆ గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వేషన్ అయిన ఒక మారు తప్పా మిగిలిన ప్రతి ఎన్నికల్లో జనరల్ వస్తే భర్త, మహిళ వస్తే భార్య బరిలో నిలిచి సర్పంచ్ పదవిని పొందుతున్నారు. 1994లో జీపీగా ఏర్పాటు... మండలంలోని కచలాపురం గ్రామం 1994 వరకు సింగారం గ్రామ పంచాయతీలో కలసి ఉండేది. అయితే ఆ సమయంలో ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో 500లకు పైగా జనాభా కలిగిన కచలాపురం గ్రామాన్ని కూడా అధికారులు నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. నూతన పంచాయతీగా ఏర్పాటైన మరుసటి ఏడాది 1995లో మొదటి ఎన్నికలు నిర్వహించగా సర్పంచ్ జనరల్ స్థానం రిజర్వ్ కాగా గ్రామస్తులు అందరూ కలిసి సీపీఐకి చెందిన గుర్జ రామచంద్రాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత తిరిగి 2001లో బీసీ మహిళ రిజర్వ్ కావడంతో అతడి భార్య గుర్జ అరుణని బరిలో నిలుపగా ఆమె గెలుపొందింది. ఆ పదవి కాలం ముగిసి 2006లో ఎన్నికలు రాగా అప్పుడు ఆ గ్రామం ఎస్సీ జనరల్ రిజర్వ్ కావడంతో రామచంద్రం బలపరిచిన సీపీఐ నాయకుడు పెద్దమామిడి వెంటకయ్యని బరిలో నిలిచి గెలుపొందాడు. ఆ తరువాత గత 2013లో బీసీ జనరల్ రిజర్వేషన్ రావడంతో రామచంద్రం పోటీలో నిలిచి గెలుపొందాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్ మహిళ రిజర్వేషన్ రావడంతో అతడి భార్య అరుణ పోటీచేసి గెలుపొందింది. ఇలా వరుసగా ఆయన కుటుంబాన్ని గ్రామస్తులు సర్పంచ్‌గా ఎన్నుకొంటూ అండగా నిలుస్తున్నారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇవి... రామచంద్రం సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టి నిత్యం గ్రామంలోని ప్రజలకు అవసరమైన సేవలతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నాడు. ఆయన 20 ఏళ్ల కాలంలో ఆ గ్రామంలోని ప్రజలకు అవసరమైన మంచి నీటి సరఫరాకు ఒక ఓవర్ హెడ్ ట్యాంక్‌తో పాటు వీధి, వీధికి మినీ ట్యాంక్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం సహాయంతో దాదపు 160 కుటుంబాలకు ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేయించారు. ప్రతి వీధిలో మురికి కాల్వల నిర్మాణం, నూతనంగా పాఠశాల భవనం, అంగన్వాడీ కేంద్రానికి భవన నిర్మాణంతో పాటు ఓ కమ్యూనిటీ హాల్ల నిర్మాణం చేయించారు. అంతే కాకుండా దళిత కాలనీలో ప్రతి వీధికి సీసీ రోడ్ల నిర్మాణం తదితర అభివృద్ధి పనులు చేయించాడు. పలు ఉత్తమ అవార్డులు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్‌లకు ప్రభుత్వం ఉత్తమ అవార్డులు అందిస్తుంది. అలా కచలాపురం గ్రామానికి కూడా నాలుగు పర్యాయాలు నాలుగు అవార్డులు దక్కాయి. మొదటిసారి 1999లో జిల్లా ఉత్తమ గ్రామ అవార్డు, 2004లో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు, 2007లో రాష్ట్రపతి అవార్డు, 2018లో ఉత్తమ స్వచ్ఛభారత్ అవార్డులు లభించాయి. సర్పంచ్‌గా పనిచేస్తున్న ఆ కుటుంబం ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండడంతో పాటు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నందునే ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబాన్ని సర్పంచ్‌గా ఎన్నుకుంటున్నామని గ్రామస్తులు తెలుపుతున్నారు. ఈ విషయం తెలిసిన ఇతర గ్రామాల ప్రజలు రామచంద్రం వల్లే తమ గ్రామాల్లోని సర్పంచ్‌లు పనిచేస్తే బాగుండని అంటున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ.. మా గ్రామ సర్పంచ్ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటారు. అందుకే ప్రజలు అందరూ ఆయననే సర్పంచ్‌గా కావాలని కోరుకుంటారు. గ్రామంలో ఎవరికైనా ఎలాంటి సమస్య వచ్చినా తన సమస్యగా భావించి దాని పరిష్కారానికి చొరవ చూపుతాడు. అదే విధంగా గ్రామ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తుంటాడు. – ఎన్. వెంకట్‌రెడ్డి, గ్రామ యువకుడు సేవ చేయడంలో ఆనందం గ్రామ ప్రజలకు సేవ చేయడంలో చాలా ఆనందం ఉంటుంది. అందుకే ప్రజా ప్రతినిధిగా పనిచేయాలని ఉంటుంది. నేను చేసిన సేవకు ఫలితంగా మా గ్రామ ప్రజలు నాకు పూర్తిస్థాయి మద్దతు ఇస్తుంటారు. వారి ఇష్టాలకు అనుగుణంగా గ్రామంలోని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయిస్తాను. నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. – గుర్జ రామచంద్రం, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ భర్త -
సుప్రీంకు పంచాయతీ రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించొద్దన్న హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం తరుపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. పంచాయతీ రాజ్ సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా తెలంగాణలో మొత్తం 61 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విధంగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించేలా కోరాలని సీఎం నిర్ణయించారు. రేపు కేబినేట్ సబ్ కమిటీ భేటీ దీనిపై అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం కేబినేట్ సబ్ కమిటీ సమావేశం కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అదనపు అడ్వకేట్ జనరల్, సంబంధిత అధికారులను ఈ భేటీకి ఆహ్వానించాలని తెలిపారు. అన్ని విషయాలు చర్చించి.. పూర్వాపరాలు పరిశీలించాలన్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. దాని కోసం అవసరమైన న్యాయ పోరాటం చేస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీనే పిటీషన్ వేసి బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటుందని ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోపించారు. రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. -
రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలందరికీ కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం ఇది వర్తించదని, ఆ ప్రాంతాల్లో 50% మించి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది. పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. రిజర్వేషన్లు 50% దాటాయన్న పిటిషనర్లు ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని వివరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీలకు 100% రిజర్వేషన్లు ఇస్తున్నారని వివరించారు. మొత్తం 61 శాతం ఇస్తున్నామన్న ప్రభుత్వం ఈ వాదనపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కలిపి మొత్తం 61% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉందని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మొదట బీసీ జనాభాను లెక్కించి ఆ తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని సింగిల్ జడ్జి చెప్పారని, ఉప వర్గీకరణ అంశం జోలికి ఆయన వెళ్లలేదన్నారు. ఈ ఆదేశాల మేరకు బీసీ జనాభాను లెక్కించాలన్నారు. బీసీలకు 34% రిజర్వేషన్లకు ప్రాతిపదికేదీ? ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలతోపాటు ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చామని సంజీవ్ చెప్పగా బీసీ జనాభా లెక్కించినా, లెక్కించకపోయినా రిజర్వేషన్లు 50% దాటకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఇప్పటివరకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం జరగకపోవడమే ప్రభుత్వానికి ఈ ఎదురుదెబ్బ తగలడానికి కారణమని న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. -
మళ్లీ మొదటికి..
గ్రామ పంచాయతీలకు ముందస్తు ఎన్నికల ప్రకటన నేపథ్యంలో కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అదే సమయంలో కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలపైనా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతమున్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీల విస్తరణకు సంబంధించి గతంలోనే టౌన్ ప్లానింగ్ విభాగం ప్రతిపాదనలు రూపొందించింది. తాజాగా దూరం ప్రాతిపదికన కాకుండా.. పట్టణీకరణ చెందుతున్న గ్రామాలను మాత్రమే మున్సిపాలిటీల్లో విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. –సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి సంగారెడ్డి : జిల్లా కేంద్రంతో పాటు సదాశివపేట, జహీరాబాద్ మున్సిపాలిటీలు, అందోలు–జోగిపేట నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను విలీనం చేయాలని మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం ఇటీవల ప్రతిపాదనలు రూపొందించింది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ మేరకు సంగారెడ్డి, సదాశివపేటలో ఏడేసి, జహీరాబాద్‌లో పది, అందోలు–జోగిపేట నగర పంచాయతీలో ఒక గ్రామ పంచాయతీ చొప్పున మొత్తం 25 పంచాయతీలను విలీనం చేయాలని నిర్ణయించారు. ప్రతిపాదిత విలీన గ్రామ పంచాయతీల తీర్మానం కూడా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటి వరకు 12 గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా.. అన్ని చోట్లా విలీనాన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. మున్సిపాలిటీల్లో సమీప గ్రామ పంచాయతీల విలీనానికి సంబంధించి.. మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు చేయాలని భావిస్తోంది. మున్సిపాలిటీ సరిహద్దుల నుంచి దూరాన్ని మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవద్దని తాజాగా ఆదేశించింది. మున్సిపాలిటీ సరిహద్దు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండి.. వేగంగా పట్టణీకరణ చెందుతున్న గ్రామ పంచాయతీలను మాత్రమే విలీనం చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించింది. కొత్తగా జనావాసాలు, వెంచర్ల ఏర్పాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఉదాహరణకు గతంలో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఏడు గ్రామ పంచాయతీల విలీనాన్ని ప్రతిపాదించారు. తాజా ఆదేశాల ప్రకారం పట్టణీకరణ చెందుతున్న నాగాపూర్, మల్కాపూర్, పోతిరెడ్డిపల్లి, కందిగ్రామాలు మాత్రమే విలీనమయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి సమావేశం.. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల సరిహద్దుల విస్తరణ, కొత్త మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి మెదక్ జిల్లాకు ప్రత్యేక అధికారిని నియమించింది. ప్రత్యేక అధికారిగా నియమితులైన జాన్ ఎఫ్ కెన్నడీ శనివారం మెదక్, సంగారెడ్డి జిల్లాల మున్సిపల్ అధికారులు, డీపీఓలతో సమావేశమయ్యారు. సోమవారం సిద్దిపేట జిల్లాకు చెందిన అధికారులతో సమావేశమయ్యే అవకాశం ఉంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఏర్పాటు, సరిహద్దు విస్తరణకు సంబంధించి ప్రతిపాదనల రూపకల్పనలో పాటించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక అధికారి సూచనలు చేస్తున్నారు. కాగా 20వేలకు పైబడిన జనాభా కలిగిన గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో అమీన్పూర్, బొల్లారం, నారాయణఖేడ్, కోహిర్, తెల్లాపూర్ పంచాయతీలకు నగర పంచాయతీ హోదా కోసం ప్రతిపాదనలు రూపొందించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెల్లాపూర్, కోహిర్ జనాభా 15వేలకు మించడం లేదు. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేస్తే తప్ప ఈ రెండు పంచాయతీలకు నగర పంచాయతీ హోదా దక్కేలా లేదు. మరోవైపు జీహెచ్ఎంసీ పరిధిని ఆనుకుని ఉండడంతో అమీన్పూర్ (జనాభా 36,452)ను కూడా ప్రస్తుతానికి నగర పంచాయతీ హోదా ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. బొల్లారం, నారాయణఖేడ్ గ్రామ పంచాయతీలు మాత్రమే నగర పంచాయతీలుగా మారే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మళ్లీ మొదటికి! గ్రామ పంచాయతీ 2011 జనాభా సమీప గ్రామాలు కలిస్తే.. అమీన్పూర్ 36,452 44,132 బొల్లారం 34,667 36,480 నారాయణఖేడ్ 18,243 30,418 కోహిర్ 15,075 29,310 తెల్లాపూర్ 14,403 15,087 -
‘పంచాయతీరాజ్’వాయిదా లేదు
-
‘పంచాయతీరాజ్’వాయిదా లేదు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఈసీ అఫిడవిట్ వాయిదాపై అఖిలపక్ష భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కొన్ని ఎన్నికల వాయిదా కోరితే.. కొన్ని ఫలితాలు వాయిదా కోరాయి మరికొన్ని పార్టీలు యథాతథంగా ఎన్నికలు నిర్వహించాలన్నాయి జిల్లా యంత్రాంగాలు ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పాయి వాయిదా వేస్తే కష్టమని పోలీసు ఉన్నతాధికారులూ పేర్కొన్నారు సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర బలగాలు వెళ్లిపోతాయి రాష్ట్రంలో ఉద్యోగులంతా విభజన పనుల్లో నిమగ్నమై ఉంటారు ఫలితాల వాయిదా కూడా సాధ్యం కాదు.. బ్యాలెట్లకు భద్రత కష్టం ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తాం ఏప్రిల్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాం.. అనుమతించండి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్యంతర దరఖాస్తు ఈ నెల 24వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశం సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6న ఒక విడతలో కాకుండా.. ఏప్రిల్ 6, ఏప్రిల్ 8 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించి 11న ఫలితాలు వెల్లడిస్తామని.. ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఎన్నికల వాయిదాపై అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని నివేదించింది. ఆయా పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికలు వాయిదా వేసి మే 7 తరువాత నిర్వహించేందుకు పోలీసు బలగాలు అందుబాటులో ఉండవని, విభజన నేపథ్యంలో సిబ్బంది కూడా వేరే పనుల్లో నిమగ్నమవుతారని పేర్కొంది. అలాగే.. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఫలితాలను మే 7వ తేదీ వరకు వాయిదా వేయటం కూడా కుదరదని.. నెల రోజుల పాటు బ్యాలెట్ బాక్సులను కాపడేందుకు భద్రతా సిబ్బంది సరిపోరని పోలీసు శాఖ స్పష్టంచేసిందని నివేదించింది. అందువల్ల ప్రస్తుత షెడ్యూలుకే స్వల్ప సవరణ చేస్తూ ఏప్రిల్ 6, 8 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానానికి మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అయితే ఈ దరఖాస్తు శుక్రవారం విచారణకు రాలేదు. హోలీ సెలవుల అనంతరం ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో ఈ నెల 24న తెలియనుంది. అయితే.. ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ఏప్రిల్ 8వ తేదీ శ్రీరామనవమి కావటం గమనార్హం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2013 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని కోరుతూ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన వినతి మేరకు ఈ ఏడాది మార్చి 7న సుప్రీంకోర్టు.. పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూలుపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, మార్చి 10 కల్లా షెడ్యూలు విడుదలపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 10న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ విషయాన్ని వివరిస్తూ 12వ తేదీన (బుధవారం) అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు విచారణ సందర్భంగా.. సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఈ ఎన్నికలు నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని, యంత్రాంగం సరిపోదని విన్నవించింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వాయిదావేయాలని కోరుకుంటే సరైన దరఖాస్తుతో రావాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు కానీ, ఫలితాలు కానీ వాయిదా వేయటం సాధ్యం కాదని.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహించటానికి జారీ చేసిన షెడ్యూలును సవరించి.. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపిన కారణాలివీ.. పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి..: ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు తీసుకోగా పార్టీలన్నీ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. కొన్ని పార్టీలు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూనే ఫలితాలను మాత్రమే సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకటించాలని కోరాయి. మరికొన్ని పార్టీలు స్థానిక ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలయ్యాకే నిర్వహించేందుకు వీలుగా రీషెడ్యూలు చేయాలని కోరాయి. ఇంకొన్ని పార్టీలు రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డే అయిన జూన్ 2 లోగా ఈ స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని కోరాయి. మరికొన్ని పార్టీలు ప్రస్తుత షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కోరాయి. ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉంది..: అయితే మేం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జడ్పీ సీఈవోలు, ఆర్డీఓలు, డీపీఓలతో సమావేశమై వారి అభిప్రాయం తీసుకున్నాం. చాలా వరకు జిల్లాల యంత్రాంగం ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం సీనియర్ అధికారులు బహుముఖ పనుల ఒత్తిడి కారణంగా రెండు విడతలుగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణ ఒకే విడతలో తప్పదనుకుంటే అందుకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.’’ ‘బ్యాలెట్’ భద్రతకు సిబ్బంది సరిపోరు..: మేం రాష్ట్ర డీజీపీ, అదనపు డీజీపీలతో సమావేశమయ్యాం. కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించాం. ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తే సార్వత్రిక ఎన్నికలయ్యే నాటికి.. అంటే మే 7 వరకు బ్యాలెట్ బాక్సులకు భద్రతా సిబ్బందిని కేటాయించలేమని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. 1,096 జెడ్పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నందున దాదాపు 300 ప్రాంతాల్లో ఈ బ్యాలెట్ బాక్సుల రక్షణకు 12 నుంచి 15 బెటాలియన్ల బలగాలు అవసరమవుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ఉద్యోగులు ‘విభజన’ పనుల్లో ఉంటారు..: కొన్ని పార్టీల సలహా మేరకు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక.. అంటే మే 7 తరువాత నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చించాం. అయితే ఆ సమయానికి కేంద్ర బలగాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా విభజన పనుల్లో నిమగ్నమై ఉంటారు. విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డే కూడా దగ్గరపడుతుంది. అందువల్ల ఆ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించ డం సరికాదని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ప్రతి జిల్లాలో రెండు విడతలుగా..: అలాగే ఒకే విడతలో నిర్వహించేందుకు కూడా పోలీసు బలగాలు ఎక్కువ అవసరమవుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే ప్రతి జిల్లాలో రెండు విడతలుగా.. అంటే ఏప్రిల్ 6, ఏప్రిల్ 8న నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని 7వ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల షెడ్యూలును సవరించుకోవటానికి అధికారం ఉంది.’’