
హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలందరికీ కలిపి ఇచ్చే రిజర్వేషన్లు 50% దాటడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రిజర్వేషన్లకు మాత్రం ఇది వర్తించదని, ఆ ప్రాంతాల్లో 50% మించి ఎస్టీ రిజర్వేషన్లు కల్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి. రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్‌ల ధర్మాసనం సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రిజర్వేషన్లు 50% దాటకూడదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఉత్తర్వుల్లో ప్రముఖంగా ప్రస్తావించింది.
పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని, ఇది రాజ్యాంగ విరుద్ధమేగాక సుప్రీంకోర్టు తీర్పునకు సైతం విరుద్ధమంటూ సంగారెడ్డి జిల్లా పోసానిపేట సర్పంచ్ వి. సప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే రిజర్వేషన్ల మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 396తోపాటు తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని పలు నిబంధనలను సవాల్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన ఎ. గోపాల్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
రిజర్వేషన్లు 50% దాటాయన్న పిటిషనర్లు
ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వేదుల శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50% దాటకూడదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు 50% దాటుతున్నాయని వివరించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, కొన్ని చోట్ల ఎస్సీ, ఎస్టీలకు 100% రిజర్వేషన్లు ఇస్తున్నారని వివరించారు.
మొత్తం 61 శాతం ఇస్తున్నామన్న ప్రభుత్వం
ఈ వాదనపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ. సంజీవ్ కుమార్ స్పందిస్తూ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34%, ఎస్సీలకు 20%, ఎస్టీలకు 7% రిజర్వేషన్లు కలిపి మొత్తం 61% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో బీసీల జనాభా 52% ఉందని ఆయన వివరించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మొదట బీసీ జనాభాను లెక్కించి ఆ తర్వాతే రిజర్వేషన్లు ఖరారు చేయాలని సింగిల్ జడ్జి చెప్పారని, ఉప వర్గీకరణ అంశం జోలికి ఆయన వెళ్లలేదన్నారు. ఈ ఆదేశాల మేరకు బీసీ జనాభాను లెక్కించాలన్నారు.
బీసీలకు 34% రిజర్వేషన్లకు ప్రాతిపదికేదీ?
ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రాతిపదిక ఏమిటని ప్రశ్నించింది. గతంలో కోర్టులిచ్చిన ఆదేశాలతోపాటు ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాలను పరిగణనలోకి తీసుకుని బీసీలకు 34% రిజర్వేషన్లు ఇచ్చామని సంజీవ్ చెప్పగా బీసీ జనాభా లెక్కించినా, లెక్కించకపోయినా రిజర్వేషన్లు 50% దాటకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసిందంటూ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ రెండు వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తూ ప్రతివాదులుగా ఉన్న పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను వాయిదా వేసింది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఇప్పటివరకు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం జరగకపోవడమే ప్రభుత్వానికి ఈ ఎదురుదెబ్బ తగలడానికి కారణమని న్యాయవాద వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment