
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు ఏ, బీ, సీ, డీ కేటగిరీలవారీగా రిజర్వేషన్లు అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. వివరణ ఇవ్వాలంటూ పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 9(4)ను సవాలు చేస్తూ తెలంగాణ ఎంబీసీ సంఘం ప్రధాన కార్యదర్శి ఆశయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. బీసీలకు కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించొద్దని సుప్రీంకోర్టు చెప్పలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదించారు. దీనిపై జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టుకు సుప్రీంకోర్టు తిరిగి పంపిందని తెలిపారు. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 15(4) ప్రకారం కేటగిరీలవారీగా రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాల్సి అవసరం ఉందని పేర్కొంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.