సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు ఎస్టీ, ఎస్సీ, బీసీ కోటాను జిల్లాలవారీగా ఖరారు చేసింది. పంచాయతీల్లో 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీలకు 22.8 శాతం, ఎస్సీలకు 20.5 శాతం, ఎస్టీలకు 6.7 శాతం రిజర్వేషన్లు నిర్ధారిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఏజెన్సీ, వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న పంచాయతీలు, సాధారణ రిజర్వేషన్లతో కలిపి ఈసారి ఎస్టీలకు ఎక్కువ సంఖ్యలో సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
ఇక అన్ని కేటగిరీల్లోనూ 50 శాతం పంచాయతీలను మహిళలకు కేటాయించారు. రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల(షెడ్యూల్)కు సంబంధించిన 1,281 పంచాయతీలను ఎస్టీలకు కేటాయించారు. అలాగే వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 సర్పంచ్ స్థానాలను కూడా వారికే రిజర్వ్ చేశారు. ఇవి తీసేయగా మిగిలిన 10,293 పంచాయతీలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కోటా ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించారు. దీంతో ఎస్టీలకు 688, ఎస్సీలకు 2,113, బీసీలకు 2,345 సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయ్యాయి. మొత్తమ్మీద అందరి కంటే అత్యధికంగా ఎస్టీలకు 3,146 పంచాయతీలు దక్కాయి.
ఇక 50 శాతం అన్‌రిజర్వ్‌డ్ కోటా కింద 5,147 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. వీటిలో అన్ని వర్గాలవారు పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్.. అన్ని కేటగిరిల్లోనూ సగం స్థానాలను(6,378) మహిళలకు కేటాయించారు. అలాగే జనరల్‌కు కేటాయించిన 6,373 స్థానాల్లో కూడా మహిళలు పోటీచేసే అవకాశం ఉంటుంది. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారి గ్రామపంచాయతీ ఎన్నికలు జరిగాయి. అప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా మహిళలకు అన్ని కేటగిరీల్లో 50 శాతం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను ఖరారు చేశారు.
బీసీలకు తగ్గిన కోటా...
గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే వెనుకబడిన వర్గాలకు ఈసారి రిజర్వేషన్లు తగ్గాయి. గత ఎన్నికలలో బీసీలకు 34 శాతం కోటా ఉండగా.. ఈసారి అది 22.8 శాతానికి మాత్రమే పరిమితమైంది. తమకు రిజర్వేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘాలు, బీసీ ప్రజాప్రతినిధులు హెచ్చరించినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే వారికి రిజర్వేషన్లు ఖరారు చేశారు. దీంతో ఈ అంశంపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీసీ సంఘాలు చెబుతున్నాయి. కాగా, జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వుడ్ కోటా ఖరారైన నేపథ్యంలో ఒకటిరెండు రోజుల్లో మండలాలవారీగా రిజర్వేషన్లు నిర్ధారించనున్నారు.
సర్పంచ్ స్థానాలతోపాటు వార్డు సభ్యుల రిజర్వేషన్లును ఇదే పద్ధతిలో నిర్ణయిస్తారు. ఆయా జిల్లాల్లోని మండలాలవారీగా వివిధ కేటగిరీల వివరాలను కలెక్టర్లు ప్రకటిస్తారు. అనంతరం ఏ గ్రామపంచాయతీ ఏ వర్గానికి రిజర్వు అవుతుందనేదీ వెల్లడిస్తారు. ఈ వివరాలన్నీ సిద్ధం కాగానే సదరు జాబితాను పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ప్రభుత్వం ఆ వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తుంది. ఈ జాబితా అందగానే ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
నల్లగొండలోనే ఎక్కువ...
ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల విశ్లేషిస్తే నల్లగొండ జిల్లాలోనే ఎక్కువ పంచాయతీలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. ఈ జిల్లాలో ఎస్సీలకు అత్యధికంగా 136, ఎస్టీలకు 69 పంచాయతీలు దక్కాయి. అలాగే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల కంటే ఇక్కడే అత్యధికంగా 421 పంచాయతీలు మహిళలకు లభించాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో బీసీలకు అత్యధికంగా 170 పంచాయతీలు రిజర్వ్ కాగా, ఇదే జిల్లాలో 307 పంచాయతీలు అన్ రిజర్వ్‌డ్ కోటాలోకి వెళ్లాయి.
రాష్ట్రంలో గ్రామపంచాయతీ రిజర్వేషన్ వివరాలివీ...
Comments
Please login to add a commentAdd a comment