-
ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఈసీ అఫిడవిట్
-
వాయిదాపై అఖిలపక్ష భేటీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి
-
కొన్ని ఎన్నికల వాయిదా కోరితే.. కొన్ని ఫలితాలు వాయిదా కోరాయి
-
మరికొన్ని పార్టీలు యథాతథంగా ఎన్నికలు నిర్వహించాలన్నాయి
-
జిల్లా యంత్రాంగాలు ఎన్నికల నిర్వహణకు సిద్ధమని చెప్పాయి
-
వాయిదా వేస్తే కష్టమని పోలీసు ఉన్నతాధికారులూ పేర్కొన్నారు
-
సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర బలగాలు వెళ్లిపోతాయి
-
రాష్ట్రంలో ఉద్యోగులంతా విభజన పనుల్లో నిమగ్నమై ఉంటారు
-
ఫలితాల వాయిదా కూడా సాధ్యం కాదు.. బ్యాలెట్లకు భద్రత కష్టం
-
ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తాం
-
ఏప్రిల్ 11న ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తాం.. అనుమతించండి
-
సుప్రీంకోర్టుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మధ్యంతర దరఖాస్తు
-
ఈ నెల 24వ తేదీ తర్వాత విచారణకు వచ్చే అవకాశం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికలను ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6న ఒక విడతలో కాకుండా.. ఏప్రిల్ 6, ఏప్రిల్ 8 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించి 11న ఫలితాలు వెల్లడిస్తామని.. ఇందుకు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఎన్నికల వాయిదాపై అఖిలపక్ష సమావేశంలో రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని నివేదించింది. ఆయా పార్టీల అభ్యర్థన మేరకు ఎన్నికలు వాయిదా వేసి మే 7 తరువాత నిర్వహించేందుకు పోలీసు బలగాలు అందుబాటులో ఉండవని, విభజన నేపథ్యంలో సిబ్బంది కూడా వేరే పనుల్లో నిమగ్నమవుతారని పేర్కొంది.
అలాగే.. ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికలు నిర్వహించి ఫలితాలను మే 7వ తేదీ వరకు వాయిదా వేయటం కూడా కుదరదని.. నెల రోజుల పాటు బ్యాలెట్ బాక్సులను కాపడేందుకు భద్రతా సిబ్బంది సరిపోరని పోలీసు శాఖ స్పష్టంచేసిందని నివేదించింది. అందువల్ల ప్రస్తుత షెడ్యూలుకే స్వల్ప సవరణ చేస్తూ ఏప్రిల్ 6, 8 తేదీల్లో పోలింగ్ నిర్వహిస్తామని పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం అత్యున్నత న్యాయస్థానానికి మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది. అయితే ఈ దరఖాస్తు శుక్రవారం విచారణకు రాలేదు. హోలీ సెలవుల అనంతరం ఈ కేసు ఎప్పుడు విచారణకు వస్తుందో ఈ నెల 24న తెలియనుంది. అయితే.. ఎన్నికల సంఘం ప్రతిపాదించిన ఏప్రిల్ 8వ తేదీ శ్రీరామనవమి కావటం గమనార్హం.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని 2013 ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేయాలని కోరుతూ ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి దాఖలు చేసిన వినతి మేరకు ఈ ఏడాది మార్చి 7న సుప్రీంకోర్టు.. పంచాయతీరాజ్ ఎన్నికల షెడ్యూలుపై సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని, మార్చి 10 కల్లా షెడ్యూలు విడుదలపై ఏ చర్యలు తీసుకున్నారో తెలపాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ నెల 10న ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ విషయాన్ని వివరిస్తూ 12వ తేదీన (బుధవారం) అఫిడవిట్ దాఖలు చేసింది.
అదే రోజు విచారణ సందర్భంగా.. సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఈ ఎన్నికలు నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని, యంత్రాంగం సరిపోదని విన్నవించింది. ఎంపీటీసీ, జడ్‌పీటీసీ ఎన్నికలు వాయిదావేయాలని కోరుకుంటే సరైన దరఖాస్తుతో రావాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ విషయమై ఎన్నికల సంఘం గురువారం రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకుంది. ఈ నేపథ్యంలో.. ఎన్నికలు కానీ, ఫలితాలు కానీ వాయిదా వేయటం సాధ్యం కాదని.. ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్ నిర్వహించటానికి జారీ చేసిన షెడ్యూలును సవరించి.. ఏప్రిల్ 6, 8 తేదీల్లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహించేందుకు అనుమతించాలని కోరుతూ శుక్రవారం మధ్యంతర దరఖాస్తు దాఖలు చేసింది.
సుప్రీంకోర్టుకు ఎన్నికల సంఘం తెలిపిన కారణాలివీ..
పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వచ్చాయి..: ఎన్నికల నిర్వహణపై పార్టీల అభిప్రాయాలు తీసుకోగా పార్టీలన్నీ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశాయి. కొన్ని పార్టీలు షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూనే ఫలితాలను మాత్రమే సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకటించాలని కోరాయి. మరికొన్ని పార్టీలు స్థానిక ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలయ్యాకే నిర్వహించేందుకు వీలుగా రీషెడ్యూలు చేయాలని కోరాయి. ఇంకొన్ని పార్టీలు రాష్ట్ర విభజన నేపథ్యంలో అపాయింటెడ్ డే అయిన జూన్ 2 లోగా ఈ స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని కోరాయి. మరికొన్ని పార్టీలు ప్రస్తుత షెడ్యూలు ప్రకారమే నిర్వహించాలని కోరాయి.
ఎన్నికలకు యంత్రాంగం సిద్ధంగా ఉంది..: అయితే మేం జిల్లా కలెక్టర్లు, ఎస్‌పీలు, జడ్‌పీ సీఈవోలు, ఆర్‌డీఓలు, డీపీఓలతో సమావేశమై వారి అభిప్రాయం తీసుకున్నాం. చాలా వరకు జిల్లాల యంత్రాంగం ప్రస్తుత షెడ్యూలు ప్రకారం ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కొన్ని చోట్ల మాత్రం సీనియర్ అధికారులు బహుముఖ పనుల ఒత్తిడి కారణంగా రెండు విడతలుగా నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఎన్నికల నిర్వహణ ఒకే విడతలో తప్పదనుకుంటే అందుకు కూడా సిద్ధమేనని పేర్కొన్నారు.’’
‘బ్యాలెట్’ భద్రతకు సిబ్బంది సరిపోరు..: మేం రాష్ట్ర డీజీపీ, అదనపు డీజీపీలతో సమావేశమయ్యాం. కొన్ని రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఫలితాలను సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై చర్చించాం. ఏప్రిల్ 6న ఎన్నికలు నిర్వహిస్తే సార్వత్రిక ఎన్నికలయ్యే నాటికి.. అంటే మే 7 వరకు బ్యాలెట్ బాక్సులకు భద్రతా సిబ్బందిని కేటాయించలేమని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. 1,096 జెడ్‌పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరుగుతున్నందున దాదాపు 300 ప్రాంతాల్లో ఈ బ్యాలెట్ బాక్సుల రక్షణకు 12 నుంచి 15 బెటాలియన్ల బలగాలు అవసరమవుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.
ఉద్యోగులు ‘విభజన’ పనుల్లో ఉంటారు..: కొన్ని పార్టీల సలహా మేరకు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాక.. అంటే మే 7 తరువాత నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై కూడా చర్చించాం. అయితే ఆ సమయానికి కేంద్ర బలగాలన్నీ వెనక్కి వెళ్లిపోతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులంతా విభజన పనుల్లో నిమగ్నమై ఉంటారు. విభజన అమలులోకి వచ్చే అపాయింటెడ్ డే కూడా దగ్గరపడుతుంది. అందువల్ల ఆ సమయంలో కూడా ఎన్నికలు నిర్వహించ డం సరికాదని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.
ప్రతి జిల్లాలో రెండు విడతలుగా..: అలాగే ఒకే విడతలో నిర్వహించేందుకు కూడా పోలీసు బలగాలు ఎక్కువ అవసరమవుతాయని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. స్థానిక ఎన్నికలు సక్రమంగా నిర్వహించాలంటే ప్రతి జిల్లాలో రెండు విడతలుగా.. అంటే ఏప్రిల్ 6, ఏప్రిల్ 8న నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని 7వ నిబంధన ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల షెడ్యూలును సవరించుకోవటానికి అధికారం ఉంది.’’