ఇంతకీ సండ్ర ఎక్కడ..?
జిల్లాలో సర్వత్రా ఆసక్తి
ఆస్పత్రిలో చేరినట్లు ఏసీబీకి లేఖ
ఎక్కడున్నది సమాచారం ఇవ్వని ఎమ్మెల్యే
విశాఖ, విజయవాడలో అంటూ పుకార్లు
ఖమ్మం :ఓటుకు కోట్లు వ్యవహారంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఏసీబీ విచారణకు హాజరు కాకుండా ఎక్కడ ఉన్నారనేది.. ప్రస్తుతం జిల్లాలో ప్రధానంగా సాగుతున్న చర్చనీయంశం! ఈనెల 19న సాయంత్రం లోగా విచారణకు హాజరు కావాలని ఏసీబీ ఆయనకు నోటీసులు పంపిన విషయం విదితమే. అయితే ఆయన మాత్రం ఆరోగ్యం సరిగ్గా లేనందున ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని.. ఈపరిస్థితులతో ‘మీ వద్దకు రాలేకపోతున్నా, కోలుకున్న వెంటనే మీ వద్దకు వచ్చి పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తా.. లేదా మీరు నేనున్న ఆస్పత్రికి వస్తే కావాల్సిన సమాచారం ఇస్తా’ అంటూ ఏసీబీకి లేఖ రాశారు. లేఖలో సండ్ర ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారో పేర్కొనకపోవడంతో అసలు ఆయన ఎక్కడ ఉన్నారన్నది జిల్లాలో హాట్ టాపిక్ అయింది.
ఏసీబీ ఓటుకు కోట్లు వ్యవహారంలో దూకుడుగా ముందుకు వెళ్తుండడంతో సండ్ర ముందుస్తుగా విచాణరణకు హాజరు కాకుండా న్యాయపరంగా సలహాలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తర్వాత నేరుగా ఓటుకు కోట్లు విషయంలో సండ్ర అధికార పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు ఏసీబీ భావిస్తోంది. దీంతో ఏసీబీ విచారణకు హాజరైతే.. సమాచారం తీసుకున్న తర్వాత మరింత విచారణ కోసం అరెస్టు చేస్తుందా..? అని ఆలోచించిన సండ్ర వ్యూహాత్మకంగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. మూడు రోజులు ఆయన విశాఖపట్నంలో ఉన్నట్లు, ఆతర్వాత విజయవాడకు వచ్చారని, హైదరాబాద్‌లోని ఉన్నారని ఇలా రకరకాల ప్రచారం జిల్లాలో సాగుతోంది.
శుక్రవారం ఖచ్చితంగా ఆయన ఏసీబీకి విచారణకు హాజరవుతారని ఆయన నుంచి ఏసీబీ ఏం రాబడుతుంది.. ? ఆయన ఎలా వ్యవహరిస్తారు..? అని జిల్లాలోని పలు రాజకీయ పార్టీల నేతలు, శ్రేణులు ప్రధానంగా టీడీపీ కేడర్ ఆసక్తిగా టీవీ చానెళ్ల ముందు ఎదురు చూశారు. గడువు వరకు ఆయన రాకపోవడం అంతకు కొంత సమయం ముందే ఏసీబీకి లేఖ పంపడంతో అసలు సండ్ర ఎక్కడ ఉన్నారని టీడీపీ శ్రేణులు కూడా ఆరా తీశాయి.
సత్తుపల్లి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు రోజంతా ఆయన ఎక్కడ ఉన్నారు..? అని జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల్లో ఉన్న నేతలతో ఫోన్‌లో మాట్లాడారు. జిల్లాలోని ఒక్కరిద్దరు ప్రధాన నేతలకు మాత్రమే ఆయన ఎక్కడున్నారని సమాచారం తెలిసినట్లు తెలిసింది. సండ్ర రెండు నెంబర్లు, ఆయన వెంట నిత్యం ఉండే ప్రధాన అనుచర నేతలు సెల్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తుండడంతో ఎక్కడన్నది ఏసీబీకి కూడా అంతు చిక్కడం లేదు. అయితే ఏసీబీ రాసిన నోట్‌లో మాత్రం ఆస్పత్రికి వస్తే మీరు కావాల్సిన సమాచారం ఇస్తానని పేర్కొన్న సండ్ర.. ఏసీబీ అధికారులకు తాను ఎక్కడ ఉన్నానన్న సమాచారం ఫోన్‌లో ఏమైనా చెప్పారా..? అని కూడా ప్రచారం సాగుతోంది.
ఏసీబీ ఏం చేస్తుందో..?
సండ్ర లేఖతో ఏసీబీ తదుపరి చర్యలు ఏం తీసుకుంటుందోనని జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ఎక్కడున్నది సమాచారం తెలుసుకొని అదుపులోకి తీసుకుంటారా..? లేక ఏ రకంగా ఏసీబీ ముందుకు వెళ్తుందన్నది చర్చనీయాంశమైంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏదైనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సండ్ర సమాచారం ఇస్తే అక్కడికి ఏసీబీ ఎలా వెళ్తుంది..? ఎలాంటి చర్యలు తీసుకుంటుంది..? వేచి చూడాల్సిందే. సండ్ర లేఖపై ఏసీబీ శనివారం స్పందించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్లయితే అక్కడి సీఎం స్కెచ్‌లోనే భాగంగా సండ్ర ఏసీబీకి లేఖ రాశారా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా ఓటుకు కోట్లు వ్యవహారంలో సండ్ర ఏసీబీకి ఆస్పత్రిలో చికత్స పొందుతున్నాని నోట్ రాయడం జిల్లాలో ప్రధాన చర్చకు దారితీసింది. వారం రోజులుగా సండ్ర జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు అందుబాటులో లేకుండా పోవడంతో ఏసీబీ ఏంచేస్తుందోనని వారిలో ఆందోళన నెలకొంది.