ఏసీబీ కార్యాలయం నుంచి బయటకొస్తున్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య (ఫైల్)
* ఏసీబీ తొలి రోజు కస్టడీ విచారణలో సండ్ర దాటవేత ధోరణి
* ప్రతి కాల్‌నూ గుర్తుంచుకోలేనంటూ బదులు
* కీలకమైన ప్రశ్నలపట్ల మౌనం
* అతికష్టం మీద కొంత సమాచారం సేకరణ
* సీఎం కేసీఆర్‌తో ఏసీబీ డీజీ, హోంశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ
సాక్షి, హైదరాబాద్: రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో సూత్రధారుల్ని కనిపెట్టేందుకు అవినితి నిరోధకశాఖ (ఏసీబీ) కసరత్తు మరింత ముమ్మరం చేస్తోంది. ఈ కేసులో ఐదో నిందితుడైన ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను విచారించేందుకు ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన రెండు రోజుల అనుమతిలో భాగంగా గురువారం తమ కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ...ఆయన్నుంచి అతికష్టం మీద కొంత సమాచారాన్ని సేకరించినట్లు తెలిసింది. అయితే కొన్ని కీలకమైన ప్రశ్నలపట్ల కూడా దాటవేత ధోరణి అవలంబించినట్లు సమాచారం. ఈ కేసులో కీలక వ్యక్తులకు సంబంధించి రెండో రోజైన శుక్రవారం కచ్చితమైన వివరాలు రాబట్టాలని ఏసీబీ యోచిస్తోంది.
కరువైన సమాధానం...
ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మేరకు ఏసీబీ అధికారులు ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను తమ కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో జరిగిన ఈ విచారణలో సండ్ర నుంచి కీలకమైన సమాచారాన్ని రాబట్టేందుకు ఏసీబీ అడిషనల్ ఎస్పీ ఎం.మల్లారెడ్డి నేతృత్వంలోని అధికారులు శతవిధాలుగా ప్రయత్నించారు. ఉదయం ఏసీబీ కార్యాలయానికి రాగానే సండ్రకు కాఫీ ఇచ్చి అధికారులు కుశల ప్రశ్నలు వేశారు. అనంతరం చిన్నగా కేసుకు సంబంధించిన విషయాలను ఆయన వద్ద ప్రస్తావించారు. అయితే ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సండ్ర నుంచి చిత్రమైన సమాధానాలు వచ్చినట్లు సమాచారం.
నోటీసుల జారీ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఏసీబీ అధికారులకు చెప్పిన విషయాలనే పునారావృతం చేసినట్లు తెలిసింది. సెబాస్టియన్‌తో సాగించిన ఫోన్ సంభాషణలను ఆయన ముందుంచి కొన్ని పిన్ పాయింట్ ప్రశ్నలు వేయగా వాటిలో కొన్నింటి కి గుర్తులేదని, మరికొన్నింటి విషయంలో సండ్ర మౌనం వహించారని సమాచారం. ఈ కాల్స్ మాట్లాడింది మీరే కదా అని ఏసీబీ వేసిన ప్రశ్నకు... ‘ఏమో మాట్లాడి ఉండొచ్చు. నాకు గుర్తులేదు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యేను, టీటీడీ బోర్డు సభ్యుడిని. నాకు రోజూ చాలా కాల్స్ వస్తాయి. టీటీడీ సభ్యుడిని కాబట్టి చాలా మంది రెకమండ్ కోసం ఫోన్లు చేస్తుంటారు. అన్నింటినీ గుర్తుపెట్టుకోలేను’ అని సమాధానమిచ్చినట్లు తెలిసింది. అయితే అధికారులు తయారు చేసుకున్న ప్రశ్నావళిలో కొన్నింటికి సంబంధించి కొంత సమాచారాన్ని సండ్ర నుంచి రాబట్టగలిగినట్లు ఏసీబీ వర్గాల సమాచారం.
అంతా ‘తర్ఫీదు’ ప్రకారమే...
కస్టడీలో భాగంగా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పందించిన తీరుపట్ల ఏసీబీ అనేక అనుమానాలు వ్యక్తం చేస్తోంది. మొదటిసారి తామిచ్చిన నోటీసులకు, ఆ తర్వాత అరెస్టుకు మధ్య అంతరంలో ఆయన ‘తర్పీదు’ పొంది నట్లు భావిస్తోంది. ఏపీలోని విజయవాడ, చికి త్స పొందినట్లు చెబుతున్న రాజమండ్రిలోని బొల్లినేని ఆస్పత్రిలో సండ్ర ‘శిక్షణ’ పొందినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది. ఈ శిక్షణలో కొందరు టీడీపీ నేతలతోపాటు మానసిక నిపుణులు, ఏపీ పోలీసుల ఉన్నతాధికారులు బాగా తర్పీదు ఇచ్చినట్లు అనుమానిస్తోంది. కస్టడీలో భాగంగా గురువారం విచారించగా సండ్ర వ్యవహరశైలి అచ్చం అదే విధంగా ఉందని ఏసీబీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, ఈ కేసుకు సంబంధించి తాజా పరిస్థితిని ఏసీబీ డీజీ ఏకే ఖాన్.. సీఎం కేసీఆర్‌కు వివ రించారు. గురువారం సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఏకేఖాన్‌తోపాటు హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు కోట్లు కేసుతోపాటు రంజాన్ పండుగకు సంబంధించి ప్రభుత్వ ఏర్పాట్లను చర్చించినట్లు సమాచారం.
బెయిల్ పిటిషన్‌పై విచారణ 13కు వాయిదా
ఈ కేసులో సండ్ర దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి లక్ష్మీపతి ఈ నెల 13కు వాయిదా వేశారు. సండ్ర పిటిషన్‌పై గురువారం విచారణ జరగగా.. సండ్ర ఏసీబీ కస్టడీలో ఉన్నారని, వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఏసీబీ తరఫు న్యాయవాది కోరారు. దీంతో న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు. సండ్ర టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్నారని.. పలుకుబడి కలిగిన ఆయన బయట ఉంటే దర్యాప్తును అడ్డుకునే అవకాశం ఉందని పేర్కొంటూ ఏసీబీ ఇప్పటికే కోర్టులో కౌంటర్ దాఖలు చేసింది.