ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలని సీపీఐ, సీపీఎం హితవు పలికాయి.
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన నిజాయితీని నిరూపించుకోవాలని సీపీఐ, సీపీఎం హితవు పలికాయి. తెలంగాణ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషీట్‌లో పేరు లేకున్నా 22 సార్లు ప్రస్తావన వచ్చినందున నైతిక బాధ్యత వహించాలని విజ్ఞప్తి చేశాయి. ఈ మేరకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు కె.రామకృష్ణ, పి.మధు మంగళవారం వేర్వేరు ప్రకటనలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున రాష్ట్ర ప్రజల గౌరవప్రతిష్టలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పినందునే ఆంగ్లో ఇండియన్ సంతతికి చెందిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను కలిసినట్టు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి పదేపదే చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రతి నిత్యం జాతికి నీతులు ఉద్బోధించే వ్యక్తులు చేతల్లోనూ నీతి నిజాయితీలు చూపాలని చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. స్టీఫెన్‌సన్‌తో మాట్లాడింది తానో కాదో చెప్పి ఆతర్వాత ఫోన్ టాపింగ్ వ్యవహారమై కేసు నమోదు చేయాలని కోరారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజలకు వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం కేసులో కుట్రదారులెవరో, పాత్రదారులెవరో ప్రజలకు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.