నల్లగొండ : జిల్లా వ్యాప్తంగా ఏరులైపారుతున్న గుడుంబా లెక్కతేలింది. నాటుసారా జోలికి ఎవరూ వె ళ్లకుండా దాని స్థానంలో గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా రాష్ట్రస్థాయిలో జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. అయితే గుడుంబా అమ్మకాలు జరిగే ప్రాంతాలు గుర్తించిన తర్వాతే ఎన్ని గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలకు అనుమతివ్వాలనే అంశం ఆధారపడి ఉంది. దీంతో ఇటీవల జిల్లా ఎక్సైజ్‌శాఖ నాటుసారా అమ్మకాలు జోరుగా సాగే ప్రాంతాలను జల్లెడ పట్టింది. జిల్లా వ్యాప్తంగా 1178 గ్రామ పంచాయతీలు ఉండగా...నాటుసారా తయారయ్యే గ్రామాలు 483 ఉన్నట్లు గుర్తించారు.
ఈ గ్రామాలను ఏ,బీ కేటగిరీలుగా విభజించారు. ‘ఏ’ కేటగిరిలో నాటుసారా తయారు చేస్తున్న గ్రామాలు, తండాలు 260 ఉండగా...సారా అత్యధికంగా అమ్ముడయ్యే గ్రామాలు, తండాలు కలిపి 483 ఉన్నాయి. ఈ గ్రామాల్లో నాటుసారా తయారీ అరికట్టడంతోపాటు, మద్యం వ్యాపారులు అక్రమంగా నడుపుతున్న బెల్టుదుకాణాల భరతం పట్టేందుకు ‘పీడీ యాక్ట్’ ప్రయోగించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే గడిచిన నాలుగు మాసాల్లో పోలీస్‌శాఖ, ఎక్సైజ్ శాఖ అధికారులు గ్రామాలు, తండాల్లో మెరుపుదాడులు చేస్తున్నారు.
పోలీస్ వర్సెస్ ఎక్సైజ్....
గ్రామాల్లో చీప్ లిక్కర్ దుకాణాలు తెరవాలంటే ముందుగా నాటుసారా తయారీ నిరోధించాలి. దీనిలో భాగంగానే జూలైలో ఖరారు కావాల్సిన మద్య పాలసీ మూడు నెలల వరకు వాయిదా వేశారు. వచ్చే నెలాఖరు నాటికి మూడు మాసాల గడువు పూర్తవుతుంది. అప్పటిలోగా బెల్లం అమ్మకాలు, నాటుసారా తయారీ, బెల్టుదుకాణాలను నామరూపం లేకుండా చేయాలని పోలీస్, ఎక్సైజ్ శాఖలకు ఆదేశాలు వచ్చాయి. గతానికి భిన్నంగా ప్రభుత్వం పోలీస్ శాఖకు సర్వాధికారాలు కట్టబెట్టింది. పోలీస్‌శాఖ దాడిచేసి పట్టుకున్న కేసులను గతంలో ఎక్సైజ్ శాఖకు అప్పగించడం జరిగేది. కానీ ఇప్పుడు అలా కాకుండా పోలీస్ శాఖకు కేసులు న మోదు చేసే అధికారాన్ని కల్పించారు. దీంతో పోలీస్ అధికారులు జిల్లా వ్యాప్తంగా మెరుపు దాడులు చేస్తుండటంతో దానికి దీటుగానే ఎక్సైజ్ శాఖ సైతం నాటుసారా తయారీ దారులపై కొరఢా ఝళిపిస్తోంది.
దాడులు ఉధృతం....
వరుసగా మూడు, నాలుగు కేసులు నమోదైన వ్యక్తులు లేదా బెల్లం వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించనున్నారు. సారా తయారీ, విక్రయాలకు అడ్డుకట్టవేయడంలో విఫలమైతే సంబంధిత ఎక్సైజ్, పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేయమని సీఎం నుంచి ఆదేశాలు ఉన్నాయి. దీంతో నాలుగు మాసాలుగా ఈ రెండు శాఖలు కూడా కంటి మీద కునుకు లేకుండా గ్రామాల్లో, తండాల్లో తరచూ దాడులు చేస్తున్నాయి. గతేడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు నాటుసారా 25,023 లీటర్లు పట్టుకుంటే ఈ ఏడాది అదేరోజుల్లో 30,046 లీటర్ల సారాను సీజ్ చేశారు. గతేడాది అరెస్టయిన వ్యక్తులు 1338 మంది కాగా..ఈ ఏడాది 1501 మందిని అరెస్టు చేశారు. నల్లబెల్ల అమ్మకాలు మాత్రం గతేడాది 15,915 కిలోలు సీజ్ చేయగా...ఈ ఏడాది కేవలం 5,875 కిలోల బెల్లాన్ని మాత్రమే సీజ్ చేశారు. ఎక్సైజ్ శాఖ చరిత్రలో ఈ దాడులు ఓ రికార్డు సాధిస్తాయని అధికారులు చెప్పడం గమనార్హం.
‘ఏ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 260
‘బీ’ కేటగిరిలో గ్రామాలు /తండాలు : 223
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 31 వరకు నమోదైన గుడుంబా కేసులు
సీజ్ చేసిన సారాయి (లీటర్లు) 30,046
ధ్వంసమైన బెల్లం పానకం (లీటర్లు) 12,47,810
సీజ్ చేసిన నల్లబెల్లం(కిలోలు) 5,875
నాటుసారా కేసులు 3,125
అరెస్టయిన వారి సంఖ్య 1,501
సీజ్ చేసిన వాహనాలు 109
గుడుంబా అమ్ముతున్న గ్రామాలు @ 483
Published Thu, Aug 13 2015 12:57 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement