వికారాబాద్, న్యూస్‌లైన్: వికారాబాద్ సార్వత్రిక పోరులో.. కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌కు దీటైన అభ్యర్థి వెదుకులాటలో మిగతా పార్టీలు ఓ అంచనాకు రాలేకపోతుండడంతో.. ఇప్పటివరకూ ఏ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించలేదు. నామినేషన్ల పర్వం మొదలై రెండు రోజులు గడుస్తున్నా ఏ పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రసాద్‌కుమార్‌ను ఎదుర్కొనేందుకు బరిలో ఎవరిని నిలపాలనే విషయమై ఆయా పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. సమయం కాస్త గడిచిపోతుంటే ప్రచారం ఇంకెప్పుడు చేసుకునేదంటూ ఆ పార్టీల నుంచి టికెట్లు ఆశిస్తున్న స్థానిక అభ్యర్థులు అధిష్టానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులం మేం ఉండగా.. స్థానికేతరులకు టికెట్లు కేటాయిస్తే ఊర్కుకునేదని వారు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రసాద్‌కుమార్‌కు దీటుగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నట్లు ఆయా పార్టీల అధిష్టానాలు తమ నేతలకు చెబుతున్నట్లు సమాచారం.
టీడీపీ కంచుకోటలో కాంగ్రెస్ జెండా
వికారాబాద్ నియోజవర్గం గతంలో టీడీపీకి కంచుకోటగా ఉండేది. ఆ పార్టీ నుంచి ఎ.చంద్రశేఖర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో చంద్రశేఖర్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తుపెట్టుకుంది. ఈ ఎన్నికల్లో చంద్రశేఖర్ ఉమ్మడి అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో అప్పట్లో టీఆర్‌ఎస్ నుంచి ఎంపికైన ఎమ్యెల్యేలంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ నేపథ్యంలో 2008లో చంద్రశేఖర్ సైతం పదవికి రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా చంద్రశేఖర్, కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రసాద్‌కుమార్ బరిలో నిలిచారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రసాద్‌కుమార్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 సాధారణ ఎన్నికల్లో సైతం ఆయనే విజయకేతనం ఎగురవేశారు. అప్పటిదాకా టీడీపీకి కంచుకోటగా ఉన్న వికారాబాద్‌లో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు.
కాంగ్రెస్‌లోకి పెరిగిన వలసలు
ఇటీవల కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడంతో అన్ని పార్టీల నాయకులు ఆ పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో నియోజవర్గంలో కాంగ్రెస్ పటిష్టంగా మారిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎ.చంద్రశేఖర్ టీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన వికారాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున టికెటు తెచ్చుకుంటానని పలుమార్లు చెప్పడమే కాకుండా తన అనుచరులతో కలిసి ఢిల్లీలో అధిష్టానం దగ్గర తిష్టవేశారు. కాని టికెటు వచ్చేలా లేదని భావించి ప్రస్తుతం స్తబ్దతగా ఉన్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీలో కొంత కాలం కొనసాగిన సంజీవరావు ఇటీవల టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో ఉన్న డాక్ట ర్ సబితా ఆనంద్ పార్టీకి కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. వీరిద్దరూ ఆ పార్టీ నుంచి టికెటు ఆశిస్తున్నారు.
టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ
కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ అభ్యర్థిత్వం ఖరారైంది. కానీ టీఆర్‌ఎస్, టీడీపీ, బీజేపీల నుంచి బరిలో ఎవరు ఉంటారనేది ఇప్పటికీ స్పష్టత లేకపొవడంపై ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ బరిలో ఉండడంతో ఆయనను ఢీకొనే సత్తా ఉన్న నాయకుల కోసం పార్టీ అధిష్టానాలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. కాగా టీడీపీ, బీజేపీ పొత్తు కుదిరితే మాత్రం వికారాబాద్ టికెట్ టీడీపీకా లేక బీజేపీకా అనే మీమాంసలో ఆయా పార్టీశ్రేణులో డైలమాలో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ నుంచి రాంచందర్‌రావు, టీడీపీ నుంచి విజయ్‌కుమార్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరితే అవకాశం ఎవరికి వస్తుందో వేచి చూడాల్సిందే. తాండూరు స్థానాన్ని బీజేపీకి ఇస్తే వికారాబాద్ టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏది ఏమైనా.. నామినేషన్లు ప్రారంభమై రెండురోజులవుతున్నా ఇప్పటికీ ఏ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం.
వికారాబాద్‌లో నిలిచేదెవరో!
Published Thu, Apr 3 2014 11:38 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement