జెడ్పీ పీఠం ఎవరిదో.. | who are won in zp position | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం ఎవరిదో..

Published Sat, Jul 5 2014 3:22 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

who are won in zp position

 సాక్షిప్రతినిధి, వరంగల్ : మూడేళ్ల తర్వాత జిల్లా పరిషత్‌కు పాలకమండలి కొలువుదీరనుంది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎన్నిక శనివారం జరగనుంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన 40 రోజుల నుంచి పోటాపోటీగా క్యాంపులు నిర్వహిస్తున్న కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు జెడ్పీ పీఠంపై ధీమాగా  ఉన్నాయి... తమదంటే తమదని ప్రకటిస్తున్నాయి. ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని రెండు పార్టీల నేతలు చెబుతున్నారు. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ 24, టీఆర్‌ఎస్ 18, టీడీపీ 6, బీజేపీ1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. స్వతంత్రంగా గెలిచిన ఒక సభ్యురాలు కాంగ్రెస్‌తోనే ఉన్నారు.
 
 ఎక్కువ జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న పార్టీగా కాంగ్రెస్ జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సొంత పార్టీకి చెందిన ముగ్గరు సభ్యులే మొదటి నుంచి క్యాంపునకు దూరంగా ఉండడం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది. వారం క్రితం మరో ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు క్యాంపునకు దూరమవడంతో కాంగ్రెస్‌లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పరిస్థితి చక్కబడిందని... జెడ్పీ చైర్‌పర్సన్ పదవి తామే దక్కించుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. 28 మంది జెడ్పీటీసీ సభ్యుల మద్దతుతో జెడ్పీ పీఠాన్ని చేజిక్కుంచుకుంటామని అంటున్నారు. కాంగ్రెస్ కంటే తక్కువ స్థానాలు గెలిచినా అధికార పార్టీ టీఆర్‌ఎస్.. చైర్‌పర్సన్ పదవి విషయంలో ప్రతిష్టాత్మకంగా వ్యవహరిస్తోంది. మొదటి నుంచీ పట్టున్న జిల్లాలో జెడ్పీ పదవిని కచ్చితంగా దక్కించుకునేలా ప్రయత్నిస్తోంది.
 
 సాధారణ ఎన్నికల ఫలితాలు వెలవడిన తర్వాత టీఆర్‌ఎస్ కూడా క్యాంపు నిర్వహిస్తోంది. సొంత పార్టీకి చెందిన 18 మంది జెడ్పీటీసీ సభ్యులతో పాటు ముగ్గురు చొప్పున కాంగ్రెస్, టీడీపీ సభ్యులు తమతోనే ఉన్నారని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. వీరు కాకుం డా మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు తమవైపు వస్తారని అంటున్నారు. మొత్తంగా ఎన్నిక సమయూనికి తమకు 31 ఓట్లు వస్తాయని గులాబీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లో పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు నేరుగా జిల్లా పరిషత్‌కు రాకుండా పార్టీ జిల్లా కార్యాలయం వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి బృందంగా జిల్లా పరిషత్‌కు వస్తారు. కాంగ్రెస్ క్యాంపు నిర్వహణ బాధ్యతలను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి చూస్తున్నారు. టీఆర్‌ఎస్ సభ్యులు క్యాంపు నుంచి నేరుగా జిల్లా పరిషత్‌కు రానున్నారు. టీఆర్‌ఎస్ జెడ్పీటీసీ సభ్యుల క్యాంపు ఇన్‌చార్‌‌జగా పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఉన్నారు.
 
 ముగ్గురి మధ్యే ప్రధాన పోటీ..
 జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ప్రధానంగా ముగ్గురు జెడ్పీటీసీ సభ్యులు పోటీపడుతున్నారు. జిల్లాలోని 50 జెడ్పీటీసీ స్థానాల్లో 9 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. అందులో ఎస్సీ మహిళకు ఐదు స్థానాలు రిజర్‌‌వ అయ్యాయి. ఈ ఐదు స్థానాలతోపాటు ఎస్సీ జనరల్‌గా ఉన్న పర్వతగిరి, నెక్కొండ జెడ్పీటీసీ స్థానాల్లో కూడా మహిళలు గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బక్కి కవితను చైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలో దింపనున్నట్లు హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్‌ఎస్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ పదవికి ఇద్దరు పోటీ పడుతున్నారు. పర్వతగిరి జెడ్పీటీసీ సభ్యురాలు మాదాసి శైలజ, నర్మెట జెడ్పీటీసీ సభ్యురాలు గద్దల పద్మలో ఒకరిని టీఆర్‌ఎస్ తమ  అభ్యర్థిగా రంగంలోకి దింపనుంది. వీరిద్దరిలో ఎవరు చైర్‌పర్సన్ అభ్యర్థి అనేది ఆఖరి నిమిషయంలోనే ఖరారవుతుందని టీఆర్‌ఎస్ జిల్లా నేతలు చెబుతున్నారు. జెడ్పీ వైస్ చైర్మన్ పదవిపై సొంత పార్టీ క్యాంప్‌నకు దూరంగా ఉన్న కాంగ్రెస్ జెడ్పీటీసీ సభ్యులు, టీడీపీ సభ్యులు ఆశలు పెట్టుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement