ద్రోహం చేస్తున్నదెవరు?
‘‘పేద ప్రజలకు ద్రోహం చేస్తున్నది కమ్యూనిస్టు పార్టీలే. ఎవరికి వారు విడివిడిగా ఎర్ర జెండాలు పట్టుకొని ఉద్యమాలు చేసినంత కాలం ఓట్లు రావు. కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసి ఒకే జెండాతో ముందుకెళ్తే విజయం మనదే. లేదంటే ఎన్నేళ్లయినా రోడ్ల మీద అరవాల్సిందే..’’ అంటూ అభ్యుదయ చిత్రాల నిర్మాత ఆర్.నారాయణమూర్తి ఆవేదన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా మనసులో మాట బయటకు చెప్పి బాధ పెట్టడం ఇష్టంలేకే వామపక్షాల సమావేశాలకు రావడం మానేశానని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అన్ని వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇటీవల మఖ్దూం భవన్‌లో పది వామపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. అది ముగించుకుని నేతలు బయటకొస్తున్న సమయంలో వ్యక్తిగత పని మీద నటుడు నారాయణమూర్తి అక్కడికి వచ్చారు.
ఆ సమయంలో వివిధ వామపక్ష పార్టీల నేతలతో నారాయణమూర్తి మాట్లాడుతూ.. వాస్తవానికి ఈ సమావేశానికి తానూ హాజరు కావాలని అనుకున్నానని, అక్కడికొస్తే తన మనసులోని మాట చెప్పాల్సి వస్తుందని రాలేదని అన్నారు. మనసులోని మాటేంటని అడిగితే.. వామపక్ష పార్టీలన్నీ కలిస్తే బాగుంటుందన్నదే ఆ మాట అని చెప్పారు. ఈ విషయం నేను బయటకు చెబితే బాధపడతారేమోననే ఉద్దేశంతోనే సమావేశానికి రాలేదని అన్నారు. అక్కడే ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో మాట్లాడుతూ ‘‘అన్నా..! ఎవ్వరికి వారు కాకుండా వామపక్షాలన్నీ కలిసికట్టుగా ఒకే జెండాపై పోరాటాలు చేస్తే విజయం మనదే. నిజం చెప్పాలంటే ప్రజలకు ద్రోహం చేస్తున్నది దోపిడీదారులు కాదు. మనమే..’’ అంటూ నారాయణమూర్తి మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోయారట. దీంతో మరేం మాట్లాడాలో తెలియక లెఫ్ట్ నేతలు ఇబ్బందిపడ్డారు.