బంగారు తెలంగాణే లక్ష్యం
► అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రకటన
►అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. ప్రతి పౌరునికీ సమాన హోదా, రక్షణ
►బలిదానాలను మరవం, అమరుల కుటుంబాలకు సర్కారు అండ
►రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
►లక్షలోపు పంట రుణాలు మాఫీ.. వెనుకబడినవర్గాల సంక్షేమానికి పెద్దపీట
►కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య.. వికలాంగులకు రూ. 1,500,
►వృద్ధులు, అనాథ మహిళలు, బీడీ కార్మికులకు వెయ్యి పింఛను
►జర్నలిస్టులకు రూ. 10 కోట్లు, న్యాయవాదులకు 100 కోట్లతో సంక్షేమ నిధి
►ఉభయసభలను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్: ‘సర్వ జన హితాయ - సర్వ జన సుఖాయ’.. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం-ఆశయం అని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరునికీ సమాన హోదా, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రాష్ర్టంలో సరికొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి బుధవారం గవర్నర్ తొలిసారి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల బలిదానాలను ప్రభుత్వం మరచిపోదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 15 ఏళ్లుగా సాగిన సుదీర్ఘ ఉద్యమంలో యువత కీలకపాత్ర పోషించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. సొంత రాష్ర్టం, స్వయం పాలనతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకమే వారికి ప్రేరణగా నిలిచిందన్నారు. అమరుల బలిదానాలు విలువ కట్టలేమన్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయంతోపాటు ప్రతి కుటుంబంలోని ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ‘ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇతర వర్గాల పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతీ రైతుకు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్ను మినహాయింపులిస్తాం. వికలాంగులకు రూ. 1,500, వృద్ధులు, అనాథ మహిళలు, బీడీ కార్మికులకు రూ. 1,000 పింఛను అందజేస్తాం’ అని నరసింహన్ పేర్కొన్నారు.
హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇస్తామని, రాబోయే ప్రాజెక్టులకు అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘ప్రత్యేక చేజింగ్ విభాగాన్ని’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెడతామని, మెల్‌బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటోలకు దీటుగా ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేద విద్యార్థులందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని తెలిపారు. ‘ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో శాశ్వత కార్యాలయాల నిర్మాణం చేపడతా’మని చెప్పారు.
గవర్నర్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు
ఐదేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు
ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు. కైతీ లంబాడీలకు, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా.
మైదానప్రాంత గిరిజనుల కోసం ఐటీడీఏలు
పంచాయుతీలుగా లంబాడ తండాలు, ఆదివాసీ గూడేలు
రూ. 25 వేల కోట్లతో బీసీల సమగ్రాభివృద్ధి
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్. ఏటా రూ. 1000 కోట్ల బడ్జెట్
ఆటో రిక్షాలకు పన్ను మినహాయింపు, ప్రమాద బీమా
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంటు, హెల్త్ కార్డులు
జర్నలిస్టులకు రూ. 10 కోట్లతో.. న్యాయవాదులకు రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి
జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు
- నిజామాబాద్‌లో చెరకు, మోతెలో పసుపు పరిశోధన కేంద్రాలు
- ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
- గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ
- పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం
- జూరాల-పాకాల సాగునీటి వ్యవస్థ కోసం సర్వే
- మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి - ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు