Waiver of agricultural loans
-
రైతు నెత్తిన పిడుగు
బాబు సీఎంగా ప్రమాణం చేసి నెలవుతున్నా మాఫీపై స్పష్టత కరువు తాకట్టు బంగారం, భూములు వేలం వేస్తామంటూ బ్యాంకుల హెచ్చరికలు రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి చేస్తున్న బ్యాంకు అధికారులు పాత రుణాలు పూర్తిగా తీరనిదే కొత్తవి ఇచ్చేది లేదని స్పష్టీకరణ రైతుల్లో తీవ్ర ఆందోళన.. రుణాల మాఫీపై ఆవిరవుతున్న ఆశలు మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా రాష్ట్ర రైతాంగం.. నిపుణుల ఆందోళన నెట్వర్క్: అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత మళ్లీ పెనుగండంలో పడ్డాడు. ఒకవైపు వ్యవసాయ రుణాల మాఫీపై చంద్రబాబు సర్కారు పిల్లిమొగ్గలు.. మరోవైపు రుణాలు తిరిగి చెల్లించాలంటూ బ్యాంకుల తాఖీదులు.. ఇంకోవైపు మళ్లీ సాగు కోసం కొత్త రుణాలు లభించిని దుస్థితి.. బ్యాంకుల రుణాలు, సాగు కోసం ప్రయివేటు అప్పులు చేయాల్సిన పరిస్థితి.. ఇంత చేసినా ఖరీఫ్ ఆరంభమైనా వర్షాల జాడలేని ఆందోళనకరస్థితి.. అన్నీ కలగలిసి రైతన్నను అగాథంలోకి నెట్టివేస్తున్నాయి. తీవ్ర ఆందోళన, ఆశాభంగం, నిరాశానిస్పృహలతో రాష్ట్ర రైతాంగం కుంగిపోతోంది. నలుదిక్కుల నుంచీ సమస్యల దాడితో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. సర్కారు ఇప్పటికైనా ఆదుకుంటుందా.. అన్నమాటను నిలబెట్టుకుంటుందా.. అని దైన్యంగా నిరీక్షిస్తోంది!! ఎన్నికల వేళ.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే తొలుత వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఊరూవాడా విస్తృతంగా ప్రచారం చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రైతుల రుణాల మాఫీపైనే తొలి సంతకం చేస్తాననీ హామీ ఇచ్చారు. సీఎంగా ప్రమాణం చేయగానే ఫైలుపై సంతకం కూడా చేశారు. కానీ.. అది రుణాల మాఫీపై అధ్యయనానికి సంబంధించిన ఫైలు! మాఫీ ఎలా, ఎవరికి, ఎంత చేయాలి వంటి విధివిధానాలను సిఫారసు చేయటానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల ఫైలు! కమిటీ 15 రోజుల్లో మధ్యంతర నివేదిక ఇస్తుందని, దాన్ని బట్టి రుణ మాఫీపై స్పష్టత ఇస్తామని బాబు ప్రకటించారు. ఆ 15 రోజులూ గడిచాయి. మధ్యంతర నివేదికకే మరో 10 రోజుల గడువు పెంచారు. బాబు సీఎంగా ప్రమాణం చేసి దాదాపుగా నెల కావస్తున్నా రుణ మాఫీ ఊసే లేదు! ఎట్టకేలకు సదరు కోటయ్య కమిటీ తాత్కాలిక నివేదిక ఇచ్చినా.. అందులో విధివిధానాల మాట లేదు!! ఇప్పుడేమో రుణాల మాఫీ మాట పక్కన పెట్టేసి రీషెడ్యూల్ రాగం వినిపిస్తున్నారు! అంటే రుణాల మాఫీ ఇప్పుడుండదు. ఎప్పుడుంటుందో తెలియదు. ఎవరికుంటుందో కూడా తెలియదు! పోనీ రీషెడ్యూల్ అయినా జరుగుతుందా అంటే అదీ అయోమయమే! ఇన్ని వేల కోట్ల రూపాయల రుణాలను రీషెడ్యూల్ చేయటం సాధ్యం కాదని భారతీయ రిజర్వు బ్యాంకు స్వయంగా స్పష్టంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా, కోటయ్య కమిటీ కలిసి విజ్ఞప్తి చేసినా అదే మాటను పునరుద్ఘాటించింది. రుణ మాఫీపై స్పష్టత ఇవ్వండని తాజాగా రాష్ట్ర స్థాయి సమావేశంలో బ్యాంకర్లు కోరినా బాబు నుంచి స్పష్టతే రాలేదు. మాఫీకి కట్టుబడ్డామన్నారే తప్ప ఎప్పుడు, ఎలా, ఎంత రుణాన్ని మాఫీ చేస్తామన్నది మాత్రం చెప్పలేదు. పైగా రైతు రుణాలను రీషెడ్యూల్ చేయండంటూ బ్యాంకర్లను కోరారు బాబు! ఆర్బీఐ అంగీకరిస్తేనే అది సాధ్యమని, ఆర్బీఐని సంప్రదించి అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు స్పష్టంచేశారు. మరి రీషెడ్యూలైనా జరుగుతుందా, జరిగితే ఎన్ని మండలాలకు, ఎంతమందికి, ఎంత మొత్తానికి, బంగారం రుణాలకు, టర్మ్ రుణాలు కూడా వర్తిస్తుందా వంటి అనేకానేక ప్రశ్నలు ముసురుకుంటున్నాయి. కానీ వీటిలో ఒక్కదానిపైనా స్పష్టత లేదు!! ఒకవైపు ఖరీఫ్ సీజన్ మొదలై రోజలు, వారాలు గడిచిపోతున్నాయి. మరోవైపు గత ఏడాది తీసుకున్న వ్యవసాయ రుణాల చెల్లింపు గడువు ముగిసిపోయింది. తీసుకున్న అప్పులు మొత్తం వడ్డీతో సహా చెల్లించాలని బ్యాంకుల నుంచి రైతులకు నోటీసులు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే తాకట్టు పెట్టిన బంగారాన్ని, భూములను వేలం వేసి తమ రుణాలకు జప్తులు చేసుకుంటామని హెచ్చరిస్తున్నాయి. నోటీసు అందుకున్న 15 రోజుల్లో బ్యాంకు బకాయి చెల్లించకుంటే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని స్పష్టంచేస్తున్నాయి. పలు చోట్ల రైతులు తాకట్టు పెట్టిన నగలు వేలం వేస్తున్నారు కూడా. కొన్ని ప్రాంతాల్లో అయితే రుణ బకాయిలు చెల్లించాలంటూ బ్యాంకుల సిబ్బంది రైతులకు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తెస్తున్నారు. ‘అసలు రుణమాఫీ అయ్యేది కాదు.. రీషెడ్యూలు చేసినా మీకే భారం పెరుగుతుంది. వడ్డీ పెరుగుతుంది. చక్ర వడ్డీ పడుతుంది. ఇప్పుడు చెల్లిస్తేనే మంచిది. కొత్త రుణాలు వస్తాయి. లేదంటే కొత్త అప్పులూ పుట్టవు’ అని చెప్పేస్తున్నారు. దీంతో.. రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా.. బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదని బ్యాంకర్లు తేల్చి చెప్తున్నారు. రుణాలు రికవరీ కాకపోవడంతో పంట రుణాల పంపిణీని బ్యాంకులు పూర్తిగా పక్కన పెట్టాయి. సమస్యల సుడిగుండంలో... అప్పులు కట్టే మార్గం లేదు.. అప్పులు పుట్టకపోతే మళ్లీ సాగు చేసేదెలాగో తెలీదు! ప్రభుత్వ ఇచ్చిన హామీల మేరకు రుణాలన్నీ మాఫీ అవుతాయని.. మళ్లీ కొంత అప్పుచేసి సాగు చేసుకోవచ్చని గంపెడాశతో ఎదురు చూస్తున్న అన్నదాతలపై పిడుగులు పడ్డట్లే అవుతోంది. ఖరీఫ్ సీజన్లో అదును దాటిపోతుండటంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. వంద రూపాయలకు మూడు రూపాయలు, ఐదు రూపాయలు వడ్డీ చొప్పున అప్పులు చేస్తూ పాత బకాయిలపై వడ్డీలు కడుతున్నారు. వ్యవసాయం చేయకపోతే బతుకే లేని పరిస్థితుల్లో ప్రయివేటు అప్పులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. పైగా.. ఈ ఏడాది ఖరీఫ్ ఆరంభంలోనే తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఇక అప్పులు చేసి సాగు చేసినా పంటల పరిస్థితి ఏమిటన్న భయాందోళనలు రైతులను పీడిస్తున్నాయి. బ్యాంకుల అప్పులు మాఫీ కాక, బ్యాంకుల నుంచి కొత్త రుణాలు రాక.. పాత బాకీలు తీర్చటానికి, మళ్లీ సాగుచేయటానికి భారీ వడ్డీలకు ప్రైవేటు అప్పులు చేస్తూ... ఇలా ఎటు చూసినా రైతన్న మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. వెరసి ఆంధ్రప్రదేశ్ మళ్లీ వ్యవసాయ సంక్షోభం దిశగా పయనిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రుణమాఫీపై సర్కారు పిల్లిమొగ్గలు, బ్యాంకుల నోటీసులు, కొత్త అప్పుల బాధలతో చాలామంది రైతుల నోట ఆత్మహత్యల మాటలు వినిపిస్తుండటం పెను ప్రమాద ఘంటికలను మోగిస్తోందని.. ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకుని అన్నదాతను ఆదుకోకపోతే పది పదిహేనేళ్ల కిందటి పరిస్థితులు పునరావృతమవుతాయని హెచ్చరిస్తున్నారు. బ్యాంకర్లు, అధికారులు ముందే వివరాలిచ్చినా... నిజానికి కోటయ్య కమిటీ ఏర్పాటుకు ముందే, అంటే బాబు సీఎంగా ప్రమాణం చేయడానికి ముందే ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో రైతులకు ఎంత మేరకు రుణాలు ఇచ్చామన్న విషయాన్ని బ్యాంకర్లు, అధికారులు ఆయనకు నివేదికలు అందించారు. పంట రుణాలెన్ని, బంగారం కుదవపెట్టి వ్యవసాయానికి తీసుకున్న రుణాలెన్ని వంటి వివరాలన్నింటినీ కేటగిరీలవారీగా అందజేశారు. అయినా బాబు మాత్రం వాటి సంగతిని పక్కన పెట్టి కోటయ్య కమిటీ వేశారు. అదేమో తన పని ప్రారంభిస్తూనే రుణాలు తీసుకున్న రైతుల సంఖ్యను, తద్వారా రుణాల మొత్తాన్ని కుదించడంపైనే దృష్టి సారించింది! -
మాఫీ ఎలాగో తేల్చని బాబు
* రుణాల మాఫీపై నెలాఖరు వరకు ఆగాలని బ్యాంకర్లకు సూచన * కోటయ్య కమిటీ, బ్యాంకర్లు, అధికారులతో సమావేశం * ఆర్బీఐ లేఖపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రుణాల మాఫీ ఎలా చేస్తారో ముఖ్యమంత్రి చంద్రబాబు తేల్చలేదు. రుణాల మాఫీకి విధివిధానాలపై వారం రోజులుగా కసరత్తు చేస్తున్న కోటయ్య కమిటీతో పాటు ముగ్గురు మంత్రులు, బ్యాంకర్ల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం సమావేశమయ్యారు. అయినప్పటికీ రుణ మాఫీ ఎలాగో బాబు తేల్చలేదు. పైగా మాఫీపై స్పష్టత కోసం ఈ నెలాఖరు వరకు వేచి చూడాలని బ్యాంకర్లకు చెప్పారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కోటయ్య కమిటీలోని తొమ్మిది మంది సభ్యులు, ఆర్థిక, వ్యవసాయ, సహకార శాఖల మంత్రులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రైతుల రుణాల మాఫీపై ఆర్బీఐ రాసిన లేఖలోని అంశాలు, బంగారం రుణాలపై వేలం పాటలకు బ్యాంకులు ఇస్తున్న నోటీసులు తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఏ పరిస్థితుల్లో రుణాల మాఫీకి హామీ ఇచ్చామో వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఆర్బీఐ గవర్నర్‌కు వేర్వేరుగా లేఖలు రాయాలని నిర్ణయించారు. రైతులను ఆదుకోవడానికే రుణాలు మాఫీ చేయాలని నిర్ణయించినట్లు వివరించాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. వీటిపై ఈ నెల 25, 26 తేదీల్లో ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రితో, ఆర్బీఐ గవర్నర్‌తో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. బ్యాంకుల ప్రతినిధులు మాత్రం సమావేశంలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నెలాఖరు వరకు రుణ మాఫీ ఎలాగో తేల్చకపోతే రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటనను వస్తుందని, అంతేకాకుండా రుణాలు మొత్తం నిరర్ధక ఆస్తులుగా మారతాయని వారు చెప్పారు. ఖరీఫ్‌లో రైతులకు మళ్లీ రుణాలు ఇవ్వాలంటే తొలుత రుణాలను చెల్లించాలని, ఆ తరువాత మాఫీ వర్తింపజేస్తామని ప్రభుత్వం తరఫున రైతులకు సందేశమివ్వాలని కూడా బ్యాంకుల ప్రతినిధులు సూచిం చారు. దీనిపై చూద్దాం అంటూ చంద్రబాబు సమాధానాన్ని దాటవేశారు. వీలైనంత ఎక్కువ మంది రైతులకు రుణ మాఫీ ని వర్తింపజేయాలని అనుకుంటున్నామని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, కేంద్రాన్ని, ఆర్బీఐని ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని బాబు చెప్పినట్లు తెలిసింది. -
ఏ ఆంక్షలు పెడితే ఎంత భారం తగ్గుతుంది?
ఏపీలో పంట రుణాల మాఫీపై కోటయ్య కమిటీ సమీక్ష సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రుణాల మాఫీ మార్గదర్శకాల ఖరారుకై కోట య్య అధ్యక్షతన ఏర్పాటైన కమిటీ కసరత్తు ముమ్మరం చేసింది. ఎటువంటి ఆంక్షలు, పరి మితులు పెడితే రుణ మాఫీ భారం తగ్గుతుందనే తరహాలో కమిటీ కసరత్తు చేస్తోంది. వ్యవసాయ రుణాలెంతో గణాంకాలు సిద్ధంగా ఉన్నప్పటికీ కోటయ్య కమిటీ ఇంకా గణాంకాలు కావాలంటూ బ్యాంకర్లకు సూచిస్తోంది. సోమవారం కమిటీ బ్యాంకర్లు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో సుమారు నాలుగు గంటలకు పైగా సమావేశమైంది. అయినా ఎటువంటి అభిప్రాయానికి రాలేదు. చిన్న, సన్న కారు రైతులు ఎంత మంది ఉన్నారు? వారు తీసుకున్న రుణాలెంత? చిన్న, సన్న కారు రైతులంటే ఎంత మేర పొలం ఉండాలి? చిన్న రైతులంటే రెండున్నర ఎకరాలు, సన్న రైతులంటే ఐదు ఎకరాలు అనే లెక్కలు తీయాలని అధికారులకు కమిటీ సూచించింది. లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలెంత? లక్షన్నర రూపాయల వరకు ఉన్న రుణాలెంత? బంగారం రుణాలు ఎంత? అందులో వ్యవసాయానికి తీసుకున్న బంగారం రుణాలెంత? మహిళల పేరుమీద ఉన్న రుణాలెంత? అనే వివరాలను బ్యాంకర్లను కమిటీ కోరుతోంది. పెద్ద రైతులు ఎంత మంది ఉన్నారు? వారు తీసుకున్న రుణాలెంత? అందులో వారికి ఎంతమేర రుణాలు మాఫీ చేయవచ్చు అనే అంశాల ఆధారంగా కమిటీ చర్చించింది. ప్రాధమికంగా చిన్న, సన్నకారు రైతులంటే ఎవరు అనే నిర్ధారణకు మాత్రం వచ్చినట్లు తెలిసింది. కమిటీ తిరిగి మంగళవారం కూడా సమావేశమై చర్చించనుంది. -
చెరకు రైతుల డబ్బు బకాయి కింద జమ
* రూ. 218 కోట్లు బదలాయించుకున్న బ్యాంకులు * కృష్ణాలో లబోదిబోమంటున్న రైతులు సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లాలో చెరకు రైతులకు రుణమాఫీ హుళక్కైంది. బ్యాంకర్లు పంట రుణ బాకీలను వసూలు చేసేసుకున్నారు. జిల్లాలో హనుమాన్ షుగర్స్, ఉయ్యూరు కేసీపీ, లక్ష్మీపురం చక్కెర కర్మాగారాలు 2013-14 సీజన్‌కు సంబంధించిన పంట డబ్బును రైతులకు విడుదల చేశాయి. యాజమాన్యాల నుంచి మూడురోజుల క్రితం రైతుల ఖాతాల్లో పడిన పంట డబ్బును బ్యాంకు అధికారులు పంట రుణం కింద జమ చేసేసుకున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూస్తున్న రైతాంగం ఈ పరిణామంతో నివ్వెరపోరుుంది. ప్రభుత్వం రుణమాఫీపై నాన్చడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు అధికారులు కూడా రుణమాఫీకి సంబంధించి తమకు ఎటువంటి ఉత్తర్వులు రాకపోవటం వల్లే రైతుల రుణ ఖాతాలకు షుగర్ ఫ్యాక్టరీల నుంచి వచ్చిన డబ్బును తాము జమ చేసుకున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని 23,500 మంది చెరకు రైతుల రుణాలకు సంబంధించిన మొత్తం రూ.218 కోట్లను బ్యాంకు అధికారులు ఈ విధంగా జమ చేసేసుకున్నారు. బ్యాంకర్లు రైతులతో ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం, నిబంధనల మేరకే తమకు రావలసిన బకాయిలను జమ చేసుకోవడంతో.. రైతులు కూడా దీనిపై ఏమీ అనలేని పరిస్థితి నెలకొంది. రుణమాఫీపై ప్రభుత్వం సత్వరమే నిర్ణయం తీసుకుని ఉంటే ఈ పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని రైతులు వాపోతున్నారు. -
నివేదిక అందిన వెంటనే ‘రుణమాఫీ’: చంద్రబాబు
తొలి కేబినెట్ వివరాలు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కమిటీ ఈ నెల 22లోగా ప్రాథమిక నివేదిక ఇస్తుందని, ఆ తరువాత 45 రోజుల్లో తుది నివేదిక వచ్చాక కేంద్రంతో మాట్లాడి మాఫీకి చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం గురువారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఉదయం 11.45 గంటలకు మొదలై రాత్రి 6.45 గంటల వరకు సాగింది. సమావేశం అనంతరం చంద్రబాబు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చించామని, ఇందులో తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేసిన అంశాలు ముఖ్యమైనవని చెప్పారు. రైతులు, చేనేత, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రుణాలు చెల్లించాలని రైతులకు బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు పాతవని చెప్పారు. ఈ విషయంలో అందరితో సంప్రదించాల్సిందిగా మంత్రులకు చెప్పానన్నారు. చంద్రబాబు చెప్పిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రం రూ.15,900 కోట్ల లోటుతో ఉంది. దాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అనువుగా ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను ఉపయోగించుకుంటాం. గ్రామాలు, పట్టణాలను వాటికి అనుసంధానించి ఎక్కడికక్కడ వాటర్ ప్లాంట్లు నిర్మిస్తాం. రెండు రూపాయలకు 20 లీటర్ల నీటిని అందచేస్తాం. దీని అమలుకు పంచాయతీరాజ్, పురపాలక, నీటిపారుదల శాఖల మంత్రులతో కమిటీ నియమించాం. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద తమకు వచ్చే ఆదాయంలో రెండు శాతం ఖర్చు పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్వహణ బాధ్యత వారికి అప్పగిస్తాం. బాధ్యత తీసుకున్న కంపెనీలకు రాయితీలిస్తాం. కరువు నివారణతోపాటు భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడుగుంతలు, కాంటూర్లు, చెక్ డ్యాంల నిర్మాణం చేపడతాం. బెల్ట్ షాపుల రద్దుకు ఉత్తర్వులు జారీ చేశాం. దీన్ని కఠినంగా అమలు చేసేందుకు అబ్కారీ చట్టంలో మార్పులు తెస్తాం. ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం. బెల్టుషాపుల ద్వారా మద్యం దుకాణాల వారే అమ్మకాలు చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తమిళనాడు, కేరళల్లో ఎక్సైజ్ విధానాన్ని అధ్యయనం చేస్తాం. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అక్టోబర్ 2 నుంచి ఇస్తాం. వికలాంగులకు రెండు శ్లాబుల్లో పంపిణీ చేస్తాం. 40 నుంచి 79 శాతం వెకల్యం ఉన్నవారికి రూ. వెయ్యి, 80 శాతం, ఆపైన ఉన్నవారికి రూ.1,500 అందిస్తాం. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు తక్షణం అమల్లోకి వస్తుంది. జోనల్ స్థాయిలో దీని అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. యథావిధిగా అమలవుతుంది. డెరైక్టరేట్, సచివాలయంలోనే దీనికి కొంత సమస్య ఉంది. అక్కడ ఉద్యోగుల పంపిణీ కొంత జరిగినా, ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా వారికే సమస్య వస్తుంది. అయితే వారికి కూడా ఇబ్బంది లేకుండా తక్షణమే ఈ నిబంధన అమలు చేయాలని నిర్ణయించాం. వారికి సర్వీస్‌లో ఎలాంటి బ్రేక్ ఉండదు. కొందరు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించా రు. ఆ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంచితే వారికి సమస్య ఉండదు. ఉద్యోగ విరమణ వయసు పెంచినందువల్ల నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుంది. విశాఖపట్నంలో ఎల్ఎన్జీ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. ఇది వెంటనే చేపడితే రెండు, మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. దీని ద్వారా వ్యాట్ రూపంలో మూడు వేల కోట్ల ఆదాయం వస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 700 కోట్లు పెరుగుతుంది. ఎల్ఎన్జీ ప్రాజెక్టు వల్ల గ్యాస్ ఆధారిత సిరామిక్, ఫెర్రో ఎల్లాయిస్ తదితర పరిశ్రమలు వస్తాయి. ఎల్ఎన్జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలిపాం. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేశాయో అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తున్నాం. పెట్రో కారిడార్ కూడా వస్తుంది. రాష్ట్రానికి 13, 14 నౌకాశ్రయాలు కూడా వస్తాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టు విశాఖకు వస్తుంది. ప్రస్తుతం కరెంటు ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు అనుసరించిన విధానాన్ని తిరిగి అవలంబిస్తాం. సపరేట్ లోడ్ డిస్టెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక చట్టం కూడా రూపొందిస్తాం. ఎక్కడికక్కడ బొగ్గు నిల్వలు ఉండేలా చూస్తాం. 24 గంటల్లో పాడైన, కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటలు కరెంటు అందిస్తాం. రైతులకు 7 గంటల కరెంటిస్తాం. కొద్ది రోజుల తర్వాత 9 గంటలిస్తాం. సౌర, గాలిమరల విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలు పరిశీలిస్తున్నాం. వీటన్నింటివల్ల విద్యుత్‌లో మిగులు సాధిస్తాం. - గతంలో ప్రకటించిన విధంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి, నీటిపారుదల, వ్యవసాయం, విద్యుత్, ఆర్థిక వనరులు గత పది సంవత్సరాల్లో ఎలా దెబ్బతిన్నాయో శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. విభజనవల్ల నెలకొన్న పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా ఒక పత్రాన్ని విడుదల చేస్తాం. కేంద్రం నుంచి మనకు సాయం కావాలి. బుందేల్‌ఖండ్ తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్యాకేజీ ఎలా ఇస్తారో చెప్పాలి. - విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా తయారు చేస్తాం. 14 నగరపాలక సంస్థలను స్మార్ట్ సిటీలుగా తయారు చేస్తాం. - కొత్త రాజధాని అన్ని వసతులతో పూర్తి కావాలంటే 20 సంవ త్సరాలు పడుతుంది. నాలుగైదు లక్షల కోట్లు కోవాలి. రాత్రికి రాత్రి రాజధాని రాదు. ఒక ఐఐటీ నిర్మాణం, ఐఐఎం నిర్మాణం జరిగితే రాజధాని పూర్తయినట్లు కాదు. మనకు ఉన్న సహజ వనరుల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి. - ధరల నియంత్రణ కీలక సమస్య. దీనికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రైతు బజార్లను బలోపేతం చేస్తాం. ధరల నియంత్రణ ఎలా చేయాలో అధ్యయనానికి ఒక కమిటీ వేస్తాం. ధరలు పెరిగినపుడు వాటిని నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తాం. - రాష్ట్రంలో అవినీతికి కారణమైన గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ దుర్వినియోగమయ్యాయో పరిశీలిస్తాం. కొందరు ప్రభుత్వ భూములను దోచుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా త రలిస్తున్నారు. వీటన్నింటిని ప్రక్షాళన చేస్తాం. అవినీతి నిర్మూలనకు కేంద్రం తీసుకునే చర్యలకు అనుగుణంగా మేం కూడా వ్యవహరిస్తాం. - కొత్త రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం అందించాలి. ఏపీ న్యూ క్యాపిటల్ డెవలప్మెంట్ ఫండ్ / సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపాలి. - రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తాం. - విశాఖలో విమ్స్ నిర్మాణానికి రూ. 60 కోట్లు విడుదల చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో దీన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చే స్తాం. విశాఖను వాణిజ్య, ఐటీ, ఫైనాన్షియల్, టూరిజం హ బ్గా తయారు చేస్తాం. చిత్ర పరిశ్రమ కేంద్రంగా తయారవుతుంది. రైల్వేజోన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనే రాజధాని.. రాజధాని నగరం ఎక్కడ వస్తుందని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబును మంత్రులు అడిగారు. గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు అవుతుందని బాబు స్పష్టంచేశారు. అది ఇరు ప్రాంతాలకు మధ్యలో ఉండడంతోపాటు రాజధానిగా త్వరితంగా అభివృద్ధి పరిచేందుకు అనువైనదని బాబు వివరించారు. భూసేకరణ ఇబ్బందైతే ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తామని, అది కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే తప్ప వేరే ప్రాంతంలో ఉండదని తెలిపారు. -
బంగారు తెలంగాణే లక్ష్యం
► అసెంబ్లీలో గవర్నర్ నరసింహన్ ప్రకటన ►అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. ప్రతి పౌరునికీ సమాన హోదా, రక్షణ ►బలిదానాలను మరవం, అమరుల కుటుంబాలకు సర్కారు అండ ►రూ. పది లక్షల చొప్పున ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ►లక్షలోపు పంట రుణాలు మాఫీ.. వెనుకబడినవర్గాల సంక్షేమానికి పెద్దపీట ►కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య.. వికలాంగులకు రూ. 1,500, ►వృద్ధులు, అనాథ మహిళలు, బీడీ కార్మికులకు వెయ్యి పింఛను ►జర్నలిస్టులకు రూ. 10 కోట్లు, న్యాయవాదులకు 100 కోట్లతో సంక్షేమ నిధి ►ఉభయసభలను ఉద్దేశించి నరసింహన్ ప్రసంగం సాక్షి, హైదరాబాద్: ‘సర్వ జన హితాయ - సర్వ జన సుఖాయ’.. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం-ఆశయం అని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రకటించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా.. అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరునికీ సమాన హోదా, రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కొత్త రాష్ర్టంలో సరికొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి బుధవారం గవర్నర్ తొలిసారి ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుల బలిదానాలను ప్రభుత్వం మరచిపోదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 15 ఏళ్లుగా సాగిన సుదీర్ఘ ఉద్యమంలో యువత కీలకపాత్ర పోషించిన విషయాన్ని గవర్నర్ గుర్తుచేశారు. సొంత రాష్ర్టం, స్వయం పాలనతోనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న నమ్మకమే వారికి ప్రేరణగా నిలిచిందన్నారు. అమరుల బలిదానాలు విలువ కట్టలేమన్నారు. వారి కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయంతోపాటు ప్రతి కుటుంబంలోని ఒకరికి అర్హతను బట్టి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ‘ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఇతర వర్గాల పేదల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతాం. ప్రతీ రైతుకు లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తాం. వ్యవసాయ ట్రాక్టర్లు, ట్రాలీలకు పన్ను మినహాయింపులిస్తాం. వికలాంగులకు రూ. 1,500, వృద్ధులు, అనాథ మహిళలు, బీడీ కార్మికులకు రూ. 1,000 పింఛను అందజేస్తాం’ అని నరసింహన్ పేర్కొన్నారు. హైదరాబాద్-వరంగల్ మధ్య పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. పరిశ్రమలకు సింగిల్ విండో ద్వారా అన్ని అనుమతులు ఇస్తామని, రాబోయే ప్రాజెక్టులకు అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘ప్రత్యేక చేజింగ్ విభాగాన్ని’ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరాల సరసన నిలబెడతామని, మెల్బోర్న్, వియన్నా, వాంకోవర్, టొరెంటోలకు దీటుగా ఉత్తమ నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. పేద విద్యార్థులందరికీ కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లిష్ మాధ్యమంలో సీబీఎస్ఈ సిలబస్‌తో ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని తెలిపారు. ‘ప్రవాస భారతీయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తాం. ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల్లో శాశ్వత కార్యాలయాల నిర్మాణం చేపడతా’మని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు ఐదేళ్లలో ఎస్సీల సంక్షేమానికి రూ. 50 వేల కోట్లు ఎస్టీలకు విద్య, ఉద్యోగాల్లో 12 శాతం రిజర్వేషన్లు. కైతీ లంబాడీలకు, వాల్మీకి బోయలకు ఎస్టీ హోదా. మైదానప్రాంత గిరిజనుల కోసం ఐటీడీఏలు పంచాయుతీలుగా లంబాడ తండాలు, ఆదివాసీ గూడేలు రూ. 25 వేల కోట్లతో బీసీల సమగ్రాభివృద్ధి మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్. ఏటా రూ. 1000 కోట్ల బడ్జెట్ ఆటో రిక్షాలకు పన్ను మినహాయింపు, ప్రమాద బీమా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంటు, హెల్త్ కార్డులు జర్నలిస్టులకు రూ. 10 కోట్లతో.. న్యాయవాదులకు రూ. 100 కోట్లతో సంక్షేమ నిధి జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవసాయ, ఉద్యానవన విశ్వవిద్యాలయం ఏర్పాటు - నిజామాబాద్‌లో చెరకు, మోతెలో పసుపు పరిశోధన కేంద్రాలు - ప్రతీ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి - గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ పునరుద్ధరణ - పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం - జూరాల-పాకాల సాగునీటి వ్యవస్థ కోసం సర్వే - మూడేళ్లలో 6 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి - ఛత్తీస్‌ఘడ్ నుంచి విద్యుత్ కొనుగోలు -
రుణాలపై హామీలు అలా.. నోటీసులు ఇలా!
* రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటూ రైతులపై బ్యాంకుల ఒత్తిడి * బంగారం వేలం వేస్తామని ప్రకటనలు సాక్షి, అనంతపురం: చంద్రబాబు వచ్చారు... పంట రుణా లు మాఫీ చేస్తారని అన్నదాతలు ఎదురు చూస్తుంటే బ్యాంకర్లు మాత్రం రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏకంగా బ్యాంకుల వద్ద బోర్డులే పెడుతున్నారు. రుణాలు చెల్లించకపోతే బంగా రం వేలం వేస్తామంటూ నోటీసులిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు కదా... మరీ నోటీస్ బోర్డులేమిటని రైతులు అడిగితే బ్యాంకు అధికారులనుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. రెన్యూవల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించకపోతే ఎలా? అని అడిగినా సమాధానంలేదు. మరోవైపు రుణాలు చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని కొత్తచెరువు మండలం లోచర్లకు చెందిన రైతు శంకర్‌రెడ్డికి నోటీసు జారీ చేశారు. శంకరరెడ్డికి ఎనిమిదెకరాల పొలముంది. కొత్తచెరువు ప్రాథమిక సహకార పరపతి సంఘంలో భార్య నగలు తాకట్టు పెట్టి 2012 ఆగస్టు 8వ తేదీన రూ.46 వేలు రుణం తీసుకున్నాడు. బోరు బావి తవ్వించాడు.. కానీ నీరు పడకపోవడంతో శంకరరెడ్డి మరింత అప్పుల పాలయ్యాడు. రుణాన్ని తక్షణమే చెల్లించాలని.. లేదంటే వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదొక్క శంకర్‌రెడ్డికే కాదు.. లక్షలాది మంది రైతులకు ఎదురవుతోన్న అనుభవం. బాబు వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తారని భావించిన రైతులు బ్యాంకులు జారీ చేస్తున్న నోటీసులతో నిర్ఘాంతపోతున్నారు. -
హామీలను నెరవేర్చే వరకు పోరాడుతాం
* వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు * టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శ బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పార్టీ పోరాటం చేస్తుందని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. ప్రజల సమస్యల తరఫున పోరాడుతూ వారికి అండగా నిలుస్తామని చెప్పారు. సోమవారం దుద్దుకూరులోని ఆయన స్వగృహంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తూ టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని బాలరాజు ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ప్రజాప్రతినిధులను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని, చేనేత రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుందని పాతవి మాఫీ చే స్తే రైతులు కొత్త రుణాలు తీసుకోవటానికి ఎదురు చూస్తున్నారన్నారు. కోటేశ్వరరావు, కుశంపూడి శేషు, సాకా కిషంజర్, మాడిశెట్టి నరశింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.