నివేదిక అందిన వెంటనే ‘రుణమాఫీ’: చంద్రబాబు
తొలి కేబినెట్ వివరాలు వెల్లడించిన ఏపీ సీఎం చంద్రబాబు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక అందించిన వెంటనే రైతుల రుణ మాఫీకి చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. కమిటీ ఈ నెల 22లోగా ప్రాథమిక నివేదిక ఇస్తుందని, ఆ తరువాత 45 రోజుల్లో తుది నివేదిక వచ్చాక కేంద్రంతో మాట్లాడి మాఫీకి చర్యలు తీసుకుంటామని తెలిపా రు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ తొలి సమావేశం గురువారం విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్‌లో ఉదయం 11.45 గంటలకు మొదలై రాత్రి 6.45 గంటల వరకు సాగింది. సమావేశం అనంతరం చంద్రబాబు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ప్రధానంగా ఎనిమిది అంశాలపై చర్చించామని, ఇందులో తాను ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేసిన అంశాలు ముఖ్యమైనవని చెప్పారు. రైతులు, చేనేత, డ్వాక్రా రుణాలు మాఫీ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రుణాలు చెల్లించాలని రైతులకు బ్యాంకుల నుంచి అందుతున్న నోటీసులు పాతవని చెప్పారు. ఈ విషయంలో అందరితో సంప్రదించాల్సిందిగా మంత్రులకు చెప్పానన్నారు. చంద్రబాబు చెప్పిన ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రం రూ.15,900 కోట్ల లోటుతో ఉంది. దాన్ని భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
గ్రామాల్లో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు అనువుగా ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం కింద జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టులను ఉపయోగించుకుంటాం. గ్రామాలు, పట్టణాలను వాటికి అనుసంధానించి ఎక్కడికక్కడ వాటర్ ప్లాంట్లు నిర్మిస్తాం. రెండు రూపాయలకు 20 లీటర్ల నీటిని అందచేస్తాం. దీని అమలుకు పంచాయతీరాజ్, పురపాలక, నీటిపారుదల శాఖల మంత్రులతో కమిటీ నియమించాం. కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యత కింద తమకు వచ్చే ఆదాయంలో రెండు శాతం ఖర్చు పెట్టాలి. కొన్ని ప్రాంతాల్లో ప్లాంట్ల నిర్వహణ బాధ్యత వారికి అప్పగిస్తాం. బాధ్యత తీసుకున్న కంపెనీలకు రాయితీలిస్తాం. కరువు నివారణతోపాటు భూగర్భ జలమట్టాన్ని పెంచేందుకు ఇంకుడుగుంతలు, కాంటూర్లు, చెక్ డ్యాంల నిర్మాణం చేపడతాం.
బెల్ట్ షాపుల రద్దుకు ఉత్తర్వులు జారీ చేశాం. దీన్ని కఠినంగా అమలు చేసేందుకు అబ్కారీ చట్టంలో మార్పులు తెస్తాం. ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తాం. బెల్టుషాపుల ద్వారా మద్యం దుకాణాల వారే అమ్మకాలు చేస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. తమిళనాడు, కేరళల్లో ఎక్సైజ్ విధానాన్ని అధ్యయనం చేస్తాం.
వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు అక్టోబర్ 2 నుంచి ఇస్తాం. వికలాంగులకు రెండు శ్లాబుల్లో పంపిణీ చేస్తాం. 40 నుంచి 79 శాతం వెకల్యం ఉన్నవారికి రూ. వెయ్యి, 80 శాతం, ఆపైన ఉన్నవారికి రూ.1,500 అందిస్తాం.
ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు తక్షణం అమల్లోకి వస్తుంది. జోనల్ స్థాయిలో దీని అమలుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. యథావిధిగా అమలవుతుంది. డెరైక్టరేట్, సచివాలయంలోనే దీనికి కొంత సమస్య ఉంది. అక్కడ ఉద్యోగుల పంపిణీ కొంత జరిగినా, ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. తెలంగాణకు కేటాయించిన ఆంధ్రా వారికే సమస్య వస్తుంది. అయితే వారికి కూడా ఇబ్బంది లేకుండా తక్షణమే ఈ నిబంధన అమలు చేయాలని నిర్ణయించాం. వారికి సర్వీస్‌లో ఎలాంటి బ్రేక్ ఉండదు. కొందరు తెలంగాణ ఉద్యోగులను ఆంధ్రాకు కేటాయించా రు. ఆ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసు పెంచితే వారికి సమస్య ఉండదు. ఉద్యోగ విరమణ వయసు పెంచినందువల్ల నిరుద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు మార్గాలను అన్వేషిస్తుంది. విశాఖపట్నంలో ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టు పెండింగ్‌లో ఉంది. ఇది వెంటనే చేపడితే రెండు, మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. దీని ద్వారా వ్యాట్ రూపంలో మూడు వేల కోట్ల ఆదాయం వస్తుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రస్తుతం జరుగుతున్న ఉత్పత్తిని రెట్టింపు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 700 కోట్లు పెరుగుతుంది. ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టు వల్ల గ్యాస్ ఆధారిత సిరామిక్, ఫెర్రో ఎల్లాయిస్ తదితర పరిశ్రమలు వస్తాయి. ఎల్‌ఎన్‌జీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఇప్పటికే ఆమోదం తెలిపాం. ఇతర రాష్ట్రాలు ఎలా అమలు చేశాయో అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తున్నాం. పెట్రో కారిడార్ కూడా వస్తుంది. రాష్ట్రానికి 13, 14 నౌకాశ్రయాలు కూడా వస్తాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టు విశాఖకు వస్తుంది.
ప్రస్తుతం కరెంటు ఎపుడు వస్తుందో ఎపుడు పోతుందో తెలియదు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు అనుసరించిన విధానాన్ని తిరిగి అవలంబిస్తాం. సపరేట్ లోడ్ డిస్టెన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక చట్టం కూడా రూపొందిస్తాం. ఎక్కడికక్కడ బొగ్గు నిల్వలు ఉండేలా చూస్తాం. 24 గంటల్లో పాడైన, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. ఇళ్లు, పరిశ్రమలకు 24 గంటలు కరెంటు అందిస్తాం. రైతులకు 7 గంటల కరెంటిస్తాం. కొద్ది రోజుల తర్వాత 9 గంటలిస్తాం. సౌర, గాలిమరల విద్యుత్ ఉత్పత్తికి గల అవకాశాలు పరిశీలిస్తున్నాం. వీటన్నింటివల్ల విద్యుత్‌లో మిగులు సాధిస్తాం.
- గతంలో ప్రకటించిన విధంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, ఉపాధి, నీటిపారుదల, వ్యవసాయం, విద్యుత్, ఆర్థిక వనరులు గత పది సంవత్సరాల్లో ఎలా దెబ్బతిన్నాయో శ్వేతపత్రాలు విడుదల చేస్తాం. విభజనవల్ల నెలకొన్న పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా ఒక పత్రాన్ని విడుదల చేస్తాం. కేంద్రం నుంచి మనకు సాయం కావాలి. బుందేల్‌ఖండ్ తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్యాకేజీ ఎలా ఇస్తారో చెప్పాలి.
- విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా తయారు చేస్తాం. 14 నగరపాలక సంస్థలను స్మార్ట్ సిటీలుగా తయారు చేస్తాం.
- కొత్త రాజధాని అన్ని వసతులతో పూర్తి కావాలంటే 20 సంవ త్సరాలు పడుతుంది. నాలుగైదు లక్షల కోట్లు కోవాలి. రాత్రికి రాత్రి రాజధాని రాదు. ఒక ఐఐటీ నిర్మాణం, ఐఐఎం నిర్మాణం జరిగితే రాజధాని పూర్తయినట్లు కాదు. మనకు ఉన్న సహజ వనరుల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి.
- ధరల నియంత్రణ కీలక సమస్య. దీనికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. రైతు బజార్లను బలోపేతం చేస్తాం. ధరల నియంత్రణ ఎలా చేయాలో అధ్యయనానికి ఒక కమిటీ వేస్తాం. ధరలు పెరిగినపుడు వాటిని నియంత్రించేందుకు ప్రత్యేకంగా ఒక నిధిని ఏర్పాటు చేస్తాం.
- రాష్ట్రంలో అవినీతికి కారణమైన గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆస్తులు ఎక్కడ దుర్వినియోగమయ్యాయో పరిశీలిస్తాం. కొందరు ప్రభుత్వ భూములను దోచుకున్నారు. ఎర్రచందనాన్ని అక్రమంగా త రలిస్తున్నారు. వీటన్నింటిని ప్రక్షాళన చేస్తాం. అవినీతి నిర్మూలనకు కేంద్రం తీసుకునే చర్యలకు అనుగుణంగా మేం కూడా వ్యవహరిస్తాం.
- కొత్త రాజధాని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సాయం అందించాలి. ఏపీ న్యూ క్యాపిటల్ డెవలప్‌మెంట్ ఫండ్ / సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళాలు పంపాలి.
- రాష్ట్రంలోని సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, కనకదుర్గ, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీశైలం దేవస్థానాల్లో నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేస్తాం.
- విశాఖలో విమ్స్ నిర్మాణానికి రూ. 60 కోట్లు విడుదల చేస్తున్నాం. ఉత్తరాంధ్రలో దీన్ని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతాం. మెడికల్ కళాశాల కూడా ఏర్పాటు చే స్తాం. విశాఖను వాణిజ్య, ఐటీ, ఫైనాన్షియల్, టూరిజం హ బ్‌గా తయారు చేస్తాం. చిత్ర పరిశ్రమ కేంద్రంగా తయారవుతుంది. రైల్వేజోన్ వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.
విజయవాడ, గుంటూరు పరిసరాల్లోనే రాజధాని..
రాజధాని నగరం ఎక్కడ వస్తుందని మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబును మంత్రులు అడిగారు. గుంటూరు, విజయవాడ పరిసరాల్లోనే రాజధాని ఏర్పాటు అవుతుందని బాబు స్పష్టంచేశారు. అది ఇరు ప్రాంతాలకు మధ్యలో ఉండడంతోపాటు రాజధానిగా త్వరితంగా అభివృద్ధి పరిచేందుకు అనువైనదని బాబు వివరించారు. భూసేకరణ ఇబ్బందైతే ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తామని, అది కూడా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే తప్ప వేరే ప్రాంతంలో ఉండదని తెలిపారు.