రుణాలపై హామీలు అలా.. నోటీసులు ఇలా!
* రుణాలు రెన్యూవల్ చేసుకోవాలంటూ రైతులపై బ్యాంకుల ఒత్తిడి
* బంగారం వేలం వేస్తామని ప్రకటనలు
సాక్షి, అనంతపురం: చంద్రబాబు వచ్చారు... పంట రుణా లు మాఫీ చేస్తారని అన్నదాతలు ఎదురు చూస్తుంటే బ్యాంకర్లు మాత్రం రుణాలు రెన్యూవల్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏకంగా బ్యాంకుల వద్ద బోర్డులే పెడుతున్నారు. రుణాలు చెల్లించకపోతే బంగా రం వేలం వేస్తామంటూ నోటీసులిస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్లూరులోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద ‘పంట రుణాలు రెన్యూవల్ చేయబడును’ అని నోటీస్ బోర్డులో అతికించారు. రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారు కదా... మరీ నోటీస్ బోర్డులేమిటని రైతులు అడిగితే బ్యాంకు అధికారులనుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. రెన్యూవల్ చేసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించకపోతే ఎలా? అని అడిగినా సమాధానంలేదు.
మరోవైపు రుణాలు చెల్లించకపోతే నగలు వేలం వేస్తామని కొత్తచెరువు మండలం లోచర్లకు చెందిన రైతు శంకర్‌రెడ్డికి నోటీసు జారీ చేశారు. శంకరరెడ్డికి ఎనిమిదెకరాల పొలముంది. కొత్తచెరువు ప్రాథమిక సహకార పరపతి సంఘంలో భార్య నగలు తాకట్టు పెట్టి 2012 ఆగస్టు 8వ తేదీన రూ.46 వేలు రుణం తీసుకున్నాడు. బోరు బావి తవ్వించాడు.. కానీ నీరు పడకపోవడంతో శంకరరెడ్డి మరింత అప్పుల పాలయ్యాడు. రుణాన్ని తక్షణమే చెల్లించాలని.. లేదంటే వేలం వేస్తామని బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇదొక్క శంకర్‌రెడ్డికే కాదు.. లక్షలాది మంది రైతులకు ఎదురవుతోన్న అనుభవం. బాబు వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తారని భావించిన రైతులు బ్యాంకులు జారీ చేస్తున్న నోటీసులతో నిర్ఘాంతపోతున్నారు.