
వారే మనకు మిత్రులు
* జాతీయ స్థాయిలో బూర్జువా పార్టీలతో పొత్తులు ఉండవు
* ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు
* ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే పార్టీలతోనే జట్టు కట్టాలని సీపీఎం నాయకత్వం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే రాజకీయపార్టీలనే మిత్రులుగా చూడాలని సీపీఎం నాయకత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో రాజకీయపొత్తులు, కూటమి వంటి వాటికి కూడా ఇదే భూమిక కావాలని తీర్మానించింది. వచ్చే మూడేళ్లలో అనుసరించాల్సిన రాజకీయ విధానాలకు సంబంధించిన తీర్మానాన్ని బుధవారం ఇక్కడ ముగిసిన సీపీఎం కేంద్రకమిటీ సమావేశం ఆమోదించింది. అంతకు ముందు ఈ తీర్మానంపై పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు. దళిత, గిరిజన, మహిళా, మైనారిటీల సమస్యలపై పోరాడే ఇతర వామపక్షాలు, సంఘాలు ప్రగతిశీల శక్తులతో కలసి ముందుకు సాగాలని తీర్మానించింది. జాతీయస్థాయిలో ఇకపై కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో ఎలాంటి పొత్తులు కుదుర్చుకోరాదని, వామపక్ష. ప్రజాతంత్ర కూటమి కోసం కృషిచేయాలని నిర్ణయించింది.
రాష్ర్టస్థాయిల్లో మాత్రం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయపొత్తులు కుదుర్చుకునే అవకాశాన్ని తొలుత కల్పించినా ఇక్కడ కూడా ఉదారవాద ఆర్థికవిధానాలను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలతోనే పొత్తు కుదుర్చుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల సమస్యలపై వివిధరూపాల్లో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆ వర్గాలకు దగ్గర కావాలని నిర్ణయించింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్‌ఎస్ వంటి బూర్జువాపార్టీల నుంచి బయటకు వచ్చి వ్యక్తులు సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన పక్ష ంలో వారితో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. మూడురోజుల పాటు జరిగిన కేంద్రకమిటీ సమావేశాల్లో పలు తీర్మానాలను ఆమోదించారు.
నష్టమే ఎక్కువ జరిగింది!
గత పాతికేళ్లలో అనుసరించిన రాజకీయ విధానాల వల్ల పార్టీకి నష్టమే అధికంగా జరిగిందని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. ఈ విధానాల వల్ల అక్కడక్కడ ప్రయోజనం కలిగి, ఏదోకొంతమేర ప్రజలకు ఉపశమనం లభించినా పార్టీకి రాజకీయంగా నష్టమే జరిగిందని కేంద్ర కమిటీ భావిస్తోంది. చర్చ సందర్భంగా తప్పొప్పులను సమీక్షించింది. ఉదారవాద ఆర్థిక విధానాలను సమర్థించే కాంగ్రెస్ వంటి బూర్జువాపార్టీతో పొత్తు, ఇటువంటి ఇతర పార్టీలతో కలసి ఐక్యకూటమిలో భాగస్వాములు కావడం వల్ల ప్రజల్లో కమ్యూనిస్టుపార్టీల పట్ల నమ్మకం సన్నగిల్లిందనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలతో కలసి పనిచేయాలనే కొత్తవిధానాన్ని ఈ భేటీ ఆమోదించింది. జాతీయస్థాయిలో 7 వామపక్షాలు కలసి పనిచేస్తున్నవిధంగానే, వివిధ రాష్ట్రాల్లో వామపక్ష ఐక్యతకోసం కృషి చేయాలని నిర్ధేశించింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 11 వామపక్షపార్టీలు కలసి సమన్వయంతో ముందుకు సాగడాన్ని కేంద్రకమిటీ అభినందించింది. దీనిని మరింత విస్తృత పరచి ప్రజాసంఘాలు, సంస్థలు, మేధావులతో కలసి వామపక్ష,ప్రజాతంత్ర ఐక్యవేదిక ఏర్పాటు కోసం కృషి చేయాలని తీర్మానించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పనిచేస్తోందని మండిపడింది. సంఘ్‌పరివార్ శక్తుల ప్రభావం పెరగడంపై సీపీఎం ఆందోళన వ్యక్తంచేసింది. జాతీయస్థాయిలో దీనిపై కలిసొచ్చే పార్టీలు, సంఘాలతో కలసి పోరాడాలని నిర్ణయించింది.