తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచిన గడ్డమీద అమరవీరుల ఆశయాలను సాధిస్తాం...
సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచిన గడ్డమీద అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, ఎర్రజెండా వర్ధిల్లాలి, మార్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి అనే నినాదాల మధ్య నాటి పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఎగురవేసి సీపీఎం తెలంగాణ తొలిమహా సభలను ప్రారంభించారు. ఈ పోరాటంలో ఎంతో స్ఫూర్తిని రగిలించి, ఆదర్శంగా నిలిచిన వీరభైరాన్‌పల్లి గాథను గుర్తుకు తెచ్చేలా రూపొందించిన మహాసభల స్వాగతద్వారం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
మహాసభల ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్, పార్టీనాయకులు బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు ఉత్తేజభరితమైన వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆర్టీసీ కల్యాణ మండపంలోని మహాసభల ప్రాంగణంలో తెలంగాణలో జరిగిన వివిధపోరాటాలు, రజాకార్లు, నిజాం పోలీసుల వ్యతిరేక పోరాటం, పేదలు, మహిళలు సాగించిన ఉద్యమాలను ఎత్తిచూపేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. రాష్ర్ట మహాసభల వేదికపై ఒకవైపు పార్టీ చిహ్నం, ఇతరసందేశాలతో‘‘సంక్షేమం, సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి, వామపక్షాల ఐక్యత’’ అనే ఫ్లెక్సీ , మరోవైపు బంజారా మహిళలు, కొమ్ము, బూరా వాయిద్యాలు, నృత్యాలతో ఏర్పాటుచేసిన ఇంకొక ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకున్నాయి.
బూర్జువా ప్రభుత్వమిది: కారత్ ధ్వజం
పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ ఈ మహాసభల ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేరుకే అధికారంలో ఉందని, అసలు నడుస్తున్నది బూర్జువా, కార్పొరేట్, ఆరెస్సెస్, హిందుత్వశక్తుల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కార్పొరేట్ అనుకూల, హిందుత్వభావజాల వ్యాప్తి, మతోన్మాద ఎజెండాను అమలుచేస్తూ ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు. గత 9 నెలల పాలనలో ఇదే సుస్పష్టమైందన్నారు. బీజేపీ అధికారంలో ఉండడంతో హిందుత్వ అనుకూల విధానాలను ప్రజలపై రుద్దడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందన్నారు.
ప్రజల భావప్రకటనాస్వేచ్ఛపై, కళాకారులపై హిందూమతోన్మాద వాదులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. సరళీకరణ విధానాలతోపాటుగా మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా నడుంబిగించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొరుగుదేశం చైనాను దూరంగా పెట్టి, అమెరికాతో మోదీ జతకట్టారని, ఆదేశంతో బంధాన్ని బలోపేతం చేసుకుంటూ సామ్రాజ్యవాదశక్తులకు దాసోహం అవుతున్నారని అన్నారు. పార్లమెంట్‌ను కూడా కాదని భూసంస్కరణలు, ప్రైవేట్ శక్తులను బొగ్గురంగంలోకి దింపేందుకు ఆర్డినెన్స్‌ల ద్వారా సవరణలు తెచ్చే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వ స్వభావాన్ని స్పష్టంచేస్తోందన్నారు.
వామపక్ష, ప్రజాతంత్రశక్తులు ఐక్యసంఘటనగా ఏర్పడాలి...
దేశ, రాష్ట్రస్థాయిల్లో వామపక్షాలు బలపడాలని, దాంతోపాటు ప్రజాతంత్రశక్తులు, అణగారిన వర్గాలు, ప్రజాసంఘాలు బలపడి, విశాలప్రాతిపదికగా ఐక్యసంఘటనగా ఏర్పడడం నేటి అవసరమని కారత్ పిలుపునిచ్చారు. ఈ శక్తులు సంప్రదాయ రాజకీయ, బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడాల్సి ఉందన్నారు. ఈ దిశలో రాష్ట్రమహాసభలు, విశాఖలో జరగనున్న పార్టీ జాతీయమహాసభలు దోహదంచేస్తాయన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణలో 10 వామపక్షాలు కలసి ఉద్యమించడం హర్షణీయమన్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కార్మికులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు, గ్రామీణపేదలను కలుపుకుని ముందుకు పోవాలన్నారు. తెలంగాణలో సాగిన కమ్యూనిస్టు ఉద్యమం ఎంతో ఉత్తేజవంతమైనదని, దాని నుంచి స్ఫూర్తిని పొంది వామపక్ష, ప్రజాతంత్రశక్తులతో ప్రత్యామ్నాయం కోసం కృషిచేయాలని ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు.