communist movement
-
‘విశ్వసనీయత’ ఎలా?
విశ్లేషణ వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యేవారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని కమ్యూనిస్టు పార్టీలు కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు సహా అణగారిన ప్రజలందరి విశ్వాసాన్ని అవి చూరగొనాలి. కమ్యూనిస్టు ఉద్యమం ఎందుకింతగా బలహీన పడిపోయింది? అని ఆవేదన చెందుతున్న కమ్యూనిస్టు శ్రేయోభిలాషులు ఎంతో మంది ఉన్నారు. అదే సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం పునరుజ్జీవితమైతే తప్ప ఏ మాత్ర మైనా శ్రామికులకు మేలు జరగదని ఆశతో ఎదురు చూసే వారూ, అందుకోసం కషి చేస్తున్నవారూ లేకపోలేదు. అంతకుమించి ఆయా పార్టీల కార్యకర్తలు, నాయకులు అందు కోసం తీవ్ర మేధోమధనం జరుపుతున్నారు. ఈ అంశాన్ని పరిశీలించే ముందు మన స్వాతంత్య్రోద్యమ చరిత్రలోని ప్రధాన అంశం గూర్చి ఆలోచించక తప్పదు. మన జాతీయోద్యమం అంటారే గాని, అది వివిధ జాతుల జాతీయోద్యమం అనడం çసబబు. నాటికి దేశంలో గుర్తింపును పొందిన 17–18 జాతుల ప్రజలంతా.. బ్రిటిష్ పాలన విరగడై స్వతంత్రం వస్తే తమ తమ జాతుల ఆర్థిక, సామాజిక, సాంస్కతిక జీవనం వద్ధి చెందగలుగు తుందని ఆశించారు. వివిధ జాతుల స్వచ్ఛంద సమాఖ్యగా మన భారతదేశం వర్ధిల్లుతుందని వారు భావించారు. ఈ దష్టి తోటే వివిధ జాతుల ప్రజానీకం, నేతలు స్థానికంగా ఎక్కడికక్కడ పోరా డుతూ మొత్తంగా దేశవ్యాపిత ఉద్యమంలో స్వాతంత్య్రోద్యమంలో భాగస్వాములయ్యారు. అంతే కానీ, ఏ ఒక్క జాతి ప్రజల ఉద్యమ ఫలితమో కాదు మన స్వాతంత్య్ర పోరాట విజయం! భారత జాతి అన్నది స్వాతంత్య్రోద్యమ భావోద్వేగంలో ఏర్పడిన భావనే గానీ... వాస్తవానికి అంగ, వంగ, కళింగ, ఆంధ్ర, ద్రవిడ, పంజాబీ, బెలూచీ ఇత్యాది జాతులు లేని ప్రత్యేక భారత జాతి లేదు. ఈ వాస్తవాన్ని పరిగణించి కమ్యూనిస్టు పార్టీలు దేశవ్యాప్త జాతీయ ఉద్యమాలతో పాటూ ఆయా జాతుల జాతీయ సమస్యలకు కూడా తగిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. రెండు, మన స్వాతంత్య్రోద్యమం కేవలం బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి కోసం ఒక్క రాజకీయ ఉద్యమంగానే సాగలేదు. వివిధ దశలలో – బాధ్యతాయుత పాలన కోసం అనే స్థాయి నుంచి సంపూర్ణ స్వాతంత్య్ర స్థాయికి ఎదుగుతూ వచ్చింది. 1930లకు గానీ కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలో స్థూలంగా ఒక స్థాయి పార్టీగా ఏర్పడలేదు. స్వాతంత్య్రోద్యమంలో స్వాతంత్య్ర సాధన రాజకీయ అంశమే ప్రధానంగా ఉండినా, అందులో సామాజిక న్యాయం, ఉత్తమ నైతిక సాంస్కతిక కర్తవ్యాలకు గూడా తగిన ప్రాధాన్యం ఉండేది. ఉదాహరణకు, ‘కల్లు మానండోయ్ బాబూ కళ్లు తెరవండోయ్’ అంటూ సాగిన కాంగ్రెస్ ప్రజా ఉద్యమం ఒక సాధారణ డిమాండును మించిన పోరాటంగా జరిగింది కదా! అలాగే దళిత ఉద్ధరణ, వారి ఆలయ ప్రవేశం, అస్పశ్యతా నివారణ, స్త్రీల పురోభివద్ధి వంటివి మన మెరిగినవే. భారత స్వాతంత్య్ర ఉద్యమం ఒక రాజకీయ పోరాటంగానే గాక బహుముఖ ప్రజాహిత కార్యక్రమాల సమాహారంగా సాగింది. తదుపరి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారిలో నేతలేగాక సామాన్య ప్రజలు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మన సుందరయ్య, సీనియర్ కంభంపాటి, కేరళకు చెందిన నంబూద్రిపాద్ వంటి వారు అలా కాంగ్రెస్ ఉద్యమం నుంచి కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చినవారే. కానీ వారికి వర్గ పోరాటమే ప్రధానమైనది. కాంగ్రెస్‌లో ఆ వర్గ పోరాటం తప్ప ఇతర ప్రజా పోరాటాలన్నీ భాగంగా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే భారత స్వాతంత్య్ర సముపార్జన ప్రధాన లక్ష్యం వర్గ సామరస్యం. అలాగే సామాజిక, న్యాయ తదితర ప్రజా ఉద్యమాల ఆవశ్య కత ఉన్నా అవి ఒక పరిధి దాటి సమరశీలంగా సాగరాదని కాంగ్రెస్ ప్రత్యేకించి గాంధీ, ఆయన అనుయాయుల భావన. వర్గరహిత సాధారణ ప్రజాపార్టీ కాంగ్రెస్ క్రమంగా దోపిడీకి గురవుతున్నవారి వర్గ పోరాటాలను సహించలేనిదిగా దిగజారుతూ పోయింది. కాగా, కమ్యూనిస్టు పార్టీ వర్గపోరాటమే ప్రధానంగా ఇతర సామాజిక, నైతిక తదితర పోరాటాలను నిర్వహించే పార్టీగా రూపొం దుతూ వచ్చింది. ఇక స్వాతంత్య్రానంతర కాలంలో కాంగ్రెస్ తదితర పాలక పార్టీలు దోపిడీ వర్గ ప్రయోజనాలను రక్షిస్తూనే, ఓటు బ్యాంకు రాజకీయంలో భాగంగా ఇతర సామాజిక, నైతిక అంశాలను కూడా వాడుకుంటూ వస్తున్నాయి. మరోవంక వర్గ పోరాటానికి ప్రాధాన్యం పేరిట కమ్యూనిస్టు పార్టీలు... వర్ణ వివక్ష తదితర సామాజిక వివక్షతకు గురవుతున్న ప్రజల న్యాయమైన పోరాటా లను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. దోపిడీ వర్గాలలో సైతం అధికార దాహంతో విభేదాలు పెరగసాగాయి. మొదటి నుంచీ కాంగ్రెస్‌లోని మితవాద, మతవాద శక్తులు ఆ పార్టీలో ఉన్న కొద్దిపాటి పురోగామి, లౌకిక స్వభావాన్ని అంగీకరించనివిగా మారాయి. చివరకు ఆ శక్తులు, నాటి హిందూ మహాసభ మితవాద, మతతత్వ ఎజెండాతో క్రమ క్రమంగా భారతీయ జనతా పార్టీగా రూపు దాల్చాయి. మరో వైపు అంతర్జాతీయ, జాతీయ విభేదాలు, ఏదో ఒక మేరకు స్వార్థ సంకుచిత ప్రయోజనాలు కలసి కమ్యూనిస్టు ఉద్యమంలో చీలికలు వచ్చాయి. ఇక వర్ణ వివక్ష తదితర వర్గేతర సామాజిక దోపీడీకి గురయ్యే వారి ప్రయోజనాలను ప్రతిబింబించే స్వభావాన్ని అవి కోల్పోయాయనే భావన ఆయా సామాజిక బందాలలో బలపడింది. దీంతో వివిధ సామాజిక, వర్ణ అస్తిత్వ ఉద్యమాలను ప్రతిబింబిస్తూ కుల సంఘాలు అవతరించాయి. కమ్యూనిస్టు పార్టీలలోనే అవకాశవాదం, అధికార దాహం చోటుచేసుకున్నాయని మార్క్సిస్టు పార్టీయే ఆత్మవిమర్శ చేసుకుంది. కమ్యూనిస్టు ఉద్యమం తిరిగి తన గత వైభవాన్ని సంతరించుకోవా లంటే – తొలితరం కమ్యూనిస్టు పార్టీవలే వర్గపోరాటాలతో పాటూ ఇతర సామాజిక, నైతిక పోరాటాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రత్యేక శ్రద్ధా సక్తులతో, కషితో అణగారిన ప్రజలు దళితులు, మైనారిటీలు, మహిళలు, ఆదివాసులు తదితరులందిరి విశ్వాసాన్ని చూరగొనగల రూపును తిరిగి సంతరించుకోవాలి.మొత్తం జాతి ప్రయోజనాలను ప్రతిబింబించే రీతిలో కమ్యూనిస్టులు ఆయా జాతీయ ఉద్యమాలను నిర్మించే కషి చేయాలి. ఉదాహరణకు, కేజీ బేసిన్లో సహజ వాయువు కోసం ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అన్న రీతిలో పార్టీలకు అతీతంగా తెలుగు జాతి ఉద్య మానికి రూపాన్ని ఇవ్వగలగాలి! అలాగే ప్రత్యేక హోదా ప్రజల ఆశగా, ఆకాంక్షగా ఉన్నది కాబట్టి అలాంటి ఏపీ కోసం వర్గ, వర్ణ, రాజకీయ విభేదాలను అధిగమించి ఉద్యమించాలి. సాధారణ ప్రజా సమస్యలపై సాగిస్తున్న ఉద్యమాలకు విస్తత రూపం ఇవ్వగలగాలి! ఇందుకు కమ్యూ నిస్టుల మధ్య ఐక్యత కీలకం! కాంగ్రెస్‌తో ఎన్నికలలో కలవాలా, వద్దా? వంటి ఎన్నికల ఎత్తుగడల తాత్కాలికతను దష్టిలో ఉంచుకుని తమ వ్యూహంపై కేంద్రీకరిస్తూ.. తమ దక్పథాన్ని, శ్రేయోభిలాషులను, ప్రజా పునాదిని విస్తరించుకుని గట్టిపరచుకోవాలి. ప్రజాభ్యుదయం కోసం మహ త్తర ప్రజా ఉద్యమాన్ని నిర్మించడం కోసం కష్టసాధ్యమైనా ఇంతటి బహ త్తర కర్తవ్యాన్ని కమ్యూనిస్టులు సాధించగలరని ఆశిస్తున్నాను. -వ్యాసకర్త ప్రముఖ మార్క్సిస్టు విశ్లేషకులు డా‘‘ ఎ.పి. విఠల్ ‘ 98480 69720 -
అమరుల ఆశయాలు సాధిద్దాం
సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచిన గడ్డమీద అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, ఎర్రజెండా వర్ధిల్లాలి, మార్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి అనే నినాదాల మధ్య నాటి పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఎగురవేసి సీపీఎం తెలంగాణ తొలిమహా సభలను ప్రారంభించారు. ఈ పోరాటంలో ఎంతో స్ఫూర్తిని రగిలించి, ఆదర్శంగా నిలిచిన వీరభైరాన్‌పల్లి గాథను గుర్తుకు తెచ్చేలా రూపొందించిన మహాసభల స్వాగతద్వారం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మహాసభల ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్, పార్టీనాయకులు బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు ఉత్తేజభరితమైన వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆర్టీసీ కల్యాణ మండపంలోని మహాసభల ప్రాంగణంలో తెలంగాణలో జరిగిన వివిధపోరాటాలు, రజాకార్లు, నిజాం పోలీసుల వ్యతిరేక పోరాటం, పేదలు, మహిళలు సాగించిన ఉద్యమాలను ఎత్తిచూపేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. రాష్ర్ట మహాసభల వేదికపై ఒకవైపు పార్టీ చిహ్నం, ఇతరసందేశాలతో‘‘సంక్షేమం, సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి, వామపక్షాల ఐక్యత’’ అనే ఫ్లెక్సీ , మరోవైపు బంజారా మహిళలు, కొమ్ము, బూరా వాయిద్యాలు, నృత్యాలతో ఏర్పాటుచేసిన ఇంకొక ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకున్నాయి. బూర్జువా ప్రభుత్వమిది: కారత్ ధ్వజం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ ఈ మహాసభల ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేరుకే అధికారంలో ఉందని, అసలు నడుస్తున్నది బూర్జువా, కార్పొరేట్, ఆరెస్సెస్, హిందుత్వశక్తుల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కార్పొరేట్ అనుకూల, హిందుత్వభావజాల వ్యాప్తి, మతోన్మాద ఎజెండాను అమలుచేస్తూ ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు. గత 9 నెలల పాలనలో ఇదే సుస్పష్టమైందన్నారు. బీజేపీ అధికారంలో ఉండడంతో హిందుత్వ అనుకూల విధానాలను ప్రజలపై రుద్దడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల భావప్రకటనాస్వేచ్ఛపై, కళాకారులపై హిందూమతోన్మాద వాదులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. సరళీకరణ విధానాలతోపాటుగా మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా నడుంబిగించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొరుగుదేశం చైనాను దూరంగా పెట్టి, అమెరికాతో మోదీ జతకట్టారని, ఆదేశంతో బంధాన్ని బలోపేతం చేసుకుంటూ సామ్రాజ్యవాదశక్తులకు దాసోహం అవుతున్నారని అన్నారు. పార్లమెంట్‌ను కూడా కాదని భూసంస్కరణలు, ప్రైవేట్ శక్తులను బొగ్గురంగంలోకి దింపేందుకు ఆర్డినెన్స్‌ల ద్వారా సవరణలు తెచ్చే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వ స్వభావాన్ని స్పష్టంచేస్తోందన్నారు. వామపక్ష, ప్రజాతంత్రశక్తులు ఐక్యసంఘటనగా ఏర్పడాలి... దేశ, రాష్ట్రస్థాయిల్లో వామపక్షాలు బలపడాలని, దాంతోపాటు ప్రజాతంత్రశక్తులు, అణగారిన వర్గాలు, ప్రజాసంఘాలు బలపడి, విశాలప్రాతిపదికగా ఐక్యసంఘటనగా ఏర్పడడం నేటి అవసరమని కారత్ పిలుపునిచ్చారు. ఈ శక్తులు సంప్రదాయ రాజకీయ, బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడాల్సి ఉందన్నారు. ఈ దిశలో రాష్ట్రమహాసభలు, విశాఖలో జరగనున్న పార్టీ జాతీయమహాసభలు దోహదంచేస్తాయన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణలో 10 వామపక్షాలు కలసి ఉద్యమించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కార్మికులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు, గ్రామీణపేదలను కలుపుకుని ముందుకు పోవాలన్నారు. తెలంగాణలో సాగిన కమ్యూనిస్టు ఉద్యమం ఎంతో ఉత్తేజవంతమైనదని, దాని నుంచి స్ఫూర్తిని పొంది వామపక్ష, ప్రజాతంత్రశక్తులతో ప్రత్యామ్నాయం కోసం కృషిచేయాలని ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు. -
సుత్తి కొడవలి.. నక్షత్రం!
* ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యం * ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం * పార్టీ పనులే ప్రాణం; చట్టసభలకు దూరం ప్రొఫైల్ పేరు: బీవీ రాఘవులు, తల్లిదండ్రులు: పున్నమ్మ, వెంకట సుబ్బయ్య, ఊరు: ప్రకాశం జిల్లా పెదమోపాడు, పుట్టిన తేదీ: 01-06-1954 చదువు: ఎంఎ హిస్టరీ, ఇష్టం: పుస్తక పఠనం, భార్య: ఎస్.పుణ్యవతి, కుమార్తె: సృజన, ప్రస్తుత నివాసం: హైదరాబాద్ పార్టీలో పదవి: సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు (2014 మార్చి 8 వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి తప్పుకున్నారు) ‘కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. అలా అని పార్టీ నాయకులు ఎటుపడితే అటు కొట్టుకుపోకూడదు. మార్క్సిజం అజేయం. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు శాపనార్ధాలు సరిపోవు. పోరాటమార్గమే అందుకు శరణ్యం’ ఎ.అమరయ్య: బోడపాటి వీర రాఘవులు అలియాస్ బీవీఆర్. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పెద మోపాడుకు చెందిన రాఘవులు కమ్యూనిస్టు ఉద్యమం మహోధృతంగా సాగుతున్న రోజు ల్లో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1954 జూన్ 1న జన్మించారు. తల్లిదండ్రులు బొడపాటి వెంకట సుబ్బయ్య, పున్నమ్మ దంపతులు. పాఠశాల విద్యను కందుకూరులో, ఇంటర్మీడియెట్‌ను గుంటూరులోని ఏసీ కాలేజీలో పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీలో చేరారు. కాకపోతే మధ్యలోనే ఆపేశారు. కారణమేంటో ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు. ఆ తరువాత కావలిలో బీఏలో చేరారు. అది 1975 జూన్ చివరి వారం. బీఏ చివరి సంవత్సరం చివరి పరీక్ష రాసి కళాశాల నుంచి బయటపడే సమయానికి దేశమంతా అల్లకల్లోలం. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. సరిగ్గా ఈ దశలోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. అప్పటి వరకు వామపక్ష విద్యార్థి సంఘాలతో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు పటిష్టమయ్యాయి. సీపీఎంలో పూర్తికాలపు కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అయిన నెల్లూరు వెళ్లారు. సీపీఎంలో క్రియాశీలంగా.. ఎమర్జెన్సీ వల్ల సీపీఎంలో అప్పటికే నాయకులుగా ఉన్న వాళ్లు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొందరు జైళ్ల పాలయ్యారు. దీంతో నెల్లూరులోని పార్టీ కార్యాలయం బాగోగుల్ని చూసే బాధ్యత తీసుకున్నారు. కార్యాలయంలోనే ఉండి కొన్నిసార్లు రహస్యంగా మరికొన్నిసార్లు బహిరంగంగా కార్యకలాపాలు సాగించారు. పోలీసుల నిఘా, వేధింపులు, అరెస్టులు ఎక్కువ కావడంతో పార్టీ నాయకత్వమే రాఘవుల్ని విశాఖపట్టణానికి పంపించింది. ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా.. పార్టీకి పనికి వస్తారని గుర్తించిన కార్యకర్తలను అవసరాన్ని బట్టి ఆయా రంగాల బాధ్యతలు అప్పగిస్తుంటాయి కమ్యూనిస్టు పార్టీలు. దానిలో భాగంగానే విశాఖపట్నం చేరిన రాఘవులు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లిషు డిప్లొమాలో చేరారు. ఆ తరువాత ఎంఏలో జాయినయ్యారు. విద్యార్థిగా అక్కడ విద్యార్థి ఉద్యమానికి నడుంకట్టారు. ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ 1979లో భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ)కు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. తొలిసారి పూర్తిస్థాయి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అక్కడే ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీలో చేరారు. సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా.. అదే సమయంలో విశాఖపట్నం జిల్లా సీపీఎం కార్యదర్శి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన స్థానం లో వచ్చిన మరోనాయకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పార్టీకి కొత్త కార్యదర్శి కావాల్సి వచ్చింది. రాఘవుల్ని ఆ పదవి చేపట్టాలని పార్టీ ఆదేశించింది. దాంతో రాఘవులు తన ఆర్థిక శాస్త్ర పరిశోధనకు విరామం ఇచ్చి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. ఈ కాలంలోనే ఆయన తన సహకార్యకర్త అయిన పుణ్యవతిని పెళ్లి చేసుకున్నారు(ప్రస్తుతం ఆమె సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా, పార్టీ అనుబంధ సంస్థ సీఐటీయూ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు). పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా.. 1983లో విశాఖ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయిన రాఘవులు ఆ తర్వాత ఎన్నడూ తిరిగిచూడలేదు. 1988 నవంబర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యత చూస్తూనే 1994 అక్టోబర్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఏడాది గడవక మునుపే 1995 ఏప్రిల్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. ఈ పదవిలో కొనసాగుతుండగానే ఆయన 1997 డిసెంబర్లో నల్లగొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పదహారేళ్లకు పైగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటీవలే తన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో పి.మధుకు, తెలంగాణలో తమ్మినేని వీరభద్రానికి అప్పగించారు. పార్లమెంటరీ ఎన్నికలకు దూరంగా.. మూడు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. చట్టసభల ప్రతినిధిగా వెళ్లేందుకు ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం లేకనో, పార్టీ కార్యదర్శిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకనో.. ఆ దిశగా ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. వ్యక్తిత్వం, నడత, పార్టీ ప్రయోజనాలే ప్రమాణికంగా ముందుకు సాగే రాఘవులు టీడీపీతో పొత్తులప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మరోవైపు అదే పార్టీ నేత చంద్రబాబుపైన అవినీతి ఆరోపణల చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ వెనుకాడలేదు. ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారు. అసంఖ్యాక సంఘాలను స్థాపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు. భూ పంపిణీతోనే బడుగులకు న్యాయమన్నారు. విద్యుత్ చార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమంలో ముందు నిలిచారు. ఫలితంగా 2005లో రాఘవులును పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. పార్టీకే అంకితం శ్రామికవర్గ శ్రేయస్సే మిన్నగా భావించే రాఘవులు అవసరమైతే కార్మికవర్గ బలహీనతలను సైతం విమర్శించేవారు. సొంత ఆస్తులకు దూరంగా ఉండే రాఘవులు తన వాటాగా వచ్చిన ఆస్తిపాస్తుల్నీ పార్టీకే ఇచ్చివేసినట్టు చెబుతారు. పార్టీయే సర్వస్వంగా పార్టీ కార్యాలయమే నివాసంగా భావించే రాఘవులు దంపతులకు ఒక కూతురు. పేరు సృజన. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఎ, పీహెచ్డీ పూర్తి చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నారు. సింపుల్.. ప్లెయిన్.. అండ్ స్ట్రెయిట్‌ఫార్వర్డ్. ఆయన గురించి చెప్పమంటే ఈ ఒక్క ముక్కలో చెప్పొచ్చు. సాదాసీదా ఆహార్యం, ముక్కుసూటి వ్యవహారం ఆయన స్పెషాలిటీ. మార్క్సిజం ఆయన మతం. సమసమాజం ఆయన లక్ష్యం. చెప్పేదేదో స్పష్టంగా ‘కొడవలి’తో కోసినట్లుగా.. సూటిగా ‘సుత్తి’ లేకుండా.. పెదవులపై చిరునవ్వు చెరగకుండా.. చెప్పేస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఒకసారి విప్లవకారుడిలా, మరోసారి వేదాంతిలా, ఇంకోసారి మేధావిలా అనిపిస్తారు కానీ రాజకీయ నాయకుడిలా అస్సలు అనిపించరు. ఆయనే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంతవరకు సీపీఎంకు పర్యాయపదంగా నిలిచిన బీవీ రాఘవులు.