సుత్తి కొడవలి.. నక్షత్రం! | BV Raghavulu played key role in Communist Party movement | Sakshi
Sakshi News home page

సుత్తి కొడవలి.. నక్షత్రం!

Published Fri, Apr 4 2014 1:26 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

సుత్తి కొడవలి.. నక్షత్రం! - Sakshi

సుత్తి కొడవలి.. నక్షత్రం!

* ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యం
* ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం
* పార్టీ పనులే ప్రాణం; చట్టసభలకు దూరం

 
 ప్రొఫైల్
 పేరు: బీవీ రాఘవులు, తల్లిదండ్రులు: పున్నమ్మ, వెంకట సుబ్బయ్య,
ఊరు: ప్రకాశం జిల్లా పెదమోపాడు, పుట్టిన తేదీ: 01-06-1954
చదువు: ఎంఎ హిస్టరీ,  ఇష్టం: పుస్తక పఠనం, భార్య: ఎస్.పుణ్యవతి, కుమార్తె: సృజన, ప్రస్తుత నివాసం: హైదరాబాద్ పార్టీలో పదవి: సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యులు
(2014 మార్చి 8 వరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా  పని చేసి తప్పుకున్నారు)
‘కమ్యూనిస్టులు కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. అలా అని పార్టీ నాయకులు ఎటుపడితే అటు కొట్టుకుపోకూడదు. మార్క్సిజం అజేయం. పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేందుకు శాపనార్ధాలు సరిపోవు. పోరాటమార్గమే అందుకు శరణ్యం’
 
ఎ.అమరయ్య: బోడపాటి వీర రాఘవులు అలియాస్ బీవీఆర్. ప్రకాశం జిల్లా కందుకూరు మండలం పెద మోపాడుకు చెందిన రాఘవులు కమ్యూనిస్టు ఉద్యమం మహోధృతంగా సాగుతున్న రోజు ల్లో ఓ మధ్య తరగతి కుటుంబంలో 1954 జూన్ 1న జన్మించారు. తల్లిదండ్రులు బొడపాటి వెంకట సుబ్బయ్య, పున్నమ్మ దంపతులు. పాఠశాల విద్యను కందుకూరులో, ఇంటర్మీడియెట్‌ను గుంటూరులోని ఏసీ కాలేజీలో పూర్తి చేశారు. వ్యవసాయంపై మక్కువతో బాపట్లలోని వ్యవసాయ కళాశాలలో డిగ్రీలో చేరారు. కాకపోతే మధ్యలోనే ఆపేశారు. కారణమేంటో ఆయనకు తప్ప మరెవరికీ తెలియదు.
 
 ఆ తరువాత కావలిలో బీఏలో చేరారు. అది 1975 జూన్ చివరి వారం. బీఏ చివరి సంవత్సరం చివరి పరీక్ష రాసి కళాశాల నుంచి బయటపడే సమయానికి దేశమంతా అల్లకల్లోలం. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. సరిగ్గా ఈ దశలోనే ఆయన జీవితం మలుపు తిరిగింది. అప్పటి వరకు వామపక్ష విద్యార్థి సంఘాలతో అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు పటిష్టమయ్యాయి. సీపీఎంలో పూర్తికాలపు కార్యకర్తగా పనిచేయాలని నిర్ణయించుకున్నారు. కమ్యూనిస్టు యోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పురిటిగడ్డ అయిన నెల్లూరు వెళ్లారు.
 
 సీపీఎంలో క్రియాశీలంగా..
 ఎమర్జెన్సీ వల్ల సీపీఎంలో అప్పటికే నాయకులుగా ఉన్న వాళ్లు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లారు. మరికొందరు జైళ్ల పాలయ్యారు. దీంతో నెల్లూరులోని పార్టీ కార్యాలయం బాగోగుల్ని చూసే బాధ్యత తీసుకున్నారు. కార్యాలయంలోనే ఉండి కొన్నిసార్లు రహస్యంగా మరికొన్నిసార్లు బహిరంగంగా కార్యకలాపాలు సాగించారు. పోలీసుల నిఘా, వేధింపులు, అరెస్టులు ఎక్కువ కావడంతో పార్టీ నాయకత్వమే రాఘవుల్ని విశాఖపట్టణానికి పంపించింది.
 
ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్షుడిగా..
 పార్టీకి పనికి వస్తారని గుర్తించిన కార్యకర్తలను అవసరాన్ని బట్టి ఆయా రంగాల బాధ్యతలు అప్పగిస్తుంటాయి కమ్యూనిస్టు పార్టీలు. దానిలో భాగంగానే విశాఖపట్నం చేరిన రాఘవులు ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లిషు డిప్లొమాలో చేరారు. ఆ తరువాత ఎంఏలో జాయినయ్యారు. విద్యార్థిగా  అక్కడ విద్యార్థి ఉద్యమానికి నడుంకట్టారు. ఆయన నాయకత్వ లక్షణాలను గుర్తించిన పార్టీ 1979లో భారతీయ విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ)కు రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. తొలిసారి పూర్తిస్థాయి పదవీ బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. అక్కడే ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీలో చేరారు.
 
సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శిగా..
 అదే సమయంలో విశాఖపట్నం జిల్లా సీపీఎం కార్యదర్శి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన స్థానం లో వచ్చిన మరోనాయకుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో పార్టీకి కొత్త కార్యదర్శి కావాల్సి వచ్చింది. రాఘవుల్ని ఆ పదవి చేపట్టాలని పార్టీ ఆదేశించింది. దాంతో రాఘవులు తన ఆర్థిక శాస్త్ర పరిశోధనకు విరామం ఇచ్చి విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల్ని చేపట్టారు. ఈ కాలంలోనే ఆయన తన సహకార్యకర్త అయిన పుణ్యవతిని పెళ్లి చేసుకున్నారు(ప్రస్తుతం ఆమె సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలిగా, పార్టీ అనుబంధ సంస్థ సీఐటీయూ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు).
 
పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా..  
 1983లో విశాఖ జిల్లా కార్యదర్శిగా ఎన్నికయిన రాఘవులు ఆ తర్వాత ఎన్నడూ తిరిగిచూడలేదు. 1988 నవంబర్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ బాధ్యత చూస్తూనే 1994 అక్టోబర్‌లో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఆ తర్వాత ఏడాది గడవక మునుపే 1995 ఏప్రిల్‌లో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు. ఈ పదవిలో కొనసాగుతుండగానే ఆయన 1997 డిసెంబర్‌లో నల్లగొండలో జరిగిన పార్టీ రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పదహారేళ్లకు పైగా పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర విభజన అనంతరం ఇటీవలే తన బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌లో పి.మధుకు, తెలంగాణలో తమ్మినేని వీరభద్రానికి అప్పగించారు.
 
పార్లమెంటరీ ఎన్నికలకు దూరంగా..
 మూడు దశాబ్దాలకు పైగా ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పటికీ.. చట్టసభల ప్రతినిధిగా వెళ్లేందుకు ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. పార్లమెంటరీ వ్యవస్థపై నమ్మకం లేకనో, పార్టీ కార్యదర్శిగా ఉండి ఎన్నికల్లో పోటీ చేయడం ఇష్టం లేకనో.. ఆ దిశగా ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. వ్యక్తిత్వం, నడత, పార్టీ ప్రయోజనాలే ప్రమాణికంగా ముందుకు సాగే రాఘవులు టీడీపీతో పొత్తులప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. మరోవైపు అదే పార్టీ నేత చంద్రబాబుపైన అవినీతి ఆరోపణల చార్జిషీట్ దాఖలు చేయడంలోనూ వెనుకాడలేదు. ప్రజలు, పార్టీ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేశారు. అసంఖ్యాక సంఘాలను స్థాపించారు. కుల వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తారు. భూ పంపిణీతోనే బడుగులకు న్యాయమన్నారు. విద్యుత్ చార్జీల పెంపు వ్యతిరేక ఉద్యమంలో ముందు నిలిచారు. ఫలితంగా 2005లో రాఘవులును పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు.
 
 పార్టీకే అంకితం
 శ్రామికవర్గ శ్రేయస్సే మిన్నగా భావించే రాఘవులు అవసరమైతే కార్మికవర్గ బలహీనతలను సైతం విమర్శించేవారు. సొంత ఆస్తులకు దూరంగా ఉండే రాఘవులు తన వాటాగా వచ్చిన ఆస్తిపాస్తుల్నీ పార్టీకే ఇచ్చివేసినట్టు చెబుతారు. పార్టీయే సర్వస్వంగా పార్టీ కార్యాలయమే నివాసంగా భావించే రాఘవులు దంపతులకు ఒక కూతురు. పేరు సృజన. ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఎ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఆదర్శ వివాహం చేసుకున్నారు.
 
 సింపుల్.. ప్లెయిన్.. అండ్ స్ట్రెయిట్‌ఫార్వర్డ్. ఆయన గురించి చెప్పమంటే ఈ ఒక్క ముక్కలో చెప్పొచ్చు. సాదాసీదా ఆహార్యం, ముక్కుసూటి వ్యవహారం ఆయన స్పెషాలిటీ. మార్క్సిజం ఆయన మతం. సమసమాజం ఆయన లక్ష్యం. చెప్పేదేదో స్పష్టంగా ‘కొడవలి’తో కోసినట్లుగా.. సూటిగా ‘సుత్తి’ లేకుండా.. పెదవులపై చిరునవ్వు చెరగకుండా.. చెప్పేస్తారు. ఆయన మాట్లాడుతుంటే ఒకసారి విప్లవకారుడిలా, మరోసారి వేదాంతిలా, ఇంకోసారి మేధావిలా అనిపిస్తారు కానీ రాజకీయ నాయకుడిలా అస్సలు అనిపించరు. ఆయనే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంతవరకు సీపీఎంకు పర్యాయపదంగా నిలిచిన బీవీ రాఘవులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement