
సీపీఎం ‘జన్ ఆందోళన్’
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఆగస్టు నుంచి మార్చి వరకు
చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘జన్ ఆందోళన్’ పేరిట నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. జన్ ఆందోళన్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకూ పార్టీ శ్రేణులుపలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శుక్రవారం చండీగఢ్‌లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు.
దివంగత వామపక్ష నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ శత జయంతిని పురస్కరించుకుని జన్ ఆందోళన్‌ను తలపెట్టినట్లు ఆయన తెలిపారు. అమెరికా విధానాలను మోదీ సర్కారు గుడ్డిగా అనుసరిస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ మావేశాల్లో 50 చట్టాలను స్థాయీ సంఘానికి సమర్పించకుండానే తెచ్చారని, ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. 2013లో కాంగ్రెస్‌తో కలిసి భూసేకరణ చట్టాన్ని ఆమోదించిన బీజేపీ ఇప్పుడు సవరణలు ఎందుకు తేవాలనుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికవేత్తల కోసమే భూసేకరణ చట్టాన్ని కేంద్రం సవరిస్తోందన్నారు. సవరణ చట్టం ఆమోదం పొందితే.. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా కి.మీ. వరకూ భూమిని కేంద్రం సేకరిస్తుందని, ఇది దేశంలోని సాగుభూమిలో 39 శాతానికి పైగా ఉంటుందన్నారు.