రూ.11.45 కోట్లు వెనక్కు | Withdrawn Rs .11.45 crore | Sakshi
Sakshi News home page

రూ.11.45 కోట్లు వెనక్కు

Published Fri, Feb 20 2015 2:10 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Withdrawn Rs .11.45 crore

రుణమాఫీ నిధులు పూర్తిస్థాయిలో పంపిణీ చేయని బ్యాంకులు
అర్హత ప్రకటించినప్పటికీ కొర్రీలతో నిలుపుదల
6,045 మంది రైతులకు రిక్తహస్తమే

 
రుణమాఫీ కింద తొలివిడత మంజూరైన నిధులు: రూ.258.104 కోట్లు
పంపిణీ చేసిన మొత్తం: రూ.246.65 కోట్లు
సర్కారుకు వెనక్కు పంపనున్న మిగులు నిధులు: రూ.11.454 కోట్లు

 
ఇదేంటి.. రుణమాఫీ పథకం నిధులు వెనక్కు వెళ్లడమేంటనుకుంటున్నారా? కానీ ఇది నిజం. రుణమాఫీ కింద అర్హత సాధించిన రైతులకు సర్కారు నిధులు మంజూరు చేసినప్పటికీ.. బ్యాంకర్ల నిర్వాకంతో ఏకంగా రూ.11.454 కోట్లు తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమచేయాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో నిన్నటివరకు రుణమాఫీ వస్తుందని గంపెడాశతో ఎదురుచూస్తున్న ఆరువేల మందికి.. మాఫీ కాకపోగా తిరిగి వడ్డీతో సహా బ్యాంకులకు రుణవాయిదాలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.  - సాక్షి, రంగారెడ్డి జిల్లా
 
రంగారెడ్డి జిల్లా : జిల్లాలోని బ్యాంకు అధికారుల నిర్వాకంతో ఆరువేల మందికి రుణమాఫీ పథకం నిరాశను మిగిల్చింది. బ్యాంకు నుంచి తీసుకున్న పంటరుణాల మాఫీ పథకానికి తాము ఎంపిక కావడంతో ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని భావించిన రైతాంగానికి మళ్లీ అప్పుల ఉబిలో కూరుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 6,045 మంది రైతు కుటుంబాలు మాఫీ పథకానికి దూరం కానున్నారు. వీరికి సంబంధించి ప్రభుత్వం విడుదలచేసిన మాఫీ నిధులను తిరిగి సర్కారు ఖజానాకు జమ చేసేందుకు జిల్లా వ్యవసాయ శాఖ చర్యలు వేగిరం చేసింది.

అప్పుడు అర్హులే.. కానీ..

రుణమాఫీ పథకం అమలుకు సంబంధించి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆ మేరకు అర్హతను నిర్ధారించి జాబితాను గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలని ఆదేశించింది. దీంతో చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం.. దాదాపు నెలన్నరపాటు కుస్తీపట్టి ఎట్టకేలకు అర్హుల జాబితాను విడుదల చేసింది. అందులో అభ్యంతరాలను స్వీకరించిన యంత్రాంగం చివరకు జిల్లాలో 2,10,257 మందిని అర్హులుగా తేల్చుతూ రూ.1,032.64 కోట్లు మాఫీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి సూచించింది. తాజాగా అర్హుల జాబితాపై బ్యాంకర్లు పేచీ పెడుతున్నారు.

ఇందులో అనర్హులున్నార ని, బంగారు అభరణాలపై ఏడు శాతం కంటే ఎక్కువ రుణం తీసుకున్నవారు అర్హులుకారంటూ వారి రుణమాఫీని నిలిపివేసింది. అంతేకాకుండా నింబంధనల ప్రకారం రీషెడ్యూల్, రెన్యూవల్‌కు అర్హులు కారంటూ మరికొందరిని, అర్హులైన కొందరు మృతి చెందారంటూ మరికొందరి ఖాతాల్లో మాఫీ నిధులు జమ చేయలేదు. ఇలా జిల్లా వ్యాప్తంగా 6,045 మంది రైతులకు సంబంధించి రూ.11.45 కోట్లు బ్యాంకుల్లో ఉండిపోయాయి. తాజాగా రుణమాఫీకి సంబంధించి మిగులు నిధులు వెంటనే వెనక్కు ఇచ్చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించింది. దీంతో మిగులు నిధులు వెనక్కు రప్పించే పనిలో వ్యవసాయ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

నెలాఖరు నాటికి సర్కారు ఖాతాకు..

జిల్లాలో పంపిణీ కాకుండా మిగిలిపోయిన రుణమాఫీ నిధులను వెనక్కు పంపించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు బ్యాంకులకు సమాచారం పంపారు. రుణమాఫీ నిధులు ప్రస్తుతం బ్యాంకు ఖాతాల్లో ఉన్నందున.. అన్ని బ్యాంకుల నుంచి వివరాలు రాబట్టేందుకు బ్యాంకర్లతో సమన్వయం చేసుకుంటున్నారు. అన్ని బ్యాంకుల నుంచి మిగులు నిధులు వెనక్కు రప్పించిన తర్వాత వాటన్నిటిని కలిపి ఒకేసారి డీడీ రూపంలో ప్రభుత్వ ఖాతాలో జమచేస్తామని, ఈ ప్రక్రియంతా ఈ నెలాఖరు నాటికి పూర్తవుతుందని జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు విజయ్‌కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement