గుర్తింపులేని పాఠశాలల మూసివేత!
♦ జూన్ ప్రారంభం నుంచి కఠిన చర్యలు
♦ ఆలోగా గుర్తింపు తీసుకోవాలని విద్యాశాఖ సూచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపు లేని పాఠశాలల మూసివేతకు విద్యాశాఖ సిద్ధమవుతోంది. జూన్ ప్రారంభం నాటికి గుర్తింపులేని పాఠశాలల జాబితా రూపొందించి, వాటిని మూసివేయాలని డీఈవోలకు, క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గుర్తింపులేని స్కూళ్లన్నీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతో సమావేశం నిర్వహించి ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2016-17 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో గుర్తింపులేని పాఠశాలలు కొనసాగడానికి వీల్లేని విధంగా ముందస్తు చర్యలు చేపడుతోంది.
ఈనెలాఖరు వరకు దరఖాస్తులు
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త పాఠశాలలు ప్రారంభించేందుకు, అదనపు తరగతులు, అదనపు సెక్షన్లకు అనుమతుల కోసం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ స్పష్టం చేసింది. గతంలోనే దరఖాస్తుల గడువు ముగిసినా.. ఈ నెలాఖరు వరకు గడువును పొడిగించి, ఆన్‌లైన్ ద్వారా దర ఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇదే చివరి అవకాశమని, గుర్తింపు తీసుకోకుంటే స్కూళ్లను మూసివేస్తామని స్పష్టం చేసింది. కాగా, డీఈవోలు అందించిన సమాచారం ప్రకారం... రాష్ట్రంలో గుర్తింపు లేకపోయినా 152 పాఠశాలలు కొనసాగుతున్నట్లు విద్యాశాఖ లెక్కలు వేసింది. అయితే ఈ సంఖ్య విషయంలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రీప్రైమరీకి గుర్తింపు తప్పనిసరి
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలల్లో కొనసాగుతున్న ప్రీప్రైమరీ విభాగాలకు గుర్తింపు తప్పనిసరిగా తీసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. స్కూళ్లలోనే కాకుండా ప్లే స్కూళ్లు, ఇతర పేర్లతో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు కొనసాగిస్తున్న సంస్థలు కూడా తప్పనిసరిగా గుర్తింపు తీసుకోవాలని... లేదంటే వాటిని మూసేస్తామని తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే 1,500 వరకు ప్రీప్రైమరీ విద్యా సంస్థలు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీని కొనసాగిస్తుండగా... ఇతర జిల్లాల్లో మరో వెయ్యి వరకు ఉన్నట్లు అంచనా. అయితే ఇందులో ఇప్పటివరకు 18 సంస్థలు మాత్రమే దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.