వేతనాలు తీసుకోకుండా ప్రజా సేవ చేయలేరా..!
* తమది చిన్న పార్టీ అంటే పెద్ద దెబ్బే తగులుతుంది
* సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మల్లారెడ్డి
మంచిర్యాల సిటీ : రాష్ట్రంలోని ఎమ్మెల్యేలకు రూ.2 లక్షలకు పైగా జీతాలను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సవరించారని, వారు ఏం పనిచేస్తున్నారని అంత పెద్ద మొత్తంలో వేతనాలు పొందుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సారంపల్లి మల్లారెడ్డి ప్రశ్నించారు. ప్రజా సేవ చేయడానికే వచ్చామని చెప్పుకునే ప్రజాప్రతినిధులకు వేతనాలు ఎందుకని.. వేతనాలు తీసుకోకుండా ప్రజలకు సేవ చేయలేరా అని దుయ్యబట్టారు.
మంచిర్యాల పట్టణంలో రెండు రోజుల పాటు నిర్వహించే పార్టీ జిల్లా పదో మహాసభలు బుధవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. దేశంలో సీపీఎం పార్టీని చిన్న పార్టీ అని పలువురు అనుకుంటున్నారని, అలా అనుకున్న వారికి తమ పార్టీతో పెద్ద దెబ్బ తగులుతుందని పేర్కొన్నారు.
సీపీఎం అంటే ఉద్యమాలకు పెద్దపీట వేసే పార్టీ అని, ప్రజల కష్టాలను పంచుకుని వారి హక్కులను సాధించే పార్టీగా ఏ మారుమూల ప్రాంత ప్రజలను అడిగినా చెబుతారని పేర్కొన్నారు. ఇంత చరిత్ర ఉన్న పార్టీని చిన్న పార్టీ అని కొందరు అనడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. అధికారం కోసం పాకులాడే పార్టీ తమది కాదని, ప్రజల అవసరాలు తీర్చడానికే సీపీఎం ఉందనే విషయాన్ని గమనించాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రైవేటు పెట్టుబడులను, పారిశ్రామిక రంగాన్ని, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహిస్తోందని, రాష్ట్ర ముఖ్యమంత్రి గాలిలో ప్రయాణాలు చేస్తూ మరిన్ని మోస పూరిత హామీలిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను ఆదుకోకుండా.. బంగారు బాటలు వేస్తానని ప్రకటించి వారి బంగారు భవిష్యత్తు నాశనానికి కారకుడయ్యాడని దుయ్యబట్టారు.
రుణమాఫీ చేయకుండా, విద్యార్థులకు భోధన రుసుముతోపాటు ఉపకార వేతనాలను మంజూరు చేయలేక కాలయాపన చేస్తున్నారన్నారు. మహాసభలకు హాజరైన పార్టీ అనుబంధ సంఘాలు, అంగన్‌వాడీ, ఆశ, విద్యుత్, వైద్య, బీమా సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శన చేపట్టారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులు సాయిబాబ, సాగర్, లంకా రాఘవులు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.సత్యనారాయణ, రాజన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు దత్తాత్రి, ప్రకాష్, రవి తదితరులు పాల్గొన్నారు.