ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో పోకిరీలకు బ్యాడ్ టైమ్ మొదలైపోయింది. ఇంతకాలం పోలీస్ పెట్రోలింగ్ మగ పోలీసులే నిర్వహించటం చూస్తున్నాం. ఇందుకోసం ఇప్పుడు మహిళా పోలీసులను కూడా రంగంలోకి దించేసింది తెలంగాణ పోలీస్ శాఖ. మహిళలపై వేధింపులు, ఈవ్ టీజింగ్, అత్యాచార యత్నం వంటి ఘటనల్ని నివారించేందుకు ఈ మహిళా పోలీస్ పెట్రోలింగ్‌ను వినియోగించనున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీలో తొలిసారిగా ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. పెట్రో కారులోనే ఇక మహిళా పోలీసులు విధులు నిర్వహిస్తారు. వారికి సహాయకంగా కొందరు సిబ్బంది(మగ) కూడా ఉంటారు. రోడ్లపై ఆకతాయిలు, తాగుబోతుల వీరంగం... ఇలా ఏది కనిపించినా రంగంలోకి దిగి తాట తీస్తారు. దేశంలో మహిళా పోలీసు స్టేషన్లు ఉన్నప్పటికీ చిన్న చిన్న కేసుల్లో ఆ స్టేషన్ల గడప తొక్కేవారు అరుదు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడో, బస్టాప్ లో నిల్చున్నప్పుడో, స్కూలుకు వెళుతున్నప్పుడో.. పోకిరీలు పిచ్చి చేష్టలు చేస్తే... పోలీసులకు ఫిర్యాదులు చేయడానికి అమ్మాయిలు కాస్త తటపటాయిస్తుంటారు. అదే మహిళా పోలీసులు అయితే గనుక నిరభ్యరంతంగా వెళ్లి చెప్పేయొచ్చు. వాళ్లు తమ ఎదుట ఉన్నారన్న భరోసా మహిళల్లో మరికాస్త ధైర్యాన్ని ఇస్తుంది.
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రపంచదేశాలన్నీ మహిళా పోలీసు వ్యవవస్థను పటిష్టపరుస్తున్నాయి. ఇప్పటికే ఇటలీ, చైనా వంటి దేశాలు ఈ దిశగా అడుగులువేసి మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని నూరిపోశాయి. ఇక తొలిసారి ‘షీ టీమ్స్’ను ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. తాజా నిర్ణయంతో మరో అడుగు ఇప్పుడు ముందుకు వేసినట్లయ్యింది. కాగా, రాజస్థాన్ దేశంలోనే తొలి మహిళా పోలీసు పెట్రోలింగ్ బృందాన్ని నియమించగా.. ఢిల్లీ కూడా ఆ జాబితాలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment