
కలెక్టర్ పక్కన మహిళా ప్రతినిధుల భర్తలు
సాక్షి, తూప్రాన్: కంప్యూటర్ యుగంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వీరికి రాజకీయంగా సముచిత న్యాయం అందించడంలో భాగంగా పాలకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. దీంతో సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీలుగా మహిళా ప్రతినిధులు ఎన్నికవుతున్నా వారు ఇంటికే పరిమితమవుతున్నారు. వారి భర్తలే ప్రజాప్రతినిధులుగా చెలామని అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గ్రామ స్థాయిలో జరిగే కార్యక్రమాలకే కాకుండా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా వారి భర్తలే హాజరు అవుతున్న సంఘటనలు ప్రతినిథ్యం ఏదో ఒకచోట చూస్తూనే ఉన్నాం. ఇందుకు నిదర్శనం శుక్రవారం మండలంలోని హస్తాల్‌పూర్‌లో రెవెన్యూ అధికారులు నిర్వహించిన గ్రామసభ. గ్రామసభను సందర్శనకు కలెక్టర్ ధర్మారెడ్డి రాగా వెల్దుర్తి ఎంపీపీ స్వరూప భర్త నరేందర్‌రెడ్డి, కొప్పులపల్లి సర్పంచ్ కనకమ్మ భర్త బాల్‌రెడ్డిలు తామే ప్రజా ప్రతినిధులుగా పరిచయం చేసుకొని కలెక్టర్ పక్క సీటులోనే ఆసీనులయ్యారు.
స్థానిక సర్పంచ్ మమత మాత్రం వీరి పక్కన కొద్దిసేపు కూర్చుండి పక్క హాలులోకి వెళ్లిపోయింది. సర్పంచ్ మమత కలెక్టర్‌కు దూరంగా కూర్చోగా మహిళా ప్రతినిధుల భర్తలు కలెక్టర్ పక్కన కూర్చోవడం ఎంతవరకు సమంజసమంటూ పలువురు గ్రామస్తులు చర్చించుకున్నారు. కలెక్టర్ హాజరైన ప్రభుత్వ కార్యక్రమంలోనే ఇలా ఉంటే మండల స్థాయి అధికారులు నిర్వహించే కార్యక్రమాల్లో ఎలా ప్రవర్తిస్తారోనని మరి. మహిళా ప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరై దర్జా ఒలకబోయడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment