వేషం ఇస్తాం.. వస్తావా?  | Women  Raised Voice Against Tollywood  Casting couch | Sakshi
Sakshi News home page

వేషం ఇస్తాం.. వస్తావా? 

Published Mon, Apr 16 2018 2:09 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Women  Raised Voice Against Tollywood  Casting couch - Sakshi

ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చలో సోనా రాథోడ్‌ వ్యథ విని.. కన్నీరు పెడుతున్న శ్రీరెడ్డి, అపూర్వ, సంధ్య తదితరులు

పగలు అమ్మా అని ఆత్మీయంగా పిలుస్తారు.. రాత్రయితే బొమ్మగా చేసి పక్కలోకి రమ్మంటారు. వేషం కోసం అబ్బాయిల నుంచి డబ్బులు తీసుకుంటారు. అదే అమ్మాయిలు ఇస్తానంటే నువ్వు డబ్బులు ఇవ్వడమెందుకు.. ఒక్కసారి నాతో గడిపితే చాలంటారు. రెడ్‌లైట్‌ ఏరియా ముంబైలోనే కాదు.. సాయంత్రం 6 అయిందంటే ఫిల్మ్‌నగర్‌ వీధుల్లోనూ కనిపిస్తుంది. సినీ ఇండస్ట్రీలో నెగ్గాలంటే పడుకోవాలి...లేదా పడుకోబెట్టాలి.. లేకుంటే అవకాశాలకు ఆస్కారమే ఉండదు..
– జూనియర్‌ ఆర్టిస్టులు, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ల గోడు ఇదీ! 

సాక్ష్యాలతో సహా నిర్మాతల పేర్లు చెబుతాం. అరెస్టు చేసే దమ్ముందా? ట్రాన్స్‌జెండర్‌ను కూడా వదల్లేదు. అవకాశం కోసం వెళ్తే.. నీవు ట్రాన్స్‌జెండర్‌వేనా.. అని బట్టలు విప్పించారు. పడుకుంటే వేషం ఇస్తామన్నారు.
– సోనా రాథోడ్‌ 

హైదరాబాద్: సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్ట్‌లను అంగడి సరుకుగా మార్చేసి వారి జీవితాలతో ఆటలాడుకుంటున్న దారుణాలపై మహిళాలోకం గొంతెత్తింది. ఈ అరాచకాలపై సినీ పరిశ్రమలో ఎవరూ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీసింది. రీల్‌ లైఫ్‌లోనే హీరోలా.. రియల్‌ లైఫ్‌లో కాదా? అంటూ ప్రశ్నించింది. శ్రీరెడ్డి ఉదంతం తర్వాత ఆమెకు మద్దతుగా పలువురు ఆర్టిస్ట్‌లు మీడియా ముందుకు వచ్చారు. వారికి మహిళా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆదివారమిక్కడ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’లపై మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో బహిరంగ చర్చ జరిగింది.

ఇందులో నటీమణులు శ్రీరెడ్డి, అపూర్వ, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్స్‌ సునీతారెడ్డి, సంధ్యానాయుడు, హేమలతో పాటు మహిళా సంఘాల ప్రతినిధులు సంధ్య, దేవి, న్యాయవాదులు, రచయిత్రులు, మహిళా పాత్రికేయులు పాల్గొన్నారు. సినీ రంగంలో జరుగుతున్న అకృత్యాలు ఆపే వరకు ఉద్యమం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. సినీ పెద్దలు ముందుకు వచ్చి తమ సమస్యలపై చర్చించాలని, లేకుంటే లైంగిక వేధింపుల వెనుక ఎవరెవరున్నారో పేర్లతో సహా బయటపెట్టాల్సి వస్తుందని పలువురు ఆర్టిస్ట్‌లు హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎవరేమన్నారంటే.. 

తాత వయసు ఉన్నవారు కూడా.. 
సినిమా ఆర్టిస్టులకు కనీస వేతనాలు రాకుండా బ్రోకర్లే తీసుకుంటున్నారు. సినిమా పెద్దలెవరూ దీనిపై స్పందించడం లేదు. ఆడపిల్ల సమస్యతో రోడ్డు ఎక్కితే కనీసం మీ సమస్య ఏమిటని అడిగే నాథుడే లేడు. పిల్లలు, కుటుంబాన్ని బతికించుకోవడానికి కష్టపడుతుంటే రకరకాల మాటలతో తూట్లు పొడుస్తున్నారు. తాత వయసున్న వారు కూడా తమతో గడపమని అడుగుతున్నారు. 
– అపూర్వ, నటి 

నరకయాతన అనుభవిస్తున్నాం.. 
మా కష్టాలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నాం. అవకాశం కావాలంటే పడుకోవాలంటారు. శ్రమకు తగ్గ కష్టం మాకు కావాలి. సినిమా కంపెనీ 3,500 నుంచి 4,000లు ఇస్తుంటే మధ్యలో కో–ఆర్డినేటర్స్‌ తీసుకుని కేవలం 1,500 మాత్రమే ఇస్తున్నారు. మమ్మల్ని వారు జలగల్లా పీడిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ అయినా మా సమస్యలను పట్టించుకోవాలి.  
– సునీతారెడ్డి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ 

పవన్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు.. 
సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీపై ఓపెన్‌ డిబేట్‌ పెట్టాలి. దీనికి సినిమా రంగంలో ఉన్న పెద్దలు హాజరుకావాలి. పేర్లతో సహా బయటపెడతాం. 30 సర్జరీలు చేస్తే గానీ హీరోలు కాలేని మొహాలు వారివి. పవన్‌కల్యాణ్‌కు ప్యాకేజీ ఇస్తే చాలు. 200 కోట్లతో అమరావతిలో ఇల్లు కడుతున్నా డు. మసాజ్‌కు బెంగాలీ అమ్మాయిలు కావాలి. కానీ మహిళల సమస్యల గురించి వెళ్తే పట్టించుకోలేదు.  
– శృతి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ 


సినీ రంగంలో శ్రమ, లైంగిక, ఆర్థిక, మానసిక దోపిడీ ఎంత తీవ్రంగా ఉన్నాయో వారి అనుభవాలను చూస్తుంటే తెలుస్తుంది. జస్టిస్‌ వర్మ కమిటీ తరహాలో సినిమా రంగంలో జరుగుతున్న అంశాలపై అధ్యయన కమిటీ వేయాలి. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ద్వారానే మహిళా ఆర్టిస్టుల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. వారికి జబ్బు వస్తే ఈఎస్‌ఐ సౌకర్యం లేదు. ఇళ్లు లేవు. వీటన్నింటి సాధనకు సంఘటితం కావాలి. ఇండస్ట్రీలో కో–ఆర్డినేటర్‌ వ్యవస్థను తొలగించాలి.  
– సంధ్య, మహిళ సంఘం నాయకురాలు 

సినీ రంగంలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లపై జరుగుతున్న లైంగిక, ఆర్థిక దాడులపై ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. ఆర్టిస్ట్‌లంతా ఏకమై పోరాటం చేయాలి. ఆర్టిస్ట్‌లపై జరుగుతున్న దాడులపై ప్రత్యేక కమిటీ వేసి లోతుగా విశ్లేషణ జరగాలి.  
– జస్సీ కురైన్, సుప్రీంకోర్టు న్యాయవాది 


మీ మధ్యే చిచ్చు పెట్టే అవకాశం ఉంది
శ్రీరెడ్డి ఉదంతాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. సినీ రంగంలో మహిళలకు భద్రత కల్పించాలి. ప్రస్తుతం సంఘటితం అవుతున్న ఆర్టిస్టుల మధ్య చిచ్చుపెట్టే అవకాశాలు ఉంటాయి. మహిళా సంఘాలకు, ఆర్టిస్టుల మధ్య వైరం పెంచే కుట్రలు కూడా జరిగే అవకాశం ఉంది. వాటన్నింటికి బెదరకుండా నిలబడాలి.  
– దేవి, మహిళా సంఘం నాయకురాలు 

ఎందరో బలవుతున్నారు.. 
ఒక్క సినిమా పూర్తి అయ్యేనాటికి ఎందరో నలిగిపోతున్నారు. మాంసాన్ని అమ్మినట్లు మానాన్ని అమ్మేస్తున్నారు. అలా చేయకుంటే అవకాశాలు రావు. నా మటుకు నేను ఎన్నోసార్లు అవకాశాల కోసం చెయ్యి చాపితే నాతో గడపమని అడిగారు. అలా గడిపా కూడా. అయినా అవకాశాలు ఇవ్వలేదు. చివరకు ఎవరి పేర్లు బయటికి రాకుండా, ఎవరి బట్టలు విప్పకుండా ఆవేదనతో నా బట్టలు నేనే విప్పుకున్నా. ఇలా సినిమా ఇండస్ట్రీలో మోసపోతున్న అమ్మాయిలెందరో ఉన్నారు. ఇలా ఎందరినో వాడుకున్న వాకాడ అప్పారావును ఎవరూ ఎందుకు ప్రశ్నించడం లేదు? ఎందుకంటే తీగ లాగితే డొంక కదులుతుందన్న భయం సినిమా పెద్దల్లో ఉంది. ఫిల్మ్‌నగర్‌ మరో రెడ్‌లైట్‌ ఏరియాగా మారిపోయింది. ఇంత జరుగుతున్నా కనీసం మాట్లాడటానికి కూడా సినిమా పెద్దలు ముందుకు రాకపోవడం బాధాకరం. సినీ రంగంలో ఎవరు గిల్లినా, గిచ్చినా ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. సినిమా హీరోలు కోట్లకు పడగలెత్తడం వెనుక ఎందరో అమ్మాయిల అణగారిన జీవితాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో స్త్రీ శక్తి అంటే ఏంటో చూపిస్తాం.    
– శ్రీరెడ్డి, నటి 


ఆమెకు మద్దతిస్తే ఛాన్స్‌లు ఇవ్వమంటున్నారు.. 
శ్రీరెడ్డికి మద్దతుగా వెళ్తుంటే సినిమా ఛాన్స్‌లు ఇవ్వబోమని బెదిరిస్తున్నట్లు ఆర్టిస్ట్‌ హేమ పేర్కొన్నారు. ‘‘అమ్మాయిలనే కాదు.. ఆంటీలు, 80 ఏళ్ల ముసలి వాళ్లను లైంగికంగా వేధిస్తారు. మా బాధలను అటు తల్లిదండ్రులకు, ఇటు స్నేహితులకు చెప్పుకోలేం’’అని సంధ్యనాయుడు చెప్పారు. ‘‘ఇండస్ట్రీలో మృగాళ్లు పీక్కు తింటున్నారు. తెర మీద సందేశాలు ఇవ్వడమే కానీ తెర వెనుక మృగాళ్ల మాదిరి ప్రవర్తిస్తున్నారు’’అని నాగలక్ష్మి ఆవేదన వ్యక్తంచేశారు. సినిమా రంగం లో ట్రాన్స్‌జెండర్స్‌ను కూడా వదలడం లేదని డ్యాన్సర్‌ చంద్రముఖి గోడు వెళ్లబోసుకున్నారు.

తమ సమస్యలు ఎక్కడ చెప్పుకోవాలో తెలియడం లేదని శ్రీవాణి అన్నారు. తప్పు చేయకపోతే సినీ పెద్దలు ఇప్పటికైనా బయట కు రావాలని శిరీష డిమాండ్‌ చేశారు. ‘‘పవన్‌ కల్యాణ్, శేఖర్‌ కమ్ముల, కత్తి మహేష్‌లు లీగల్‌గా ముందుకువెళ్లాలంటున్నారు. అలా చెప్ప డం మా గొంతు నొక్కేయడమే’’అని తేజస్విని అన్నారు. మహిళలుగా పుట్టడమే నేరమా? సినిమా ఇండస్ట్రీలో బతకడమే కష్టంగా ఉందని నటి జాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement