అమ్మా అంటారు.. రాత్రైతే రూమ్‌కి రమ్మంటారు! | Women Activists Raised Voice Against Tollywood Casting couch | Sakshi
Sakshi News home page

అమ్మా అంటారు.. రాత్రైతే రూమ్‌కి రమ్మంటారు!

Apr 15 2018 7:13 PM | Updated on Aug 28 2018 4:32 PM

Women Activists Raised Voice Against Tollywood  Casting couch - Sakshi

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న నటి శ్రీరెడ్డి, చిత్రంలో పీవోడబ్ల్యూ సంధ్య, నటి అపూర్వ, తదితరులు.

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు సినీ పరిశ్రమలో అడ్డూ అదుపూ లేకుండా సాగుతోన్న లైంగిక వేధింపుల పర్వాలకు చరమగీతం పాడుతామని మహిళాలోకం గర్జించింది. ఇండస్ట్రీలో కాస్టింగ్‌ కౌచ్‌ అంతమయ్యేదాకా పోరాటాన్ని ఆపబోమని ప్రతిజ్ఞచేశారు. వర్కింగ్‌ విమెన్‌కు ఉన్నట్లే పని ప్రదేశంలో తమకూ హక్కులు కల్పించాలని వర్ధమాన నటీమణులు డిమాండ్‌ చేశారు. ‘‘తెలుగు సినీ రంగంలో లైంగిక, ఆర్థిక దోపిడీ’’ పేరుతో ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బహిరంగ చర్చ నిర్వహించారు. మహిళా సంఘాల జేఏసీ, పలు స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హక్కుల కార్యకర్తలు సంధ్య, దేవి, విమల ఇతర ప్రముఖలు, శ్రీరెడ్డి సహా కొందరు వర్ధమాన నటీమణులు, పెద్ద సంఖ్యలో జూనియర్‌ ఆర్టిస్టులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటీమణులు తమ గోడు వెళ్లబోసుకుని కన్నీటిపర్యంతమయ్యారు. హక్కులను సాధించుకునే క్రమంలో అందరం కలిసికట్టుగా పోరాడాలని తీర్మానించారు.

చర్చలో వ్యక్తమైన బాధలు, అభిప్రాయాలివి..
‘‘ఇండస్ట్రీలో కేవలం యువతులపైనే కాదు 80 ఏళ్ల మహిళలపైనా లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయి. సీనియర్‌ ఆర్టిస్టులను ఉదయం అమ్మా అని సంబోదిస్తూనే రాత్రైతే రూమ్‌కి రమ్మని పిలుస్తారు. కమిట్‌మెంట్‌ ఇస్తేనే సినిమాలో క్యారెక్టర్‌ ఇస్తామంటారు. జుగుప్సాకరమైన ఈ విధానం అంతం కావాలి. అప్పటిదాకా మేం పోరాడుతూనే ఉంటాం’

‘‘మాకంటూ ఏ ఉద్యోగాలు లేకే సినిమాల్లో నటిస్తున్నాం. మాకు సమస్యలు వచ్చినప్పుడు ఏ ఒక్క ప్రముఖ హీరో స్పందించరు. వేధింపులు భరించలేని పరిస్థితుల్లోనే మేం బయటికొచ్చాం. మహిళా సంఘాలే మాకు దారి చూపించాలి’’

‘‘వేధింపులకు పాల్పడిన అబ్బాయిలను కర్రతో తరిమానని ఓ ప్రముఖ హీరో చెప్పాడు. అయ్యా.. నువ్వు తరిమిన కుర్రాళ్ల సంగతేంటోగానీ ముందు ఇండస్ట్రీలో జరుగుతున్న రేప్‌లను ఆపే ప్రయత్నం చెయ్యి. సినిమాల్లో పనిచేసేవాళ్లు మహిళలుగా నీకు కనిపించరా’’

‘‘చిన్నాచితకా క్యారెక్టర్లు చేసి కష్టపడి సంపాదిస్తాం. గుర్తింపు కార్డు కోసం లక్షలు ధారపోయాలి. ఐడీకార్డు లేకుంటే దోపిడీ తప్పదు. ఒక్కమాటలో చెప్పాలంటే మా రక్తాన్ని దోచుకుంటున్నారు. న్యాయం జరగడంలేదన్న నిస్పృహలో చాలా సార్లు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది’’

‘‘అమ్మాయిలనే కాదు మేడం.. ట్రాన్స్‌జెండర్లపైనా లైంగిక దాడులు జరుగుతున్నాయి. కమిట్‌మెంట్‌ లేనిదే ఆఫర్లు ఇవ్వరు. చాటింగ్‌ల పేరుతో నిత్యం వేధింపులే’’

‘‘మనల్ని ఒక్క మాట అంటేనే ఉడుక్కుంటాం. అలాంటిది సినీ పరిశ్రమలో అమ్మాయిలు ఇంత భయంకరంగా బతుకుతుండటం బాధాకరం. సమస్యలపై తుదిదాకా పోరాటం చేస్తాం. ఇవి ఒక్కరోజులో అంతమైపోయే సమస్యలు కావు. న్యాయపరంగానూ పోరాడాలి. సంఘటిత రంగాల్లో మహిళల మాదిరిగా సినిమాల్లో పనిచేస్తోన్న మహిళలకు కూడా పని ప్రదేశంలో హక్కులు కల్పించాలి. ఆ హక్కుల పరిరక్షణ నిత్యం జరగాలి’’

‘‘అవకాశాల కోసం ఫోన్లు చేస్తే బూతులు తిడతారు. న్యూడ్‌ ఫొటోలు అడుగుతారు. శారీరకంగా వాడుకుని, చాన్సులు లేవుపొమ్మంటారు. ఆఫర్ల ఆశ చూపి మమ్మల్ని దారుణంగా హింసిస్తున్నారు. సాక్ష్యం కావాలంటే ఎలాంటి మెడికల్‌​ టెస్టులైనా చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తెరవెనుక సాగుతోన్న వ్యవహారాలకు చెక్‌ పెట్టాల్సిందే. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. మాకు ఏవైనా ఉపాధి అవకాశాలు చూపించాలి’’

‘‘టాలీవుడ్‌లో జరుగుతోన్న లైంగిక వేధింపులపై కేసులు పెడితే పోలీస్‌ స్టేషన్లు చాలవు. కేసీఆర్, కేటీఆర్, కవితలు మా బాధలు వినాలి. ఎవరో ఒకరు రియల్‌ హీరోలా మమ్మల్ని ఆదుకోవాలి’’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement