మహిళల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వివక్ష చూపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ధ్వజమెత్తారు.
హైదరాబాద్: మహిళల పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు వివక్ష చూపుతున్నారని తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ధ్వజమెత్తారు. కేబినెట్‌లో మహిళలకు చోటు కల్పించలేదని, తెలంగాణ ఏర్పడి ఏడాది గడిచినా మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయకుండా తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ రెండురాష్ట్రాలకు ఉమ్మడి మహిళాకమిషన్ కొనసాగుతోందన్నారు.
శుక్రవారం గాంధీభవన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం కుంభకోణాల మయం కాగా, రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మహిళల పట్ల వివక్షను చూపుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పలువురికి మంత్రి పదవులిచ్చి మహిళలకు పెద్దపీట వేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా మంత్రిపదవి కల్పించలేదన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా మహిళలకు కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శించారు. ఎన్నికలపుడు మహిళలను పొగిడిన కేసీఆర్ ఇప్పుడు మహిళలకు తగిన గుర్తింపునివ్వడం లేదన్నారు.
ప్రజలు తిరగబడే పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ర్టంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎన్నికలకు ముందు అవినీతిరహిత పాలనను అందిస్తామని చెప్పిన నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక కుంభకోణాలు చేసి అవినీతిమయమై పోయిందన్నారు.