మహిళకు  మరింత రక్ష! | Womens Police Volunteers System Into Villages | Sakshi
Sakshi News home page

మహిళకు  మరింత రక్ష!

Published Fri, Dec 28 2018 1:00 AM | Last Updated on Fri, Dec 28 2018 1:00 AM

Womens Police Volunteers System Into Villages - Sakshi

మహిళల భద్రత విషయంలో రాష్ట్ర పోలీస్‌ శాఖ నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోంది. చిన్నారులు, యువతులపై లైంగిక వేధింపుల నియంత్రణకు ప్రతీ పాఠశాల, కాలేజీల్లో ప్రత్యేక పాఠాలు బోధించి పరీక్షలు కూడా పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ పొందిన మహిళా భద్రతా విభాగం ఉన్నతాధికారులు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి లైంగిక వేధింపులకు పాల్పడితే చేపట్టే చర్యలు, సెక్సువల్‌ ఎడ్యుకేషన్, చట్టాలు తదితరాలపై ఈ ఆన్‌లైన్‌లో కోర్సు నిర్వహిస్తారు. ఇది పూర్తి చేసిన విద్యార్థులకు పరీక్ష కూడా పెట్టనున్నారు. ఇందులో పాసైన వారికి సర్టిఫికెట్‌ సైతం అందించాలని నిర్ణయించారు. దీంతో బాల్యం నుంచే చట్టాలపై అవగాహన ఉంటుందని మహిళా భద్రత విభాగం భావిస్తోంది.  – సాక్షి, హైదరాబాద్‌

ఆఫీసుల్లో అంతర్గత కమిటీలు 
రాష్ట్రంలోని ప్రతీ ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో మహిళా ఉద్యోగులు, సిబ్బంది ఎదుర్కొంటున్న వేధింపులు, లైంగిక వేధింపులను నియంత్రించేందుకు అంతర్గత కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీస్‌శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మహిళా భద్రత విభాగం చర్యలు చేపట్టింది. ముందుగా పోలీస్‌శాఖలోని అన్ని విభాగాలు, జిల్లా కార్యాలయాలు, ప్రత్యేక యూనిట్లలో ‘ఇంటర్నల్‌ కంప్లైంట్‌ కమిటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఎగైనెస్ట్‌ సెక్సువల్‌ హరాస్‌మెంట్‌’ పేరుతో ఏర్పాటుచేసింది. ఆయా విభాగాల్లో సీనియర్‌ మహిళా ఉద్యోగి హెడ్‌ ఆఫ్‌ కమిటీగా ఉండటంతో పాటు మరో నలుగురు ఉద్యోగులు సభ్యులుగా ఉండనున్నారు. ఇదే రీతిలో రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ విభాగాల్లోని ప్రతీ కార్యాలయంలో ఈ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా భద్రతా విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. మండలం, డివిజన్, జిల్లా ఇలా మూడుస్థాయిల్లో ప్రతీ కార్యాలయంలో కమిటీ పనిచేస్తుందని స్పష్టంచేశారు. వేధింపులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, సిబ్బంది నేరుగా ఈ కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని, వీరి ఫిర్యాదు ఆధారంగా సంబంధిత కమిటీ విచారణ జరుపుతుందని వెల్లడించారు. అలాగే తీవ్రమైన ఫిర్యాదులను సంబంధిత పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు పంపించేందుకు చర్యలు తీసుకునేలా కమిటీలు పనిచేస్తాయన్నారు. దీనివల్ల పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు లేకుండా చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ఇక రెండో దఫాలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు సంస్థలు, కంపెనీల్లో ఈ కమిటీలను ఏర్పాటు చేసే బాధ్యత మహిళా భద్రత విభాగం చేపట్టనుంది. కంపెనీలు, సంస్థలకు మహిళా భద్రతా విభాగం నేరుగా లేఖలు రాసి ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టబోతోంది. సంబంధిత కంపెనీల్లోని హెచ్‌ఆర్, అడ్మిన్‌ విభాగాల్లోని మహిళా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఈ కమిటీలను ఏర్పాటు చేసిన లైంగిక వేధింపుల నియంత్రణకు కృషి చేయనున్నారు.  

గ్రామాల్లో మహిళా వలంటీర్లు 
గ్రామాల్లోని బాలికలు, యువతులు, మహిళలపై లైంగిక వేధింపుల నియంత్రణ కోసం గ్రామ స్థాయిలో ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చేందుకు పోలీస్‌శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం మధ్యప్రదేశ్‌లో విజయవంతంగా నడుస్తున్న మహిళా పోలీస్‌ వలంటీర్ల వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తోంది. గద్వాల, నల్లగొండ జిల్లాలను పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా తీసుకొని ప్రతీ గ్రామంలో మహిళా పోలీస్‌ వలంటీర్లను నియమించాలని మహిళా భద్రతా విభాగం నిర్ణయించింది. ఇందుకోసం ఇంటర్‌ పాసైన 21 ఏళ్ల అమ్మాయిలకు అవకాశం కల్పించాలనుకుంటున్నారు. గ్రామాల్లో జరిగే మహిళా వేధింపుల నేరాలను సంబంధిత స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వీరు చేరవేయాల్సి ఉంటుంది. ఈ సమాచారంతో పోలీస్‌ అధికారులు కేసులు నమోదు చేయడం, వేధింపులను నియంత్రించడం సులభతరం కానుంది. 

వలంటీర్లుగా ఎవరు? 
రాజకీయ పార్టీల కార్యకర్తలు, నాయకులుగా చలామణి అవుతున్నవారు, నేర చరిత్ర కలిగిన వారు ఈ వలంటీర్‌ పోస్టులకు అనర్హులని పోలీస్‌ శాఖ తెలిపింది. వలంటీర్లుగా పనిచేసే యువతులకు నెలకు రూ.500 గౌరవ వేతనం కింద అందించనున్నట్లు వెల్లడించింది. ప్రతీ మూడు, ఆరు నెలలకోసారి వేధింపుల నియంత్రణలో పనితీరును బట్టి రూ.10 వేలు (ప్రథమ), రూ.5 వేలు (ద్వితీయ), రూ.3 వేలు (తృతీయ) బహుమతులుగా నగదును కూడా అందించనున్నట్లు వివరించింది. తెలంగాణ పోలీస్‌–స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో ఈ మహిళా వలంటీర్ల వ్యవస్థ పనిచేస్తుందని, అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుంటూ నేరాల నియంత్రణ, మహిళా వేధింపుల కట్టడికి కృషి చేస్తుందని ఉన్నతాధికారులు వెల్లడించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement