
సాక్షి, హైదరాబాద్: పల్నాడులో అక్రమ మైనింగ్‌తో కోట్ల రూపాయల మేర సీనరేజీ చార్జీలను ఎగవేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జాతి సంపదను దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకోబో మని హెచ్చరించింది. గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఇదే న్యాయస్థానం 2015లోనే ఆదేశాలిచ్చినా అమలు చేయకుండా అధికారులు నిద్రపోయారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాము సీబీఐ, కాగ్‌లను ప్రతివాదు లుగా చేస్తే అధికారులు ఇప్పుడు మేల్కొని ఉరుకులు పరుగులు పెడుతున్నారని ధర్మా సనం ఘాటుగా వ్యాఖ్యానించింది. అక్ర మంగా ఎంత ఖనిజాన్ని తవ్వేశారు? ఎంత మొత్తంలో పన్నులు, సీనరేజీ ఎగవేశారు? తదితర అంశాలపై ఆడిట్ జరిగి తీరాల్సిం దేనని, ఈ విషయంలో వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. అక్రమ మైనిం గ్ చేసే అసలు పెద్దలను వదిలేసి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను బలి చేయడం ప్రభుత్వ శాఖల్లో అలవాటుగా మారిపోయిం దని వ్యాఖ్యానించింది. ఇది ఓ పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోందని పేర్కొంది.
వాదనలు విన్నాక చట్టప్రకారం చర్యలు
తాము ఆదేశాలు ఇచ్చిన తరువాత కొన్ని చిన్న తరహా కంపెనీలపై పెనాల్టీ, ప్రాసిక్యూషన్‌కు చర్యలు తీసుకుంటామంటూ అధికారులు హడావుడి చేయడాన్ని హైకోర్టు తప్పు బట్టింది. ముందు ఆ కంపెనీలకు నోటీసులిచ్చి వాటి వాదనలు విన్న తరువాత చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. అప్పటివరకు పెనాల్టీ, ప్రాసిక్యూషన్ విషయంలో ముందుకెళ్లవద్దని గనులశాఖ అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన హైకోర్టు ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.
గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్థానిక టీడీపీ నేతలతో కలిసి పిడుగురాళ్ల, నడికుడి, కేశానుపల్లి, దాచేపల్లి, కొండమోడులతోపాటు మరికొన్ని గ్రామాల్లో అనుమతులు లేకుండా య«థేచ్ఛగా లైమ్‌స్టోన్ తవ్వకాలు నిర్వహించడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ పిడుగురాళ్లకు చెందిన కె.గురవాచారి 2015లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం అక్రమ మైనింగ్‌ను నిలుపుదల చేయించడంతోపాటు బాధ్యులను గుర్తించి అక్రమ మైనింగ్ వల్ల కలిగిన నష్టాన్ని వసూలు చేయాలంటూ ఆదేశించింది.
అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయడం లేదని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు లైమ్‌స్టోన్ తవ్వకాలను కొనసాగిస్తూనే ఉన్నారని, రూ.31 కోట్ల మేర ప్రభుత్వానికి పన్నులు, సీనరేజీ చార్జీలు ఎగవేశారంటూ మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి 2016లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై పలుమార్లు విచారణ జరిపిన హైకోర్టు తాజాగా మరోసారి విచారించింది.