దళితుల అభ్యున్నతికి ప్రాధాన్యం : డిప్యూటీ సీఎం రాజయ్య
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో దళితుల సమగ్రాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనిఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య తెలిపారు. ఆదివారం తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మాదిగ ప్రజా ప్రతినిధులకు ఆత్మీయ సన్మానం జరిగింది. ఈ సభలో రాజయ్య మాట్లాడుతూ, దండోరా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి తాను అందులో భాగస్వామినని చెప్పారు. ఉప ముఖ్యమంత్రిగా మాదిగల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి కేసీఆర్ చేపట్టిన ఉద్యమం వరకు అమరులైనది దళిత బిడ్డలేనన్నారు.
ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ, మాదిగ దండోరా ఉద్యమం సామాజిక ఉద్యమమన్నారు. కానీ రాజకీయ నిర్ణయం తీసుకోవడంతో ఆదరణ కోల్పోయిందన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూర్ రమేశ్ మాట్లాడుతూ, భాస్కర్ నాయకత్వంలో జరిగే ఈ మలిదశ దండోరా ఉద్యమం మాదిగల ప్రయోజనాలు నెరవేర్చాలన్నారు. ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజ్, సంపత్‌కుమార్ మాట్లాడుతూ, మాదిగ ప్రజాప్రతినిధులంతా సంక్షేమమే ఎజెండాగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎమ్మెల్యేలు కాల యాదయ్య, రసమయి బాలకిషన్, నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జీవ, ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాపయ్య, అధికార ప్రతినిధి సురేందర్, దేవయ్య పాల్గొన్నారు.