మెడికల్‌షాపు యజమానే డీలరు
► అతను ఏ మందులు పంపిస్తే అవే..నాణ్యత పరిశీలించే దిక్కులేదు
► కాలం చెల్లిన మందులతో ఇబ్బంది పడుతున్న కార్మికులు
► జేబులు నింపుకుంటున్న అధికారులు
కొత్తగూడెం(ఖమ్మం) : సింగరేణి పరిధిలోని ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు పంపిణీ చేసే మందులను లోకల్‌గా కొనుగోలు చేస్తున్నారు. ఇందుకు కొత్తగూడెంకు చెందిన ఓ మెడికల్‌షాపునకు డీలర్‌షిప్ ఇచ్చారు. అతను ఏ మందులు ఇస్తే అవే మహాభాగ్యం. అవి ఏ కంపెనీ మందులు.. ఎన్నిరోజులు పనిచేస్తారుు.. నాణ్యమైనవేనా.. అని పరిశీలించే నాథుడే లేడు. నాణ్యతలేని, ఎక్స్‌పైరీ దగ్గరపడిన మందులు కావడంతో జబ్బులు తగ్గక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.
ఇక రోగులకు ట్యాబ్లెట్లు షీట్‌లు కాకుండా ముక్కలుగా చేసి ఇవ్వడంవల్ల దానిపై ఉన్న ఎక్స్‌పైరీ డేట్ కనిపించదు. అసలు అవి ఎంతకాలం పనిచేస్తారుు.. ఎప్పటివరకు వాడుకోవచ్చో తెలుసుకోలేని పరిస్థితి. మందులు వాడినా రోగాలు నయ కాకపోవడంతో ఆస్పత్రులకు వచ్చే వారు వాటిని తీసుకోవడానికి సైతం వెనకాడుతున్నట్లు సమాచారం. దీంతో కొన్ని రోజులు చూసి కాలపరిమితి ముగియడంతో సిబ్బంది ఆ మందులను పడేసి తిరిగి మళ్లీ ఇండెంట్ పెట్టి తెపిస్తున్నారు.
కమీషన్లకు మరిగిన అధికారులు కావాలనే నాసిరకం, ఎక్స్‌పైరీ దగ్గర పడిన మందులు కొనుగోలు చేసి కార్మిక కుటుంబాల జీవితాలతో చెలగాటమాడుతున్నారని, దీనిపై సింగరేణి విజిలెన్స్ విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు.