మెడికల్ అన్‌ఫిట్ దందా
Published Mon, Aug 22 2016 2:53 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
సింగరేణి రిటైర్డ్ క్లర్క్‌పై పోలీసు కేసు
దళారుల అవతారమెత్తిన నాయకులు
గుట్టు రట్టు కావడంతో లీడర్లలో మొదలైన గుబులు
బెల్లంపల్లి(ఆదిలాబాద్) : బెల్లంపల్లి ఏరియా కేంద్రంగా మెడికల్ అన్‌ఫిట్ దందా బయటపడింది. సింగరేణి రిటైర్డ్ క్లర్క్‌పై కేసు నమోదు కావడంతో అందులో భాగస్వామ్యం ఉన్న దళారులు, చోటా మోటా లీడర్లలో వణుకు మొదలైంది. బెల్లంపల్లి అశోక్‌నగర్‌బస్తీకి చెందిన సింగరేణి రిటైర్డ్ క్లర్క్ మహ్మద్ అబ్దుల్‌సలీం శ్రీరాంపూర్, మంచిర్యాల, రామకృష్ణాపూర్, మందమర్రి, బెల్లంపల్లి, తాండూర్ తదితర కోల్‌బెల్ట్ ప్రాంతాలకు చెందిన సుమారు 23 మంది కార్మికుల వద్ద ఒక్కో కేసుకు రూ.15 లక్షల డిమాండ్‌తో ఒప్పందం చేసుకుని అడ్వాన్స్‌గా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల చొప్పున రూ. కోటి 61 లక్షల 90వేలు వసూలు చేసినట్లు తెలిసింది. బెల్లంపల్లి బూడిదగడ్డబస్తీకి చెందిన కార్మికుడు గోమాస రాజం తనకు తెలిసిన కార్మికుల నుంచి మెడికల్ అన్‌ఫిట్ కోసం రూ.15లక్షలు వసూలు చేసి అబ్దుల్‌సలీంకు అప్పగించాడు. పని చేయించుకుండా సలీం సతాయిస్తుండడంతో రాజం శుక్రవారం స్థానిక వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.
అందినకాడికి దండుకున్నారు
ఏరియాకు చెందిన కొన్ని ప్రధాన కార్మిక సంఘాలలో పని చేస్తున్న చోటా, మోటా నాయకులు కొన్నాళ్ల నుంచి రిటైర్డ్‌మెంట్‌కు దగ్గర ఉండి, పని భారంతో సతమతమవుతున్న సీనియర్ కార్మికులను మెడికల్ అన్‌ఫిట్ చేయిస్తానని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు ప్రధాన కార్మిక సంఘాలలో పని చేస్తున్న క్షేత్ర స్థాయి నాయకులు దళారుల అవతారమెత్తి వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. అరుుతే కొందరు రిటైర్డ్ క్లర్క్‌తో కుమ్ముక్కై అక్రమ దందాకు తెరతీశారు. మరికొందరు ఆయా సంఘాలకు చెందిన అగ్ర నాయకులతో, ఇంకొందరు కొత్తగూడెంకు చెందిన కొందరు అధికారులు, సింగరేణి వైద్యులతో పరిచయాలు ఉన్నట్లు ప్రచారం చేసుకుని అందిన కాడికి దండుకున్నట్లు తెలుస్తోంది.
ఆస్తులు కూడబెట్టుకున్న లీడర్లు
మెడికల్ అన్‌ఫిట్ దందాతో కొందరు లీడర్లు స్థిర చరాస్తుల ను కూడబెట్టుకుంటుండగా వారితో భాగస్వామ్యం ఉన్న చోటా లీడర్లు దర్జాను వెలగబోస్తున్నారు. వసూలు చేసిన డబ్బులను కొందరు రియల్‌ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టగా, మరికొందరు వ్యవసాయ భూములు కొనుగోలు చేశారు. ఇంకొందరు బ్యాంకుల్లో డిఫాజిట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రిటైర్డ్ క్లర్క్‌పై పోలీసు కేసు నమోదు కావడంతో దందా నిర్వహించిన చోటా లీడర్లు, దళారులకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వసూళ్లు రూ.5 కోట్లకు పైమాటే..!
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం సీనియర్ కార్మికులు ఏళ్ల తరబడి నుంచి ఎదురుచూస్తున్నారు. కొడుకులు, అల్లుళ్లకు ఉద్యోగం ఇప్పించి రిటైర్డ్‌మెంట్ తీసుకోవాలని ఆశిస్తున్నారు. ఆ ఆశే దళారులు, చోటా లీడర్లకు వరంగా మారింది. బెల్లంపల్లి రీజియన్‌లో కార్మికుల నుంచి సుమారు రూ.5 కోట్లకుపైగా వసూలు చేసినట్లు ప్రచారం సాగుతోంది. కొంతమందికి మెడికల్ అన్‌ఫిట్ కావడంతో నమ్మకం కుదిరి మిగతా వారు దళారులకు లక్షలు ముట్టజెప్పి వెంట తిరుగుతున్నారు.
Advertisement
Advertisement