చురుకుగా సాగుతున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు
సాక్షి, కొత్తగూడెం: కలెక్టరేట్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. జిల్లా ఆవిర్భావం తర్వాత కొత్త కలెక్టరేట్ నిర్మాణం కోసం స్థలం ఎంపికలో జాప్యం జరిగింది. అయితే ఆ ప్రక్రియ పూర్తి కావడంతో పనులు వేగంగా నడుస్తున్నాయి. పాల్వంచ (నవభారత్) లోని వెంకటేశ్వరస్వామి ఆలయం – కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్ మధ్య కలెక్టర్ కార్యాలయం నిర్మించనున్నారు. సర్వే నంబరు 405లో ఉన్న మైనింగ్ కళాశాలకు చెందిన 25 ఎకరాలను గత నవంబర్‌లో పాల్వంచ తహసీల్దారు ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించారు.
గుట్టలా ఉండే ఈ ప్రాంతాన్ని మూడు నెలల కాలంలో చదును చేశారు. కలెక్టరేట్ ప్రధాన కార్యాలయానికి సంబంధించి కాంక్రిట్ పుట్టింగ్ పనులు పూర్తి కాగా, కాలమ్స్(పిల్లర్లు) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కలెక్టరేట్ పక్కనే ఆడిటోరియం కూడా నిర్మించనున్నారు. 1.50 లక్షల చదరపు అడుగులతో నిర్మించే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ 17 ఎకరాల విస్తీర్ణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ మొత్తం 36 శాఖల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
14 నెలలకు స్పష్టత..
జిల్లా ఏర్పడి 14 నెలలు గడిచిన తరువాత కలెక్టరేట్ నిర్మాణంపై స్పష్టత వచ్చింది. రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు ప్రస్తుత స్థలంలో కలెక్టరేట్ నిర్మాణం ప్రారంభమైంది. వచ్చే శ్రీరామనవమి రోజున సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని సమాచారం. తెలంగాణ ఏర్పడిన తర్వాత పాలన వికేంద్రీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 10 జిల్లాలను 31 జిల్లాలుగా విభజించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కొత్తగూడెం కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో వివిధ శాఖల కార్యాలయాలను సింగరేణి భవనాలలో ఏర్పాటు చేశారు.
అయితే నూతనంగా ఏర్పడిన జిల్లాలతో పాటు మరికొన్ని పాత జిల్లాలకు కలిపి మొత్తం 26 జిల్లాల్లో కలెక్టరేట్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉంచాలనే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణాల మాస్టర్ ప్లాన్‌లను సిద్ధం చేసింది. 9 జిల్లాల్లో 1.50 లక్షల చదరపు అడుగులతో, 17 జిల్లాల్లో 1.20 లక్షల చదరపు అడుగులతో భవనాలు నిర్మించేలా మార్గదర్శకాలను సూచించింది.
ఇందుకోసం 17 ఎకరాలకు పైగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించింది. అయితే ఈ ప్రతిపాదనలు వచ్చిన ఏడాది తర్వాత కానీ కలెక్టరేట్‌ల నిర్మాణం పలు జిల్లాలో ప్రారంభం కాలేదు. నూతన జిల్లాల ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్, సిరిసిల్ల, సిద్దిపేటలో కలెక్టరేట్‌ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
పలు స్థలాల పరిశీలన.. చివరకు పాల్వంచలో
జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణానికి అధికారులు, ప్రజాప్రతినిధులు పలు స్థలాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. ప్రధానంగా కొత్తగూడెం నుంచి ఇల్లందు క్రాస్ రోడ్డుకు నడుమ ఉన్న స్థలం, ఆ తర్వాత కొత్తగూడెంలోని రామవరం వద్ద ఉన్న స్థలాలపైనే ప్రధానంగా చర్చ జరిగింది. ఈ స్థలాల ఎంపిక విషయంలో ఏడాది దాటినా సందిగ్ధం వీడకపోవడంతో మధ్యే మార్గంగా కొత్తగూడెం – భద్రాచలం రోడ్డులో ప్రభుత్వ మైనింగ్ కళాశాల, నవభారత్ వెంకటేశ్వర స్వామి దేవాలయం మధ్యలో ఉన్న 25 ఎకరాల స్థలం రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీనిపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ ఈ ప్రాంతంలో పర్యటించి కలెక్టరేట్ నిర్మాణానికి అనువుగా, జిల్లాలోని అన్ని మండలాల వారికి అందుబాటులో ఉంటుందని నివేదిక సమర్పించడంతో పనులు వేగవంతమయ్యాయి.
17 ఎకరాల్లో నిర్మాణం...
ప్రభుత్వం ప్రతిపాదించినట్లు 1.50 లక్షల చదరపు అడుగులతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణం 17 ఎకరాలలో జరగనుంది. అంతే కాకుండా 36 శాఖల కార్యాలయ భవనాలు అన్ని ఒకేచోట ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. కలెక్టర్ కార్యాలయం, రెసిడెన్సీలను 6 వేల చదరపు అడుగులలో, జాయింట్ కలెక్టర్ రెసిడెన్సీని 3వేల చదరపు అడుగులలో, జిల్లా రెవెన్యూ అధికారి రెసిడెన్సీని 2,500 చదరపు అడుగులలో నిర్మించనున్నారు. 36 శాఖల కార్యాలయాలు, వాటికి కాన్ఫరెన్స్ హాళ్లు, ఇతర అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. 148 మంది అధికారులకు, సిబ్బందికి 1500 చదరపు గజాలలో క్వార్టర్లలను నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది.
పనులు వేగవంతమయ్యాయి
పాల్వంచ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద చదును చేసిన స్థలంలో కొత్త కలెక్టరేట్ పనులు వేగంగా నడుస్తున్నాయి. శంకుస్థాపనకు సంబంధించి ఖచ్చితమైన తేదీ ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు. ఆ కార్యక్రమం ఎప్పుడు చేసేందుకైనా సరే సిద్ధంగా అన్ని ఏర్పాట్లు చేశాం.
-రాంకిషన్, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment