
శాంతి భద్రతలే ప్రగతిపథ వారథులు
కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు
సాక్షి, హైదరాబాద్: దేశం ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే శాంతి భద్రతల పరిరక్షణ అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు పేర్కొన్నారు. సీమాంతర ఉగ్రవాదం, డ్రగ్స్ అక్రమ రవాణా, దొంగ నోట్ల వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పటిష్టమైన భద్రత ఉండాలని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ విభాగం, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకే)ల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘జాతీయ భద్రతపై యువ సమ్మేళనం’అనే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఇక ఎంతో కాలం భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండబోదని, దేశం పురోగమించడానికి ఇదే మంచి సమయమని పేర్కొన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల వయసు లోపు వారేనని, ఈ యువత వృద్ధాప్యం పొందేలోపు మన దేశం సంపన్న దేశంగా ఆవిర్భవించాలని ఆకాంక్షించారు. ప్రతి పౌరుడిని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతోనే కేంద్రం ప్రజాసంక్షేమ కార్యక్రమాలను రూపొందిస్తోందని చెప్పారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని చెప్పారు. నెహ్రూ యువక కేంద్ర సంఘటన్ వైస్ చైర్మన్ శేఖర్‌రావు, యువకులు, విద్యార్థులు, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.