కార్మిక సంక్షేమం కోసం దివంగత...
- వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నర్ర భిక్షపతి
పటాన్‌చెరు: కార్మిక సంక్షేమం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషిని కార్మికులు ఎప్పటికీ మరువలేరని వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం రాష్ర్ట అధ్యక్షుడు నర్ర భిక్షపతి పేర్కొన్నారు. మేడే సందర్భంగా పారిశ్రామిక వాడలోని సీఎస్‌సీ వెలికాన్, సీఎంఎస్‌టూల్స్, మైక్రోవేవ్స్ పరిశ్రమల్లో వైఎస్సార్ సీపీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో జెండాలు ఎగురవేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న భిక్షపతి మాట్లాడుతూ కార్మిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు. కార్మిక చట్టాలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు. కార్మిక చట్టాలు యాజమాన్యాల చుట్టాలుగా మారుతున్నాయని విమర్శించారు.
అనేక పరిశ్రమల్లో కాంట్రాక్టు కార్మికులకు పనికి తగిన వేతనం దొరకడం లేదన్నారు. చాలీచాలని జీతాలతో కాంట్రాక్టు కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు వైఎస్సార్‌సీపీ నిరంతరం కృషి చేస్తుందన్నారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను అమలు చేయని యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలన్నారు.