పాల్వయి మృతి పట్ల వైఎస్ జగన్ దిగ్బ్రాంతి
హైదరాబాద్: కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి హఠాన్మరణం పట్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.
మరోవైపు పాల్వయి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పాల్వాయి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్టాండింగ్ కమిటీ సమావేశానికి పాల్వాయితోపాటు కులుమనాలి వెళ్లిన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అలాగే తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్.... పాల్వాయి గోవర్దన్ రెడ్డి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి ,సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే మనస్తత్వం గల పాల్వాయి ఐదు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం రాజ్యసభ సభ్యునిగా ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేసారని అన్నారు. ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఎంతో చురుకుగా కార్యక్రమాలలో పాల్గొనేవారన్నారు. పాల్వాయి ఆత్మకు ఆ భగవంతుడు శాంతి చేకూర్చాలని ,వారి కుటుంబ సభ్యులకు స్వామిగౌడ్ సానుభూతి తెలిపారు.
కాగా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పాల్వాయి గోవర్దన్ రెడ్డి పార్దీవ దేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తరలించింది. అక్కడ పాల్వాయి అధికార నివాసంలో కొద్దిసేపు భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అక్కడే ఏఐసీసీ నాయకులు సంతాపం ప్రకటించి నివాళులు అర్పించనున్నారు. ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు తరలిస్తారు.