
నేటి నుంచి వరంగల్‌లో జగన్ ప్రచారం
- 19 వరకు లోక్‌సభ సెగ్మెంట్‌లో పర్యటన
- తొలిరోజు తొర్రూరులో సభ: పొంగులేటి
సాక్షి ప్రతినిధి, వరంగల్: వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక లో పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌కు మద్దతుగా ప్రచారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లాకు రానున్నారు. వరుసగా నాలుగు రోజులపాటు వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. ప్రధాన కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం బహిరంగ సభ నిర్వహించేలా వైఎస్సార్‌సీపీ కార్యాచరణ రూపొందించింది.
వైఎస్ జగన్ సోమవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి 10 గంటలకు పాలకుర్తి చేరుకుంటారని పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం తెలిపారు. తొలిరోజు తొర్రూరులో బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా పరకాల, వరంగల్, స్టేషన్‌ఘన్‌పూర్‌లో సభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు, వైఎస్సార్ అభిమానులు భారీగా పాల్గొని జగన్ ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని కోరారు.
పర్యటన సాగేదిలా..: తొలిరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జగన్ ప్రచారాన్ని ప్రారంభిస్తారు. జఫర్‌గఢ్ మండల కేంద్రం మీదుగా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి రాయపర్తి మీదుగా తొర్రూరు చేరుకుంటారు. సాయంత్రం అక్కడ ప్రచార సభలో ప్రసంగిస్తారు. అనంతరం ఇల్లందు, మామునూరు మీదుగా హన్మకొండకు చేరుకుంటారు. 17న పరకాల నియోజకవర్గం ఆత్మకూరులో ప్రచారం మొదలవుతుంది. శాయంపేట, రేగొండ మీదుగా భూపాలపల్లికి చేరుకుంటారు. అక్కడ ప్రచారం ముగించి సాయంత్రం పరకాల వెళ్లి బహిరంగ సభలో పాల్గొంటారు.
18న పరకాల నియోజకవర్గం సంగెం, గీసుగొండ మండలాల్లో ప్రచారం చేస్తారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో జరగనున్న బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 19న హన్మకొండ, కాజీపేట మీదుగా ధర్మసాగర్‌కు చేరుకుంటారు. అక్కడ్నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌లో జరిగే ఎన్నికల సభలో ప్రసంగిస్తారు. ఇదే నియోజకవర్గంలోని రఘునాథపల్లి మీదుగా హైదరాబాద్‌కు చేరుకుంటారని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. నల్లా సూర్యప్రకాశ్‌కు ప్రజల్లో మంచి స్పందన వస్తోందని చెప్పారు.