హుజూర్‌నగర్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మృతిచెందిన వైఎస్సార్ అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల ఈనెల 21న జిల్లాలో చేపడుతున్న పరామర్శయాత్రను జయప్రదం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఎర్నేని వెంకటరత్నంబాబు కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్సార్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు పేద, మధ్యతరగతి, బడుగు, బలహీనవర్గాలకు లబ్ధిచేకూర్చాయన్నారు. ఆయన సంక్షేమ పథకాలవల్ల లబ్ధిపొంది, ఆయనపై మమకారం పెంచుకున్న లక్షలాదిమంది ప్రజలు వైఎస్సార్ మరణాన్ని జీర్ణించుకోలేకపోయారన్నారు. ఆయన అభిమానులుగా ఉండి మృతిచెందిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్సార్ కుమార్తె షర్మిల పరామర్శయాత్ర చేపట్టిందన్నారు. ఈనెల 21న ప్రారంభమయ్యే పరామర్శయాత్ర దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో కొనసాగుతుందన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ పరామర్శయాత్రకు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో ఆ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, పోతుల జ్ఞానయ్య, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, కస్తాల ముత్తయ్య, మట్టారెడ్డి, పిచ్చిరెడ్డి, జడ రామకృష్ణ, సాముల ఆదినారాయణరెడ్డి, మందా వెంకటేశ్వర్లు, గండు శ్రీను, బత్తిని సత్యనారాయణ, గొట్టెముక్కల రాములు తదితరులు పాల్గొన్నారు.