నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర | YS Sharmila's Paramarsa Yatra in Mahabubnagar from Dec 8 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర

Published Mon, Dec 8 2014 12:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర - Sakshi

నేటి నుంచి షర్మిల పరామర్శ యాత్ర

* మహబూబ్‌నగర్ జిల్లాలో ఐదురోజుల పాటు సాగనున్న యాత్ర
* 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల పర్యటన


సాక్షి, హైదరాబాద్: మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేక  మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి ‘పరామర్శ యాత్ర’కు శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణలో తొలి విడతలో భాగంగా మహబూబ్‌నగర్  జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో 21 కుటుంబాలను షర్మిల పరామర్శించి, వారికి జగన్ అండగా ఉన్నారన్న భరోసా ఇవ్వనున్నారు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్ర జిల్లాలోని 13 నియోజకవర్గాల మీదుగా 921 కిలోమీటర్ల మేర సాగనుంది.
 
యాత్ర సాగుతుందిలా...
 సోమవారం ఉదయం 9 గంటలకు లోటస్‌పాండ్‌లోని నివాసంలో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించి అనంతరం షర్మిల.. పరామర్శ యాత్ర ప్రారంభిస్తారు. హైదరాబాద్ నుంచి నేరుగా కల్వకుర్తి నియోజకవర్గానికి చేరుకుంటారు. బ్రాహ్మణపల్లి గ్రామంలో జిల్లా నాయకులు షర్మిలకు స్వాగతం పలుకుతారు. అనంతరం మాడ్గుల మండలంలోని ఇర్విన్ గ్రామ పరిధిలోని రెడ్డిపురంలో వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన జె.రాయపురెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడ్నుంచి తలకొండపల్లి మండలం దేవుని పడకల్ గ్రామంలో తుమ్మల నర్సింహ కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత అదే మండలంలోని వెల్జాలలో ఎస్.అంజమ్మ కుటుంబాన్ని పరామర్శించి కల్వకుర్తి చేరుకుంటారు. అక్కడ వైఎస్ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారు. రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో పరామర్శ యాత్ర కొనసాగిస్తారు. 12వ తేదీ వరకు జిల్లాలో పరామర్శ యాత్ర, వైఎస్ విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాలు సాగుతాయి. 12న షాద్‌నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు మండలం మల్లాపూర్‌లో పరామర్శతో యాత్ర ముగుస్తుంది.
 
పరామర్శ యాత్రతో  పార్టీ పటిష్టం
వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్
 సాక్షి, బళ్లారి : వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లా సూర్యప్రకాశ్ తెలిపారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల సోమవారం నుంచి తెలంగాణలో చేపట్టనున్న పరామర్శ యూత్రతో అక్కడ పార్టీ పుంజుకుంటుందని ఆయన చెప్పారు. ఆమెరాక కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారిలో ఎంపీ బి.శ్రీరాములును ఆయ న మర్యాదపూర్వకంగా కలుసుకున్న అనంతరం ‘సాక్షి’తో మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement